
మాట్లాడుతున్న సినీనటుడు అలీ
సాక్షి, కదిరి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం కదిరి పట్టణంలో నిర్వహించిన సినీనటుడు అలీ రోడ్‌షో భారీ సక్సెస్ అయింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం రోడ్‌షోలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంఎస్ లాడ్జి వద్ద ప్రారంభమైన రోడ్ షో వలీసాబ్‌రోడ్, రాయలసీమ సర్కిల్, తేరు బజార్, ఎక్బాల్ రోడ్ మీదుగా కొలిమి సర్కిల్ చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సభలో అలీతోపాటు వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి రెహమాన్, మైనార్టీ సెల్ రాష్ట అధ్యక్షుడు ఖాదర్‌బాషా, ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పీవీ.సిద్దారెడ్డి ప్రసంగించారు.
‘కదిరి, జగను, మాధవ, సిద్దయ్య ఇలా మూడక్షరాలతో ఏర్పడిన పేర్లు చాలా బాగున్నాయని, ఈ కలయిక విజయానికి మారుపేరు’ అని సినీ నటుడు అలీ చెప్పడంతో జనం ఈలలు, కేకలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. 100 మంది చంద్రబాబులు వచ్చినా ఈసారి ఫ్యాను గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి రెహమాన్ అన్నారు. నోరు కూడా సరిగా తిరగని లోకేష్‌ను చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలని తాపత్రయ పడుతున్నారని, అయితే జగన్ మాత్రం బడుగు, బలహీన వర్గాల వారిని చట్టసభలకు పంపాలని తపన పడుతున్నారని హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అనడంతో సభ ఈలలు, కేకలతో హోరెత్తిపోయింది.