ప్రతిభకు పట్టం కట్టారు. ఆదినుంచి పార్టీపై చూపించిన విధేయతకు పురస్కారం లభించింది. ఊహకు వాస్తవికతను జోడించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చూపించినఆత్మీయతకు జిల్లానే జేజేలు పలికింది. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు మంత్రి పదవి వరించడంతో బీసీ వర్గమే పులకించిపోయింది.
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘బీసీలంటే బేక్ వర్డ్ కాస్ట్ కాదు...బేక్ బోన్ కాస్ట్’గా భావించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ఆ కులానికి పెద్దపీట వేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీలను పావులుగా మాజీ సీఎం చంద్రబాబు వాడుకుని గాలికొదిలేశా రు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి బుధవారం మంత్రి వర్గంలోకి జిల్లా నుంచి చెల్లుబోయిన వేణును తీసుకునే వరకూ బీసీలపై సీఎం అచంచలమైన అభిమానా న్ని చూపిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ బీసీలకు పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ వస్తున్న సీఎం తాజా మంత్రివర్గ విస్తరణలో మరోసారి ఆ వర్గాలకు పెద్దపీట వేసి ఆ వర్గం అభిమానాన్ని మూ టగట్టుకున్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అనుంగు శిష్యుడిగా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న రామచంద్రపురం ఎమ్మె ల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ సామాజికవర్గం సంబరాలలో మునిగితేలుతోంది. తొలి నుంచీ జిల్లాలో పార్టీ వ్యవహరాల్లో జగన్ బలహీన వర్గాలకు అగ్రాసనం వేస్తూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం తరువాత వైఎస్సార్‌సీపీ జిల్లా పగ్గాలను బీసీలకే అప్పగించారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా జిల్లా పగ్గాలను ఓసీలకే కట్టబెట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ప్రాంతీయ పార్టీలపరంగా ఆ సంప్రదాయాన్ని తిరగరాసిన ముఖ్యమంత్రిగా జగన్ జిల్లా చరిత్రలో నిలిచిపోయారు. మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయికి పార్టీ జిల్లా సారధ్య బాధ్యతలు అప్పగించి 2014 సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్న విషయం విదితమే.
బోసు విషయంలోనూ...
కేవలం పార్టీ పగ్గాలకే పరిమితం చేయకుండా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ముఖ్యమంత్రి తరువాత ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి బీసీ పక్షపాతిగా నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బోస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తదితర కీలక శాఖలను అప్పగించారు. మండలి రద్దుకు సిఫార్సు నేపథ్యంలో ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు బోస్ రాజీనామా చేశారు. అత్యున్నతమైన పెద్దల సభకు పంపించారు. రాజ్యసభకు బీసీ నాయకుడ్ని పంపించడం ఇన్నేళ్ల జిల్లా చరిత్రలో ఏనాడూ లేదు. టీడీపీలో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాలి లేదా, చంద్రబాబు సామాజికవర్గమైనా అయి ఉండాలనేది నానుడి. టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడుకి పెద్దల సభలో అడుగు పెట్టాలనేది చిరకాల కోరిక. చంద్రబాబు ఏనాడూ ఆ ఆలోచనే చేయలేదు. అందుకు భిన్నంగా బీసీలకు నిజమైన ప్రాతినిధ్యం కల్పించింది ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని బీసీలు ప్రశంసిస్తున్నారు. బోస్ రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీని కూడా మరో ఆలోచన లేకుండా అదే సామాజికవర్గానికి అప్పగించడం సీఎం జగన్‌కే చెల్లుతుందని ఆ వర్గం జేజేలు పలుకుతోంది.
ప్రతిభకు పట్టం...
జెడ్పీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుని సీఎం మరోసారి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరొందిన దివంగత జక్కంపూడి రామ్మోహనరావు శిష్యుడిగా అతని అడుగు జాడల్లో రాజకీయాలను వేణు వంట పట్టించుకున్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ లౌక్యం తెలిసిన నాయకత్వ పటిమతో ఇటు నియోజకవర్గంలో స్థానికేతరుడనే ముద్రను చెరిపేస్తూ ప్రజలకు పరిపాలనలో ఒక మార్పును చూపించడం, మరోపక్క అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా వేణు వినూత్నమైన ఆలోచనలతో విప్లవాత్మకమైన సంస్కరణలతో జిల్లా అంతటా మంచి పేరు తెచ్చుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఏడాది తిరిగే సరికి కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు.
రాజకీయ చతురత, ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే వాక్‌చాతుర్యం, అందరినీ సమన్వయం చేసుకోగలిగే రాజకీయ చతురత, భిన్నమైన రాజకీయ దృక్కోణం కలగలిపి వేణు అని చెప్పుకునేలా బలమైన నాయకుడిగా ఎదిగారు. అందునా పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి జగన్ మాటకు కట్టుబడి 2013లో కాకినాడ రూరల్‌లో పార్టీ కోఆర్డినేటర్‌గా, 2014లో అదే నియోజకవర్గం నుంచి పిల్లి అనంతలక్ష్మిపై పోటీచేయడం, 2016లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ వాణిని రాష్ట్ర స్థాయిలో వినిపించడం, ఎందరు ఎన్ని అవంతరాలు కల్పించినా వెరవకుండా 2018లో రామచంద్రపురం పార్టీ కోఆర్డినేటర్‌గా స్థానికేతరుడిగా బరిలోకి దిగి 2019లో కాకలుతీరిన తోట త్రిమూర్తులుపై గెలుపొందడం వంటి ప్రధానమైన అంశాలు మంత్రి పదవికి గీటురాయిగా నిలిచాయంటున్నారు. జిల్లాలో ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలుండగా జూనియర్ ఎమ్మెల్యే అయినా వేణుకు మంత్రి పదవి దక్కడం వెనుక అతని నాయకత్వ పటిమే కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. పెద్దల సభకు సుభాష్‌చంద్రబోస్ వెళ్లిపోవడంతో జిల్లాలో ఆ సామాజికవర్గం నుంచి బలమైన ముద్ర కలిగిన నాయకుడిగా వేణు మాత్రమే కనిపిస్తున్నారు. వేణుకు మంత్రిపదవి వరించడానికి ఈ అంశం కూడా కలిసి వచ్చింది. మొత్తం మీద అతి తక్కువ వ్యవధిలో మంత్రి పదవిని దక్కించుకున్న వేణు జిల్లా భవిష్యత్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతారనేది రాజకీయ విశ్లేషకుల భావన.
Comments
Please login to add a commentAdd a comment