
తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌వీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్:
‘‘విద్యార్థి రాజకీయాల్లో ఇష్టంగా పనిచేయండి. కష్టంగా వద్దు. ఏదో చేయాలి కాబట్టి చేయొద్దు. సాధించాలన్న పట్టుదల ఉండాలి. జిద్దుగా తీసుకుని పనిచేయాలి. ఈ తెలంగాణ మీదే. భవిష్యత్ ప్రజాప్రతినిధులు మీరే..’’అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ విద్యార్థి విభాగం(టీఆర్‌ఎస్‌వీ) నేతలకు దిశానిర్దేశం చేశా రు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగి న టీఆర్‌ఎస్‌వీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మెల్యేగా తన పనితీరు, తన అనుభవాలను వివరించారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఏపీ వరకు జరిగిన పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలనను వారికి తెలియజేశారు. 10 లక్షల సభ్యత్వాలు నిర్దేశిస్తే 11 లక్షలు పూర్తి చేసిన బాధ్యులను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. సమావేశంలో విద్యార్థి విభాగం భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. విద్యార్థి విభాగం ఒక సైన్యంలా పని చేయాలని, వారం రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. శిక్షణ తరగతులు పూర్తయ్యాక హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు.
80 సీట్ల దాకా గెలుస్తాం..
తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని, భవిష్యత్ విద్యార్థులదే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యార్థి విభాగానికి ఒక ఎమ్మెల్సీతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 3 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని విద్యార్థి నేతలకు సూచించారు. ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించుకుని ప్రజలకు వివరించాలన్నారు. మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ల ఆధ్వర్యంలో విద్యార్థుల కార్యక్రమాలు చేపడతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పనులనూ పరిశీలించాలని సూచించారు. ‘‘ముందు మీరు అవగాహన పెంచుకోండి. గత పాలనకు, మన పాలన మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ప్రతిపక్షాలు మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టండి. ఆ స్థాయిలో విషయ పరిజ్ఞానం పెంచుకోండి. ప్రభుత్వం పేదలు, వివిధ రంగాల వారి కోసం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని ప్రజలకు వివరించండి.
ఏమైనా అంశాలు మీకు తెలిస్తే.. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పాత పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి ఎన్నికల్లో జిల్లాకు కనీసం 8 స్థానాల చొప్పున 80 సీట్ల దాకా గెలుస్తాం. కష్టపడితే మిగిలిన సీట్లూ మనవే..’’అని అన్నారు. టీఆర్‌ఎస్‌వీ సభ్యత్వ రుసుము రూపంలో రూ.30 లక్షలు సమకూరాయి. దీనికి మరో రూ.కోటి కలిపి నిధిని ఏర్పా టు చేస్తామని సీఎం ప్రకటించారు. భవిష్యత్‌లో విద్యార్థి విభాగం నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థి విభాగంలో పనిచేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పదవులు పొందారని, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్, చైర్మన్ పదవులు పొందిన వాసుదేవరెడ్డి, రాకేశ్ తదితరులను ఇందుకు ఉదాహరణగా చూపారు. ఈ సమావేశంలో మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీలో కొత్తగా నియమితులైన పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment