కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే  | CM KCR Speech In Telangana Assembly | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే 

Published Mon, Sep 23 2019 2:19 AM | Last Updated on Mon, Sep 23 2019 10:59 AM

CM KCR Speech In Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాగాంధీ గరీబీ హఠావో... నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో...’ఇవి తప్ప దేశంలో మరొకటి లేదా? దేశంలో ఈ దుస్థితికి ఎవరి విధానాలు కారణం. మన పక్కనే ఉన్న చైనా ఎక్కడిదాకా పోయింది. మనం ఎక్కడున్నాం. గుండెల మీద అణు బాంబులు వేసుకున్న జపాన్‌ ఎక్కడికి పోయింది. కాంగ్రెస్‌ హయాంలో సగానికి సగం జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు న్యాయం చేయండని ఆర్‌. కృష్ణయ్యను పట్టుకొని ఢిల్లీకి పోయినం. బీసీల కోసం ఒక మంత్రిత్వశాఖను కాంగ్రెస్, బీజేపీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఏ పూటకు ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకొని పోవడమే కాంగ్రెస్‌ పద్ధతా? కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందూ దొందే’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్‌ ఆదివారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల తీరును తూర్పారబట్టారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

కాంగ్రెస్‌ది బడాభాయ్, చోటాభాయ్‌ వ్యవహారం... 
‘తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేసింది. ప్రాజెక్టుల మీద కేసులు, ఉద్యోగ ప్రకటనల మీద స్టేలు తీసుకొచ్చింది. కాంగ్రెస్‌ వాళ్లు 900 కేసులు వేశారు. తెలంగాణ తెచ్చి తప్పు చేసినమని జానారెడ్డి అంటరు. ఎక్కువ తక్కువ చేస్తే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతామని బలరాం నాయక్‌ అంటరు. భవిష్యత్తులో ఆంధ్రా తెలంగాణ కలిసే అవకాశం ఉందని ఎంపీ జైరాం రమేశ్‌ అంటడు. బడాభాయ్‌ బడాభాయ్‌.. చోటాభాయ్‌ సుభాన్‌ అల్లా అన్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం ఉంది. 

అప్పులు ఇంకా తెస్తాం... 
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్‌ వాళ్లు మొత్తుకుంటున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన్ను అర్థం చేసుకోకుంటే ఎలా? అప్పులనేది దేనికి తెస్తున్నామనేదే ముఖ్యం. అప్పులు ఇంకా తెస్తాం. ఎవరేమీ మునిగిపోరు. బాగుపడతారు. రివైజ్డ్‌ ఫైనాన్స్‌ ఎస్టిమేట్‌లో బేషజాలకు పోలేదు. కోకాపేటలో 100 ఎకరాలు క్లియర్‌ అయింది. మరో చోట 150 ఎకరాల భూముల అంశం సుప్రీంకోర్టులో ఉంది. వాటిని అమ్మితే స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) కిందకు వస్తుంది. ఆర్థిక మాంద్యంలో ఎక్కడైనా ఏ శాఖలోనైనా లోటు ఏర్పడితే దానికి కేటాయిస్తాం. సాగునీటి ప్రాజెక్టులను, పేదల సంక్షేమాలను ఆపేది లేదు. అవసరమైతే ఎక్కడైనా కోత విధించి సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. 

ఆరు చందమామలు పెడితే మేం ఖరాబ్‌ చేశామా? 
ఉమ్మడి ఏపీలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనంటే ఇదే భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్‌గా ఈ కుర్చీలో వర్ధిల్లలేదా? తెలంగాణకు నిలువునా అన్యాయం జరుగుతుంటే శ్రీధర్‌బాబు మంత్రిగా ఇక్కడే కూర్చోలేదా? కాంగ్రెస్‌ హయాంలో మైనారిటీలను గోల్‌మాల్‌ చేయడం తప్ప ఏం జరగలేదు. ఢిల్లీ నాయకత్వానికి తలవొంచి నందికొండను నాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. మాట్లాడితే అప్పులు అంటున్నారు... నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ మీద అప్పులు తేలేదా? కాంగ్రెస్‌ పాలించి ఆరు చందమామలు ఏడు సూర్యుళ్లు పెడితే మేం ఖరాబ్‌ చేసినమా? 54 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చతికిల పడింది. 

మోదీ, షా ఆ మాటలు మానుకోవాలి 
కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వకపోగా రాష్ట్రాన్ని అవమానిస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో హామీలే తప్ప నిధులు రావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు మోదీ మానుకోవాలి. తెలంగాణ ఏర్పాటు డార్క్‌ డే అని అమిత్‌ షా అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడం సరికాదు. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. 

కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి దిగజారింది 
కాంగ్రెస్‌ సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారు. 33 జిల్లాల్లో ఎవరిని అడిగినా టీఆర్‌ఎస్‌ పాలన అద్భుతంగా ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ ఇప్పుడు 19కి పడిపోయింది. బీజేపీ 5 సీట్ల నుంచి ఒక సీటుకు పడిపోయింది. ఆ రెండు పార్టీల పరిస్థితి దిగజారింది. టీఆర్‌ఎస్‌ బలం 63 నుంచి 88కి పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయదుందు«బి మోగించాం. పక్క రాష్ట్రంలో పసుపు కుంకుమ అని చెప్పి ఆగమై పోయారు (చంద్రబాబును ఉద్దేశించి). ప్రజల్లో మనకు మద్దతు లేకపోతే అధికారులు కాపాడతారా? వారి చేతిలో ఓట్లు (హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ) ఉంటాయా? 

కౌలుదారులం గుర్తించం
రెవెన్యూశాఖలో అవకతవకలు ఎవరి పుణ్యం? వీఆర్‌వోలను మేం తీసేస్తామని చెప్పినమా? వీఆర్‌వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తం. పటేల్, పట్వారీ వ్యవస్థలు పోలేదా? దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానివ్వం. కౌలుదారులను మా ప్రభుత్వం గుర్తించదు. అది రైతులకు, కౌలుదారులకు మధ్య సంబంధం. నైతికత విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు.   

బీజేపీ వస్తే పథకాలు మాయం
ఎల్లుండే అధికారంలోకి వచ్చేలా బీజేపీ హడావిడి చేస్తోంది. ఏమీ లేనోడికి ఏతులెక్కువ అన్నట్లుగా పొరపాటున వారు అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పోయి ఆయుష్మాన్‌ భారత్‌ వస్తుంది. రైతుబంధు పోయి కిసాన్‌ సమ్మాన్‌ వస్తుంది. అంటే ఐదెకరాల రైతుకు రైతుబంధు కింద రూ. 50 వేలు ఇస్తుంటే, కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా వారు ఎన్ని ఎకరాలున్నా ఇచ్చేది రూ. 6 వేలే. రైతు బీమా ఉండదు... ఐదు లక్షలు ఇవ్వడం ఉండదు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో పెన్షన్‌ రూ. 600 మాత్రమే. సన్నబియ్యం పోయి దొడ్డు బియ్యం వస్తది. మహారాష్ట్రలో నాందేడ్‌ వారు 40 గ్రామాల సర్పంచులు తీర్మానం చేశారు. తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. బీజేపీ పాలన కంటే టీఆర్‌ఎస్‌ పాలన బాగుందని వారంతా అంటున్నారు.  

ఉద్యోగుల బెదిరింపులకు భయపడం... 
ఎవరో నలుగురు ఉద్యోగుల బెదిరింపులకు భయపడం. ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిక్టేట్‌ చేయజాలరు. అదే జరిగితే సభ ఎందుకు.. స్పీకర్‌ ఎందుకు, నేనెందుకు. కుక్క తోకను ఊపుతుంది కానీ తోక కుక్కను ఊపదు. చట్టం నిర్దేశించిన పని ఉద్యోగులు చేయాల్సిందే. లంచంలేని, పారదర్శక పాలన కోసం చట్టాలకు పదును పెడుతున్నం. అందులో భాగంగా రెవెన్యూ చట్టాన్ని కూడా పటిష్టం చేస్తున్నం. ప్రజల కోసమే తప్ప ఇది ఉద్యోగుల కోసం కాదు. అవసరమైతే సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తీసుకుంటాం తప్ప వారు చెప్పినట్లు చట్టం ఉండదు. అనవసరంగా పిచ్చి సమ్మెలు చేస్తే వారికే నష్టం. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలకు సవరణలు చేసిన నేపథ్యంలో ఇక రెవెన్యూ చట్టం బాకీ ఉంది. త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం.
 
రెండు, మూడు పథకాలు తెచ్చానో!
ఇప్పటివరకూ ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయి. అవి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉండదిక. మరో మూడు టర్మ్‌లు టీఆర్‌ఎస్‌దే అధికారం. ఎస్సీ వర్గీకరణపై ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లునూ పక్కన పడేశారు. హరితహారం ద్వారా అడవులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే అపహాస్యం చేస్తున్నారు. వ్యవస్థలను దారిలో పెడుతుంటే అడ్డుకుంటున్నారు. వృత్తిదారులను ఆదుకునే పథకాలు ప్రవేశపెడితే గొర్రెలు–బర్రెలు అని అవహేళన చేస్తున్నారు.

25న కానిస్టేబుల్‌ ఫలితాలు! 
త్వరలోనే కానిస్టేబుల్‌ పరీక్షల తుది ఫలితాలు విడుదల చేస్తాం. ఈ నెల 25న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల శిక్షణకు అవసరమైన స్థలం అందుబాటులో లేనికారణంగా శిక్షణ కోసం 6 వేల మందిని ఏపీకి పంపిస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడితే ఆయన అంగీకరించారు. 

అవసరమైనప్పుడు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు... 
ఇప్పుడు కేంద్రంలో ఒక పద్ధతి తయారైంది. మాట్లాడితే బెదిరింపులు వస్తున్నాయి. ఈ మధ్య కొత్త విద్య నేర్చారు. అవసరమైనప్పుడు ఈ రెండు పార్టీలు కలుస్తున్నాయి. జీఎస్టీపై గొంతెత్తి మాట్లాడాం. ఒక్క తెలంగాణ మాత్రమే కొట్లాడింది. కాంగ్రెస్‌ సీఎంలు కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ హయాంలో గొప్ప పాలన జరిగి ఉంటే దళితులకు సబ్‌ ప్లాన్‌ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది. కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా బీజేపీ అన్యాయం చేస్తోంది. అన్యాయంపై మాట్లాడేవారిని అడ్డుకుంటున్నారు. అవసరమైతే రెండూ కుమ్మక్కుకావడం.. ఇది కొత్తగా వచ్చింది. దుర్మార్గాలకు బ్రీడింగ్‌ సెంటర్‌ కాంగ్రెస్సే. మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్‌ దందాలు ఎవరి హయాంలో జరిగాయో తెలుసుకోవాలి. 

చేతికే పైసలిస్తం... 
రైతు జేబులో సొంత పెట్టుబడి ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాం. రూ. లక్ష వరకు అప్పు తీర్చేందుకు రైతులకు డబ్బులు చెల్లిస్తాం. వారి చేతికే డబ్బు ఇస్తాం. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, మంత్రులకు ఎవరికీ చెక్‌పవర్‌ లేదు. మేము సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ కల్పించాం. దాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేరలేదు.. విలీనమయ్యారు 
ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉండాలన్నది వారి స్వేచ్ఛకు సంబంధించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతామంటే చేర్చుకోలేదు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేస్తామన్నారు. కానీ సీఎల్పీ విలీనం అయితేనే బాగుంటుందని మేం చెప్పాం. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యా రు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ను చీల్చిన కాంగ్రెస్‌కు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత లేదు. పక్క రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులను ప్రధాని సమక్షంలోనే బీజేపీలో కలుపుకున్నారు. గోవాలో 10 మంది కాంగ్రెస్‌ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు. రాజస్తాన్‌లో ఆరుగురు బీఎస్పీ సభ్యులను కాంగ్రెస్‌ చేర్చుకుంది’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement