శ్రావణ్‌కు ఓటు వేయడం అవసరమా! | Conflicts In Guntur TDP Party | Sakshi
Sakshi News home page

శ్రావణ్‌కు ఓటు వేయడం అవసరమా!

Published Mon, Sep 10 2018 12:39 PM | Last Updated on Mon, Sep 10 2018 12:39 PM

Conflicts In Guntur TDP Party - Sakshi

మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు

గుంటూరు, తాడికొండ: తాడికొండ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నందమూరి హరికృష్ణ సంస్మరణ సభ సాక్షిగా జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, సీనియర్‌ నాయకులు మానుకొండ రత్తయ్య, యెడ్డూరి హనుమంతరావులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌పై విరుచుకుపడ్డారు. తమకు వ్యతిరేకంగా గ్రూపులు నడుపుతున్నారంటూ మండిపడ్డారు. అనుమతులు లేకుండా దుకాణాలు నిర్మిస్తే నిలిపేస్తారా? అందుకు అవసరమైతే జైలుకు వెళదాం ఏమవుతుంది. అనుమతి ఇప్పించలేని ఎమ్మెల్యేకు మనం ఓట్లు వేయడం అవసరమా అంటూ సీనియర్‌ నాయకుడు రత్తయ్య తనదైన శైలిలో విమర్మించడంతో నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. గత రెండేళ్లుగా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వడ్లమూడి పూర్ణచంద్రరావు క్రియాశీలక రాజకీయాలు, ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఉన్నట్టుండి ఆదివారం నందమూరి హరికృష్ణ సంస్మరణ సభ పేరిట ఒక్కసారిగా విరుచుకుపడటం అందరిలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా వడ్లమూడి మాట్లాడుతూ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మానుకొండ రత్తయ్యతో తనకు రాజకీయాల వలననే విభేదం వచ్చిందని, దీనిని ఆసరాగా తీసుకొనేందుకు కొందరు యత్నించారన్నారు. రాజకీయాల్లో పదవులలో ఉన్న వారికి అహంకారం పెరుగుతుందని, కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా తాను ఎప్పుడూ గ్రూపులను ప్రోత్సహించలేదన్నారు. గ్రూపులు కట్టడి చేసేందుకే పలు కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. బేజాత్పురం గ్రామంలో పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వస్తే కార్యక్రమం నిర్వహించమని తాను చెప్పానని,  కానీ 3 వ్యానుల పోలీసులను పెట్టి కార్యక్రమం నిర్వహిస్తూ తనపై బురద చల్లేందుకు యత్నిస్తే గ్రామానికి వెళ్లినపుడు అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారని గుర్తు చేశారు. తాను కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేయడం లేదని, ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉన్నా పార్టీని అడ్డంపెట్టి ఒక్క పని కూడా చేయించుకోలేదన్నారు.

గ్రూపు రాజకీయాలు మానుకోవాలి: హనుమంతరావు
  సీనియర్‌ నాయకుడు మానుకొండ రత్తయ్య మాట్లాడుతూ తాడికొండలో సర్పంచి అనుమతి లేకుండా దుకాణాలు నిర్మిస్తే మూడేళ్లుగా డీపీవోతో అనుమతి ఇప్పించలేని ఎమ్మెల్యేకు ఓటు వేయడం అవసరమా అన్నారు. మరో సీనియర్‌ నాయకుడు యెడ్డూరి హనుమంతరావు మాట్లాడుతూ ఎంతమంది కొత్త నాయకులు వచ్చినా 40 ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న తన నుంచి నాయకత్వం తీసుకోలేరన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను నడుపుతూ సీనియర్లను విస్మరించడం పట్ల ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో యార్డు చైర్మన్‌ గుంటుపల్లి మధుసూధనరావు, మాజీ చైర్మన్‌ నూతలపాటి రామారావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ ఎంపీపీ దమ్మాటి సీతామహాలక్ష్మీ, మాజీ సర్పంచ్‌ నూతక్కి నవీన్‌ కుమార్, కో ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు, బీసీ నాయకులు ముక్కెర శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు షేక్‌ సుభానీ తుళ్లూరు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జొన్నలగడ్డ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నోరెత్తని ఎమ్మెల్యే వర్గం!
 గతంలో ఇదే నాయకులు 2009 ఎన్నికల్లో మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌పై తమ వ్యతిరేక గళం వినిపించి చంద్రబాబు వద్ద అభ్యర్థిని మార్చి తెనాలి శ్రావణ్‌ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన తిరిగి 2014లో విజయం సాధించినప్పటికీ ఏడాది పాలన గడవకముందే వర్గ విభేదాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెరిగి పెద్దవై ఎన్నికల వేళ సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్క సారిగా స్వరం పెంచారు. ఇదే వేదికపై ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి మధుసూధనరావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యనిర్వహక కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ యార్డు ఛైర్మన్‌ నూతలపాటి రామారావులు ఉన్నప్పటికీ తిరుగుబాటు బావుటాను ఖండించకపోవడం విశేషం. సీనియర్‌ నాయకుడు మానుకొండ రత్తయ్య కుమారుడు మానుకొండ శివరామకృష్ణ ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసంతృప్తి వర్గానికి మద్దతుగా ఆయన సైతం మైకు తీసుకొని 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉండి పార్టీకోసం నష్టపోయింది తామేనంటూ గళం విప్పడంతో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement