
సాక్షి, హైదరాబాద్: ‘‘ఫెడరల్ ఫ్రంట్ లేదు, ఏ ఫ్రంటూ లేదు. టీఆర్‌ఎస్‌లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో అంతర్గతంగా సమస్యలేవో ఉన్నట్టున్నాయి. ఇదంతా స్థానిక సమ స్యలు చర్చకు రాకుండా దృష్టి మళ్లించే ఎత్తుగడ’’ అని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘‘ఈ ఫ్రంటు గురిం చి నాతో ఎవరూ మాట్లాడలేదు. ఇలాంటి ఎత్తుగడలను మీరు పట్టించుకోవాల్సిన పని లేదు’’అని తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలకు సూచించారు.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో జరిగిన సమావేశంలో బాబు మాట్లాడారు. ఫ్రంట్ లు, పొత్తుల గురించి పట్టించుకోకుండా తెలం గాణలో పార్టీ బలం పెంచుకోవడానికి పని చేయాలని వారికి సూచించారు. ‘‘తెలంగాణ లో త్రిముఖ పోటీ ఉంటుంది. తద్వారా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి అవకాశాలుంటాయి’’ అని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మెతక వైఖరితో ఉండకుండా సమస్యలపై పోరాడాలని ఆదేశించారు. ‘‘రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు పక్షపాతం లేకుండా విశాల దృక్పథంతో వ్యవహరించాలి. గ్రూప్ రాజకీయాలొద్దు’’అంటూ మందలించారు. టికెట్లను చాలా ముందుగానే ప్రకటిస్తానని చెప్పారు.
‘‘పార్టీ కార్యక్రమాలు సరిగా నడవడం లేదు. పార్టీపరంగా బలోపేతం కావడంపై దృష్టి పెడితే ఎవరైనా పొత్తుల కోసం వస్తారు. బలహీనంగా ఉంటే ఎవరూ పట్టించుకోరు?’’ అని అన్నారు. ‘‘కర్ణాటక ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు చాలా ఉంటాయి. అప్పటిదాకా రాజకీయ ముఖచిత్రంపై అంచనా రాదు. పొత్తు విషయంలో బీజేపీ తొందరపడి నష్టపోయింది. టీడీపీని అంటరాని పార్టీ అన్నట్టుగా మాట్లాడినందుకు చాలా నష్టపోతుంది’’ అన్నారు.
బీజేపీతో తెగదెంపులే: రావుల
భేటీ వివరాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ మహానాడు ఉంటుందన్నారు. 24న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ మహానాడు నిర్వహిస్తామన్నారు. దీనికి బాబు హాజరవుతారని చెప్పారు. బీజేపీతో తెగదెంపులైందని భేటీలో బాబు ప్రకటించారని వెల్లడించారు. భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నేతలు పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, అన్నపూర్ణమ్మ, అమర్‌నాథ్‌బాబు, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరవలేదు.
Comments
Please login to add a commentAdd a comment