
సాక్షి, న్యూఢిల్లీ : భారత జనతాపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి చిదంబరం కుటుంబంపై విరుచుకుపడ్డారు. కేంద్రమాజీ మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తీ ఇద్దరూ తీహార్ జైలుకు వెళ్లాల్సిన వాళ్లేనని స్వామి అన్నారు. చిదంబరం కుటుంబాన్ని మోసగాళ్ల ఫ్యామిలీగా స్వామి అభివర్ణించారు. కార్తీ అతి పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. మంచి చదువు లేదు.. మంచి ఉద్యోగం చేయలేదు.. అయినా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని, ఇంత సంపదను ఎలా సృష్టించారని స్వామి ప్రశ్నించారు.
వ్యాపారస్తుల దగ్గర అక్రమంగా కార్తీ అక్రమంగా డబ్బును వసూలు చేశారని.. అందువల్లే ఇంత సంపదను సాధించారని చెప్పారు. ఇక చిదంబరం భార్య నళిని సైతం ఇలాగే డబ్బులు వసూలు చేసేవారని స్వామి ఆరోపించారు. చిదంబరం ఫ్యామిలీని తీహార్ జైలుకు పంపాలని స్వామి అన్నారు. కార్తి చిదంబరం విదేశీ బ్యాంకుల్లో ఉన్న తన అకౌంట్లను మూసివేసేందుకే విదేశాలకు వెళుతున్నారని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిన తరువాత స్వామి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.