సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిలా శ్రమించాల్సింది. ఆయనలా పాదయాత్రలతో వివిధ వర్గాలను సమీకరించాల్సి ఉండే..’అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ప్రజా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి మొదట నకిరేకల్ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు వార్తలు వెలువడినా, ఆ తర్వాత దక్కలేదు. అయినా, కూటమిలో కొనసాగుతూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నాం’అని ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. తెలంగాణ ఇచ్చిన ఘనతను కాంగ్రెస్ ఉద్యమంగా ముందుకు తీసుకురాలేకపోయింది. కేసీఆర్‌పై వ్యతిరేకత ఆయుధం తప్ప ఇతర ఆయుధాలేవీ లేనట్టు వ్యవహరించింది. ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేక పోయింది. ఈ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.
కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందించిన వైఎస్సార్
రాష్ట్రంలో గతంలో మరణశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆక్సిజన్ అందించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు తక్కువేం కాదు. ఈ సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేసుకోలేదు. వైఎస్సార్ పథకాలను కాంగ్రెస్ ఓన్ చేసుకోలేక పోయింది. వైఎస్‌ఆర్ తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. పాదయాత్ర ద్వారా 90 శాతం ప్రజానీకానికి ఆయన చేరువయ్యారు. ఆ పనిని తెలంగాణ కాంగ్రెస్ చేయలేక పోయింది. ఒక నాయకుడు అధికారం దక్కించుకోవడానికి వైఎస్ జగన్‌లా చమటోడ్చాలి. ఆయనను చూసి నాయకులు ఎంతైనా నేర్చుకోవాలి.
బీసీలను విస్మరించిన టీడీపీ
ఎన్టీఆర్ రాకతో సామాజిక మార్పులు చోటు చేసుకుని కింది స్థాయి వర్గాలకు అధికారం అందుబాటులోకి వచ్చింది. టీడీపీ పునాదులు బీసీ, అణగారిన వర్గాల్లోనే ఉన్నాయి. చంద్రబాబును ఖమ్మం, కూకట్‌పల్లికి పరిమితం చేసి ఉంటే బావుండేది. హైదరాబాద్ నిర్మాతను తానే అని తెలంగాణ ఉద్యమ కారులను రెచ్చగొట్టిన చంద్రబాబు, ఆధునిక తెలంగాణ నిర్మాతను అని అనడం పాత గాయాన్ని కెలకడమే. ఈ ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ తీసుకున్న 13 సీట్లలో బీసీలను విస్మరించింది.
బీసీని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి
టీపీసీసీ సారథి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గతంలోని భూస్వామ్య మసస్తత్వాలున్న నేతలకంటే భిన్నంగా ఉండడం మహాకూటమికి కలిసివచ్చే అంశం. ఎవరికి వారుగా అభ్యర్థులను నిర్ణయించుకని, వారి చుట్టే రాజకీయం తిరగకుండా అదుపు చేసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఉత్తమ్‌పై నేను పోటీ చేస్తానని ప్రకటించడం..వ్యక్తీకరించిన నిరసన సామాజిక వర్గాల తరఫున మాత్రమే. కాంగ్రెస్ బీసీని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలన్నది మా డిమాండ్.
వైఎస్సార్ స్ఫూర్తిని అందుకోని కాంగ్రెస్
Published Tue, Dec 4 2018 6:04 AM | Last Updated on Tue, Dec 4 2018 6:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment