
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన నేపథ్యంలో సీఎం బంపరాఫర్ ప్రకటించినట్లు సమాచారం. ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేవారి ఖర్చు మొత్తం పార్టీ భరాయిస్తుందని ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓడిపోయే సీటులో తెలిసి తెలిసి ఎవరు పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలే పేర్కొంటుండడం గమనార్హం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది.
ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మంచి ఆధిక్యతతో ఉంది. ఈ పరిస్థితిలో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గెలుపు సాధ్యమయ్యేది కాదని అధికార పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితిఉంది. దీంతో ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పార్టీనే ఖర్చు భరిస్తుందని ముఖ్యమంత్రి ఆఫర్ ప్రకటించినట్లు టీడీపీ వర్గాల్లోనే ప్రచారం ఉంది. మాగుంట పోటీ నుంచి విరమించుకున్నాక బీసీ అభ్యర్థిని పోటీలో నిలిపితే బాగుంటుందని ముఖ్యమంత్రితో పాటు జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో యాదవ సామాజికవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలపాలని ముఖ్యమంత్రి తొలుత భావించారు. ఈ విషయమై జిల్లా టీడీపీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. బీదా అభ్యర్థిత్వం పట్ల అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు బీదా కుటుంబం కొంత అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న ఒంగోలు నుంచి పోటీచేసి డబ్బులు పోగొట్టుకొని ఓడిపోవడం ఎందుకని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఖర్చు ఎంతైనా పార్టీనే పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. డబ్బులు మొత్తం పార్టీ పెట్టుకొనే పక్షంలో పోటీకి సిద్ధమని బీదా సోదరులు అంగీకారం తెలిపినట్లు తాజా సమాచారం.
ఒంగోలు బరిలో మాజీ డీజీపీ..?
మరోవైపు ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ డీజీపీ నండూరి సాంబశివరావును పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాంబశివరావు ఒంగోలుకు చెందిన వ్యక్తే. ఇదే జిల్లాలోనే ఆయన వివాహం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు బంధుత్వం కూడా ఉంది. సాంబశివరావును ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలిపే విషయంపై ముఖ్యమంత్రి మంగళవారం జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. బీదా, మాజీ డీజీపీలలో ఎవరైతే మెరుగ్గా ఉంటుందని సీఎం ఆరాతీశారు. ఇద్దరిలో ఎవరైనా వారి సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకొనే అవకాశముందని జిల్లా టీడీపీ నేతలు ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని, పార్లమెంట్‌కు పోటీచేసే అభ్యర్థిని ఖరారు చేస్తానని జిల్లా నేతలకు ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment