
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కియా ఎండీ, చిత్రంలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కృష్ణాజలాలు జిల్లాకు వచ్చాయి కాబట్టే ఈ రోజు కియా కార్లపరిశ్రమ ఏర్పాటవుతోందని, గొల్లపల్లికి నీళ్లు రాకపోతే కియా వచ్చేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కియా మోటార్స్ రూప కల్పన ప్రక్రియ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన పెనుకొండ సమీపంలోని కియా మోటార్స్ ప్లాంట్‌కు విచ్చేశారు. కియా ప్రెసిడెంట్ హాన్‌వూపార్క్‌తో కలిసి కియా మోటార్స్ ప్రాముఖ్యతను వివరించారు. ‘అనంత’ వెనుకబడిన ప్రాంతమని, కియా లాంటి పరిశ్రమలు మరిన్ని జిల్లాకు రావాలని కాంక్షించారు. కియా కారు ఆ దేశంలో అత్యంత పేరున్న కంపెనీ అని, భారతదేశంలో తొలిప్లాంటు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బెంగళూరు–హైదరాబాద్, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలో ‘ట్రై జంక్షన్’గా ప్లాంటు ఏర్పాటవుతోందని, భారతదేశానికి మధ్యలో ఉందన్నారు. ప్లాంటు ఏర్పాటుకు కృషి చేసిన పరిశ్రమల శాఖ కార్యదర్శి సొలమన్ ఆరోగ్యరాజ్, ప్రభుత్వ సిబ్బందిని అభినందించారు. కార్ల ఉత్పత్తిలో 90శాతం దేశీయ మార్కెట్‌లో విక్రయించి, 10శాతం ఎగుమతి చేస్తారన్నారు. ప్లాంటుకు 675 ఎకరాలు ఇచ్చామని, కొరియన్ టౌన్‌షిప్‌కు మరో 335 ఎకరాలు ఇస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, మనం ఆర్థికంగా పురోగతి సాధించాలంటే పారిశ్రామిక ప్రగతి ముఖ్యమన్నారు. ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారుతుందన్నారు. టైర్ల కంపెనీ, ఇతర అనుబంధ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ‘అనంత’ వాసులు కియాలో ఉద్యోగాలు సాధించేలా స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం కియా మోటార్స్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అక్కడున్న స్తంభాలపై సంతకాలు చేశారు. వీటిని వెంటనే రూఫ్ లెవల్‌లో అమర్చారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పెనుకొండ రోడ్డు వెడల్పునకు రూ.1.5కోట్లు, గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లే రోడ్డు విస్తరణకు రూ.5కోట్లు మంజూరు చేశారు. పెనుకొండలో అర్బన్ హౌసింగ్ కింద వెయ్యి గృహాలను మంజూరు చేశారు. అవసరమైతే 1+2 కింద ఇళ్లు నిర్మిస్తామన్నారు.
కియా ప్లాంటు కోసం భూములు కోల్పోయిన 32మంది రైతుల పరిహారానికి సంబంధించి రైతులతో మాట్లాడి నివేదికను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ వీరపాండియన్‌ను ఆదేశించారు. సీఎం ప్రసంగిస్తుండగానే హైకోర్టును సీమలో ఏర్పాటు చేయాలని పలువురు న్యాయవాదులు నినాదాలు చేశారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ ఇది సరైన పద్ధతి కాదని, నేరుగా వచ్చి మాట్లాడాలని వారించారు. ఇంతలో పోలీసులు న్యాయవాదులను అదుపులోకి తీసుకొని బయటకు తరలించారు. కార్యక్రమంలో మంత్రులు అమరనాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జవహర్, చీఫ్‌విప్ పయ్యావుల కేశ్, విప్ యామినీబాల ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, అత్తార్‌చాంద్‌బాషా, కలెక్టర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచశ్రేణి ఉత్పత్తులు అందిస్తాం: హాన్‌వూపార్క్, కియా ప్రెసిడెంట్
ఏపీతో పాటు భారత్‌లో కియా అద్భుత మార్పులను తీసుకొస్తోంది. ఇక్కడ మంచికార్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి రాలేదు. ఆటోమోటివ్ లైఫ్‌స్టైల్‌లో నూతన ప్రమాణాలను, ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను భారతీయులకు అందిస్తాం. భారత ప్రజలతో మమేకమై, ఇక్కడి సమాజానికి తిరిగి కొంత ఇవ్వాలని కోరుకుంటున్నాం. త్వరలోనే 3వేల మంది ఉద్యోగులను నియమిస్తాం. వృతినైపుణ్యంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం.
కొరియన్లపై భారతీయులు ఆదరాభిమానులు చూపాలి: కోహ్యూ షిమ్, ఎండీ, కియా.
ఏపీ ప్రభుత్వంతో 10 నెలల కిందట ఎంఓయూ చేసుకున్నాం. అనంతపురం ప్రజలతో చక్కటి సంబంధ, బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆదరాభిమానాలు చూపుతున్నారు. కార్ల పరిశ్రమతో ఇక్కడ కియా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడి ప్రజలు ఇదే ఆదరాభిమానాలు చూపాలి.
రైతుల చేతుల్లో బొచ్చె
అనంతపురం అర్బన్: కియా పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతుల చేతిలో కంపెనీ యాజమాన్యం బొచ్చ పెట్టింది. ఫ్రేమ్ వర్క్ ఇన్‌స్టలేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మెడలో ఒక ట్యాగ్ వేసి ఒక కంచం, రెండు గ్లాసులను కంపెనీ నిర్వాహకులు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు మాత్రం ఖరీదైన గిఫ్ట్‌బాక్సులు, చేతి గడియారాలను బహుమానంగా అందజేశారు. భూములు ఇచ్చిన రైతులకు కంచం ఇవ్వడంపై పలువురు అధికారులు పెదవి విరిచారు.
Comments
Please login to add a commentAdd a comment