మాట్లాడుతున్న తోట వాణి
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు.
అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు.
కేసు నమోదు
2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్‌లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్‌లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment