సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీమాంధ్ర రాజకీయ నేతల వెకిలిచేష్టలు చూస్తుంటే బాధేస్తోందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ప్రగతిభవన్ నుంచి డబ్బులు ఏపీకి పంపారని, హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలను కొడుతున్నారనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడి ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. పవర్‌స్టార్ జోకర్ స్టార్ కావొద్దని సూచించారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు, పవన్, బండ్ల గణేశ్, బెల్లంకొండ ఆస్తులపై ఏనాడైనా దాడి జరిగిందా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఇంజనీర్లను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాదని కాళేశ్వరం ప్రాజెక్టును సీమాంధ్ర కాంట్రాక్టర్లు చేపట్టిన విషయం ఈ నేతలకు తెలియదా..
అని ప్రశ్నించారు. కట్టుబట్టలతో తెలంగాణ నుంచి తరిమికొట్టారని చంద్రబాబు అనడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాడినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడాన్ని జిమ్మేదార్ అంటారా.. అని కేటీఆర్ మాటలను ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.2 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌లో 240 మందికిపైగా పోటీ చేయడంతోనే కేసీఆర్ పరువు గంగలో కలిసిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, లేకుంటే ఇలానే జరుగుతుందన్నారు. దేశం మొత్తం వీవీ ప్యాడ్లను లెక్కించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment