రాయలసీమ మళ్లీ కళకళలాడుతుంది | CM YS Jagan Fires on Chandrababu Over Rayalaseema Projects | Sakshi
Sakshi News home page

రాయలసీమ మళ్లీ కళకళలాడుతుంది

Published Wed, Dec 11 2019 12:56 PM | Last Updated on Wed, Dec 11 2019 4:54 PM

CM YS Jagan Fires on Chandrababu Over Rayalaseema Projects - Sakshi

సాక్షి, అమరావతి: ఇంతగా వర్షాలు పడి.. దేవుడు ఈ సంవత్సరం మంచిగా నీళ్లు ఇచ్చినా రాయలసీమ ప్రాజెక్టులకు నింపుకోలేకపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత వర్షాలు పడుతున్నా ప్రాజెక్టులు నింపుకోకపోవడానికి గత చంద్రబాబు ప్రభుత్వమే కారణమని, ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనులు చేపట్టకపోవడం, కాల్వల మరమ్మతులను పట్టించుకోకపోవండంతోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతుందని, కానీ, గత చంద్రబాబు ప్రభుత్వం గడిచిన పరిపాలనలో ప్రాజెక్టుల మీద శ్రద్ధపెట్టి చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. రాయలసీమలోని ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తిచేసి.. కాల్వల సామర్థ్యాన్ని పెంచి ఉంటే.. ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఉండేవాళ్లమని, రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండేవని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబును చూస్తే అసలు మనిషేనా అని అనిపిస్తోందని మండిపడ్డారు. రామలసీమలోని ప్రాజెక్టులు మళ్లీ పుష్కలమైన నీళ్లతో కళకళలాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

ఈ సందర్భంగా రాయలసీమ ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులను సీఎం జగన్‌ సభకు వివరించారు. ‘గోరకల్లు ప్రాజెక్టు సామర్థ్యం 12.44 టీఎంసీలకుగాను ఎనిమిది టీఎంసీలు మాత్రమే నీరు వచ్చింది. గొల్లపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 1.91 టీఎంసీలకుగాను ఒక్క టీఎంసీ మాత్రమే నిల్వ ఉన్నాయి. అనంతపురం మిడ్‌పెన్నాలో 5 టీఎంసీలకుగాను 3.5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగాం. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన చిత్రావతి రిజర్వాయర్‌ ఉంది. బహుశా నా నియోజకవర్గానికి సంబంధించినది కావడమే అది చేసుకున్న పాపమేమోనని అనిపిస్తోంది. ఇన్ని నీళ్లు వచ్చినా, నీళ్లు నింపండి, నింపండి అని పదేపదే చెప్పినా కూడా 10 టీఎంసీలకు గాను 6.8 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగాం. గండికోట 26.5 టీఎంసీలకుగాను కేవలం 12 టీఎంసీల నీళ్లుమాత్రమే నిల్వచేయగలిగాం. పెన్నా అహోబిలం బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 11 టీఎంసీలకుగాను ఇవాళ్టికి 3.38 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ 17.93 టీఎంసీలకుగాను కేవలం 6.28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగాం.బ్రహ్మంసాగర్‌కు వెలుగోడు నుంచి వెళ్లే కాల్వలో నీళ్లు సరిపడా పోవడంలేదని, కాల్వ సామర్థ్యం సరిపోలేదని, 5వేల క్యూసెక్కుల నీళ్లు పోవాల్సిన చోట 2వేల క్యూసెక్కులు కూడా పోవడంలేదని, కెనాల్‌ మరమ్మతు చేయండని మా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిసహా మేం కూడా పలుమార్లు చెప్పాం. కాని ఐదేళ్లలో విన్న పాపాన పోలేదు. సర్వారాయ సాగర్‌లో 3 టీఎంసీలకు 1 టీఎంసీ మాత్రమే నింపగలిగాం. నా నియోజకవర్గంలో ఉన్న పైడిపాలెం రిజర్వాయర్‌ నింపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి 6 టీఎంసీలకు, 5.44 టీఎంసీలు నిల్వ చేయగలిగాం’ అని తెలిపారు.

గత చంద్రబాబు సర్కారు చిత్తశుద్ధితో రాయలసీమలోని ప్రాజెక్టుల పనులు చేపట్టి ఉంటే.. ప్రాజెక్టులు నీళ్లతో నిండుకుండలా ఉండేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుల మరమ్మతు పనులు చేయించేందుకు, సమస్యలన్నీ అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన అడుగులు వేసిందని స్పస్టం చేశారు. ఆర్‌ అండర్‌ ఆర్‌ ప్యాకేజీలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి రూ. 980 కోట్లు గతంలో చంద్రబాబు సర్కారు విడుదల చేసి ఉండి ఉంటే.. ఈ రోజు 26 టీఎంసీల నీళ్లు నిల్వచేసి ఉండేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంకాకముందు 2004 నుంచి 2014 మధ్యకాలంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు-నగరి సుజల స్రవంతి) ప్రాజెక్టుకు రూ. 5వేల36 కోట్లు ఖర్చు చేశారని, హంద్రీనీవాకు సంబంధించి రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేశారని, కానీ, చంద్రబాబు హయాంలో రూ. 198 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కేవలం ఎన్నికలు వస్తుండటంతో హడావిడిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనుల కోసం 420 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఇంకా రూ. 980 కోట్లు అదనంగా ఇచ్చి ఉంటే గండికోట ప్రాజెక్టులో ఈపాటికి నీళ్లు ఉండి ఉండేవి కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమలోని ప్రాజెక్టులను చం ద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు.

యుద్ధ ప్రతిపాదికన చర్యలు..
రాయలసీమలోని ప్రాజెక్టులను వచ్చే జూన్‌ నాటికి నింపేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలకు సంబంధించి చర్యలు తీసుకున్నామని సీఎం జగన్‌ సభకు వివరించారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి 980 కోట్లు విడుదల చేసేందుకు, వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో వెయ్యి కోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నమని తెలిపారు. ఈ సమస్యలన్ని అధిగమించి.. రాయలసీమలోని డ్యాములన్నీ నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

రాయలసీమ ప్రాజెక్టులు మళ్లీ కళకళలాడుతాయి
‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరి సామర్థ్యాన్ని 44 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. తెలుగు గంగ కెనాల్‌ను 11500 క్యూసెక్కుల నుంచి 18వేల క్యూసెక్కుల వరకు అభివృద్ధి చేయబోతున్నాం. ఎస్సార్‌బీసీ కెనాల్‌ను 21వేల క్యూసెక్కుల నుచి 31వేల వరకు, కేసీ కెనాల్‌ 12500 క్యూసెక్కుల నుంచి 35వేల క్యూసెక్కుల వరకు, అవుకు టన్నెల్‌ కెనాల్‌ 10 క్యూసెక్కుల నుంచి 30వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. హెచ్‌ఎన్‌ఎస్‌ కెనాల్‌ నుంచి 2100 క్యూసెక్కుల కూడానీరు పోవడం లేదు. దానిని ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతాం. తెలుగు గంగ మెయిన్‌ కెనాల్‌ టు వైఎస్సార్‌ కడప సామర్థ్యాన్ని 3500 క్యూసెక్కుల నుంచి 8వేల క్యూసెక్కులకు తీసుకెళ్లతాం. గండికోట టు సీబీఆర్‌ లిఫ్ట్‌ను రెండువేల క్యూసెక్కుల నుంచి నాలుగువేల క్యూసెక్కులకు, గండికోట టు జీఏఎన్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ నాలుగు వేల నుంచి ఆరువేల క్యూసెక్కులకు తీసుకుపోయేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇవన్నీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో టెండర్లకు వెళుతాయి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్లీ ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న రాయలసీమగా ప్రాజెక్టులు, నీళ్లతో కళకళలాడుతుంది’ అని సీఎం జగన్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement