సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించడం గమనార్హం. దీన్నిబట్టే ఇక్కడి నేతల మధ్య విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. అందరినీ కలుపుకొని పోవడం లేదని మంత్రి అఖిలప్రియను సీఎం మందలించారు. ఇక కర్నూలు నియోజకవర్గంలో కూడా ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల బదిలీల వ్యవహారంలోనూ ఇద్దరి మధ్య వైరం నడుస్తోంది. కర్నూలు సీటు తనదేనంటూ టీజీ భరత్ ఇప్పటికీ ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని సీఎం వద్ద ఎస్వీ ప్రస్తావించినట్టు సమాచారం. ఇక మంత్రి అఖిలప్రియ తనపై పనిగట్టుకుని కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సీఎం వద్ద వాపోయినట్టు తెలిసింది. ఇదే విషయమై కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. సీఎంతో సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పులేదు. కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తో కూడిన కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా విభేదాలను పరిష్కరించే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమన్వయ కమిటీ నుంచి...
వాస్తవానికి అధికార పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై నేతలతో చర్చించింది. అయితే, ఏ ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో తాజాగా త్రిసభ్య కమిటీ తెర మీదకు వచ్చింది. ఈ కమిటీ నేతృత్వంలో కూడా విభేదాలు తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కనీసం మాటలు కూడా లేవు. నంద్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గం విషయంలోనూ అటు ఫరూఖ్ వర్గానికి, ఇటు అఖిలప్రియ వర్గానికి మధ్య రాజీ కుదరలేదు. కర్నూలు మార్కెట్ కమిటీదీ అదే పరిస్థితి. ఇక్కడ ఎస్వీ, టీజీ మధ్య రాజీ కుదరకపోవడంతో ఏడాది కాలంగా పాలకవర్గం ఏర్పాటు కావడం లేదు. నందికొట్కూరులో బైరెడ్డి రాకను శివానందరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బైరెడ్డి రాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. అయితే, త్వరలో బైరెడ్డి కూడా టీడీపీలో చేరితే.. ఆ తర్వాత విభేదాలు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోడుమూరులో ఇప్పటికీ విష్ణు–మణిగాంధీ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తమ మధ్య రాజీ ప్రయత్నం వద్దని కూడా ఇరువర్గాలు త్రిసభ్య కమిటీకి తేల్చిచెప్పే పనిలో ఉన్నాయి. మొత్తమ్మీద అధికారపార్టీలో విభేదాలు ఏ మాత్రమూ సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment