న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార బీజేపీ కేవలం 21 స్థానాల్లోనే ముందంజలో ఉంది. దీంతో కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీయే ప్రతిపక్షాలు జార్ఖండ్ ఫలితాలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే శివసేన, ఎన్సీపీలు స్పందించగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం స్పందించారు. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అధికార పీఠాన్ని చేజిక్కిచుకోనున్న క్రమంలో బీజేపీపై చిదంబరం విమర్శలు గుప్పించారు. (సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!)
‘నరేంద్ర మోదీ, అమిత్ షా పాలనను మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రజలు తిరస్కరించారు. హర్యానాలో కూడా స్వల్ప మెజార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ బీజేపీ 2019 కథ. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్‌తో ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి ముందుకు రావాలి. బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూడటం ఖాయం’ అని ట్వీట్ చేశారు.(జార్ఖండ్ ఫలితాలు; మోదీ, షాలకు గర్వభంగం)
ఇక ఇదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన,ఎన్సీపీ స్పందించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతోందని, వీటికి జార్ఖండ్ ఫలితాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నాయి. ప్రధాని, అమిత్ షా, అహంకారాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచి పెట్టారని, ప్రజాస్వామ్యం గెలిచిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సైతం బీజేపీపై విరుచుకుపడ్డారు. అమిత్ షా నేతృత్వంలోని పార్టీని గిరిజనులు, పేద ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment