సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక అబద్ధాన్ని తీసుకొని ప్రతిపక్ష టీడీపీ సభలో రాద్ధాంతం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ తీరును మరోసారి తప్పుబట్టారు. పార్టీ మ్యానిఫెస్టోను తాము ఖురాన్, బైబిల్, భగవద్గీత తరహాలో పవిత్రంగా భావిస్తున్నామని, ఈ మ్యానిఫెస్టో తమ ప్రభుత్వంలోని ప్రతి మంత్రి దగ్గర, ప్రతి అధికారి దగ్గర ఉందని, చివరకు గ్రామస్థాయిలోని తమ పార్టీ కార్యకర్తల వద్ద కూడా ఈ మ్యానిఫెస్టో అందుబాటులో ఉందని, ఈ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి లైన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
ప్రజలు కూడా తమ మ్యానిఫెస్టోను నమ్మి.. తమకు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. మ్యానిఫెస్టోలోని ప్రతి లైన్‌ను తాము తు.చ. తప్పకుండా అమలు చేస్తుండటంతో.. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో, ఆక్రోషంతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆక్షేపించారు. ప్రతి ఏడాది మే మాసంలో రైతులకు 12,500 రూపాయలు ఇస్తూ.. నాలుగు దఫాల్లో రూ. 50వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి మే మాసం పూర్తి కావడంతో.. నష్టాల్లో ఉన్న రబీ రైతులను ఆదుకోవడానికి వచ్చే ఏడాది మే మాసంలో ఇస్తామన్న వైఎస్సార్ రైతు భరోసాను ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలోని ప్రతి అంశానికి మనసా, వాచా, కర్మణా కట్టుబడి ఉండి అమలుచేస్తున్నామని, అయినా, ప్రజలకు మంచి జరగాలనే ఆలోచన, సభలో సజావుగా చర్చ జరగాలనే ఉద్దేశం టీడీపీకి లేదని, ఇకనైనా టీడీపీ సభ్యులు తమ ధోరణిని మార్చుకోవాలని సూచించారు. సభలో ప్రశ్నోత్తరాలను సజావుగా పూర్తిచేయడానికి సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment