కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం | CM KCR Says Rayalaseema Will Become Ratnala Seema | Sakshi
Sakshi News home page

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

Published Tue, Aug 13 2019 1:58 AM | Last Updated on Tue, Aug 13 2019 5:25 AM

CM KCR Says Rayalaseema Will Become Ratnala Seema - Sakshi

కంచిలోని అత్తివరదరాజ స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు. చిత్రంలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా

సాక్షి, నగరి/రేణిగుంట (చిత్తూరు జిల్లా) : 70 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి కొత్త అధ్యాయాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి లిఖించబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు దాదాపు నిండి సముద్రానికి నీరు వెళ్లిపోతోందని.. ఆ నీరు వృథాగా పోకూడదనే ఉద్దే శంతోనే తామిద్దరం చర్చించి సానుకూల నిర్ణయానికి వచ్చామని ఆయన వెల్లడించారు. సోమవారం తమిళనాడు రాష్ట్రం కంచిలోని అత్తివరదరాజస్వామిని సీఎం కేసీఆర్‌ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఆయనకు ఎమ్మెల్యే రోజా, పూర్ణ కుంభంతో వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘కంచి దేవస్థానానికి విశేష దర్శనానికి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు శ్రద్ధ తీసుకున్నారన్నారు. కుమార్తె ఆర్కే రోజా మంచి ఆతిథ్యమిచ్చారు. అన్నదాత సుఖీభవ. రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరముంది. క్రియాశీలకంగా పట్టుదలతో పనిచేసే యువకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక తప్పకుండా ఇది సాధ్యమౌతుంది. అన్నగా రాయలసీమ ప్రజల కష్టాలు నాకు తెలుసు. అందుకే 100% నా ఆశీస్సులు, సహకారం ఆయనకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపాం. ఇప్పుడు నీరుంది. సుమారు వెయ్యి టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు దాదాపు నిండి సముద్రంలోని నీరువెళ్తోంది. ఆ నీరు అలా వృధాగా పోకూడదని ఆలోచించి నేను, జగన్‌మోహన్‌ రెడ్డి చర్చించి సానుకూల నిర్ణయానికి వచ్చాం. 70ఏళ్లలో లేనటువంటి కొత్త అధ్యాయాన్ని నేను, జగన్‌ కలిసి లిఖించబోతున్నాం. కొందరికి ఇది అర్థం కాకపోవచ్చు, జీర్ణం కాకపోవచ్చు, అజీర్తి కూడా కావచ్చు. ప్రజల దీవెన ఉన్నంత కాలం తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తాం. రాయలసీమను రతనాలసీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు వినియోగిస్తాం’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఆదిమూలం, ఎంఎస్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ ౖచైర్‌పర్సన్‌ రోజా నివాసంలో విందుకు హాజరైన కేసీఆర్‌ కుటుంబ సభ్యులతోఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి తదితరులు
 
కేసీఆర్‌కు సాదరస్వాగతం 
అంతకుముందు సీఎం కేసీఆర్‌కు సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కాంచీపురం శ్రీఅత్తి వరదరాజస్వామి దర్శనార్థం ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం 11.35గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, ఎంఎస్‌ బాబు, జిల్లా కలెక్టర్‌ ఎన్‌ భరత్‌ గుప్తా, అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్, ఆర్‌డీవో కనకనరసారెడ్డి, తహసీల్దార్‌ విజయసింహారెడ్డి, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ సురేష్, సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ శుక్లా, వైఎస్సార్‌ సీపీ నేతలు భూమన అభినయ్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, పోకల అశోక్‌ కుమార్, వల్లివేడు ఫృథ్వీరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన కాంచీపురానికి బయల్దేరి వెళ్లారు. కాంచీపురంలో ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అత్తి వరదరాజస్వామికి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్యాగరాజు ప్రసాదాలు అందజేసి సత్కరించారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవిత, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా, ఎంపీ మిథున్‌ రెడ్డి తదితరులున్నారు. వరదరాజస్వామి దర్శనం అనంతరం రాత్రి 7.10గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆయనకు విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సారథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన వేదపండితులు ప్రత్యేక ఆశీర్వచనమిచ్చారు. ఎమ్మెల్యే కేసీఆర్‌కు జ్ఞాపికను బహూకరించారు.  

కేసీఆర్‌ కుమార్తె కవితకు పట్టువస్త్రాలు అందజేస్తున్న రోజా. చిత్రంలో కేసీఆర్‌ సతీమణి శోభ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement