పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్
దేశ రాజధానిలో జిల్లాకు చెందిన ఎంపీలు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించారు. బడ్జెట్ సమావేశాల్లో జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి లోక్‌సభలో అరుదైన గౌరవం లభించింది. లోక్‌సభా పక్ష నేతగా.. ప్యానల్ స్పీకర్‌గా ఎంపికయ్యారు.
సాక్షి, తిరుపతి: పార్లమెంటు సమావేశాల్లో జిల్లాకు చెందిన ఎంపీల సూచనలపై కేంద్ర మంత్రులు స్పందించారు. అభివృద్ధికి సహకరిస్తామని హామీలు ఇచ్చా రు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై 2014లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆయన ప్రసంగించా రు. కడప స్టీల్‌ప్లాంట్ గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా గడచిన రెండేళ్లుగా ఇవ్వలేదని ప్రస్తావించారు. కస్తూర్బా బాలికా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. చింతపండుపై విధించిన 5 శాతం జీఎస్టీతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చింతపండుపై చిన్నచిన్న వ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నారని, ఇది నిత్యావసర వస్తువు కావడంతో ప్రజలపై భారం పడకుండా చిన్న వ్యాపారులు చితికిపోకుండా జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.
కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు నిధులివ్వండి
చిత్తూరు–బెంగళూరు మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. కడప–బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ 2008–09లో ప్రకటించినా ఇప్పటివరకు నిధులు విడుదల చెయ్యలేదని గుర్తుచేశారు. చిత్తూరు–బెంగళూరు వయా కోలార్ రైల్వే లైన్ కూడా ఏళ్ల క్రితం ప్రకటించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. దామలచెరువు వద్ద ఉన్న మ్యాంగో నగర్ నుంచి వేల లారీల ద్వారా మామిడి కోల్‌కతా, చెన్నై, బెంగళూరుకు మామిడి ఎగుమతులు జరుగుతున్నాయని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు రైల్యే లైన్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో రైల్వే స్టేషన్ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని, సరిపడా నిధులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి స్టేషన్లకు వస్తుంటారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు, సదరు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
ఆ 34 మంది విద్యార్థులకు న్యాయం చెయ్యండి
తిరుపతి కేంద్రీయ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థులు సైన్స్‌లో ఫెయిల్ అయ్యారని, తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాసినా మరోసారి ఫెయిల్ అయిన విషయాన్ని లోకసభలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రస్తావించారు. ఆ 34 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిస్తే వేరే పాఠశాలలో చేర్చుకోమని చెప్పి పంపిన విషయాన్ని తప్పుబట్టారు. ఆ విద్యార్థులను పదో తరగతికి ప్రమోట్ చెయ్యాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని కోరారు. విద్యార్థులకు తాగునీటి కొరత ఉందని, అయితే ఉపాధ్యాయులు నీటి కొనుగోలుకు విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చెయ్యటం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరుకు అనేకమంది భక్తులు వస్తుంటారని అయితే విమాన సర్వీసులు అందుబాటులో లేవని ఆయన లోక్‌సభలో ప్రస్తావించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment