
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని తమ కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్బోధించడంపై సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. రౌడీషీట్‌తో పాటు 62 కేసులున్న చింతమనేనిని స్ఫూర్తిగా తీసుకోవాలని అధినేత చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని, చింతమనేని బాధితులకు ఆవేదన ఎందుకు వినడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
చింతమనేనిని ఆదర్శంగా తీసుకోండి..
టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో చింతమనేనిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ నేతలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌ది దుర్మార్గ పాలన అని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితి టీడీపీకి లేదన్నారు. జగన్ టాక్సు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు. ఇంగ్లిష్ మాధ్యమం, ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలు కొందరికే వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. తన దగ్గరకు వస్తే వర్షాకాలంలో సైతం ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పిస్తానన్నారు.
రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలా?
చంద్రబాబుపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం
దెందులూరు: రౌడీషీట్‌తో పాటు 62 కేసులున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయాలకు స్ఫూర్తి అని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతమనేనిపై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు అంటున్నారని.. ఆయనపై కేసులు టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసినవే అని చెప్పారు. ఇసుక, మట్టి కొల్లగొట్టిన డబ్బును చింతమనేని అప్పజెప్పటం వల్లే ఆయనకు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. చింతమనేని బాధితులనూ చంద్రబాబు కలుసుకుని ఆవేదన వినాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment