సాలూరులో తెలుగుదేశం పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. అక్కడ మొదటినుంచీ భంజ్‌దేవ్, సంధ్యారాణి మధ్య అంతర్గత పోరునడుస్తుండగా... కొత్తగా స్వాతిరాణి అక్కడ పాగా వేయడానికి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలు అక్కడి కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. ప్రతిసారీ దేవ్, సంధ్యల నడుమ ఆధిపత్యపోరు బహిర్గమవుతూనే ఉంది. అధిష్టానం ఆదేశించినా... వారి మధ్య అగాధం తగ్గలేదు సరికదా పెరుగుతూ వస్తోంది. ఇదే అదనుగా అక్కడ స్వాతిరాణి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఆమె భర్త పావులు కదుపుతున్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: అధికారపార్టీని అంతర్గత విభేదాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆధిపత్య పోరుతో ఆ పార్టీ మూడు ముక్కలైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్.పి.భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణిల మధ్య రాజకీయంగా మూడుముక్కలాట మొదలైంది. వీరెంత తన్నుకున్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు పెరుగుతున్న జనాదరణ మాత్రం తగ్గించలేకపోతున్నారన్నది స్పష్టమవుతోంది. 1951లో ఏర్పడ్డ సాలూరు నియోజకవర్గాన్ని షెడ్యూల్డు తెగలకు(ఎస్‌టి) రిజర్వ్ చేశారు.
2007–08లో జరిగిన పునర్‌వ్యవస్థీకరణ తర్వాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసి 2014 ఎన్నికల్లో మరలా వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన పీడిక రాజన్నదొర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వరుస పరాజయాలను చవిచూస్తున్న టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్(ఆర్‌పి) భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మాత్రమే పెద్దదిక్కుగా మిగిలారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అదే అదనుగా నియోజకవర్గ టీడీపీలో పట్టు సాధించే ప్రయత్నాలను సంధ్యారాణి ముమ్మరం చేశారు. ఈ విషయాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌నుటీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు.
బహిర్గతమైన విభేదాలు
ఈ పరిణామం తర్వాత సంధ్యారాణి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చివరికి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా తాను వేరుకుంపటి అనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. భంజ్‌దేవ్ ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేయగా... కొంతకాలం నియోజకవర్గ విషయాల్లో ప్రమేయం తగ్గించుకోమని అధిష్టానం పెద్దలు ఆమెను కట్టడిచేయడానికి చెప్పారు. కానీ పైకి తగ్గినట్లు కనిపిస్తూనే తెరవెనుక తన వర్గాన్ని ఆమె వృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సందర్భంలో దేవ్ తనకే టిక్కెట్టు ఖరారైందంటూ ద్వితీయశ్రేణి నాయకులను నమ్మించి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతని ప్రయత్నాలకు పెద్దగా మద్ధతు లభించడం లేదు.
మూడో ప్రత్యామ్నాయం
భంజ్‌దేవ్ ఒడిశాకు చెందిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన పూర్వీకులు సాలూరు వచ్చి స్థిరపడటంతో అతను ఎస్టీగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎస్టీ కాదని రాజన్నదొర నిరూపించడంతో ఒకసారి ఎమ్మెల్యే పదవిని కూడా పోగొట్టుకున్నారు. మరోవైపు చేపల చెరువుల కోసం ప్రభుత్వ, దేవుడి భూముల ఆక్రమణ, పలు అవినీతి ఆరోపణలతో భంజ్‌దేవ్ ప్రతిష్ట మసకబారింది. అలాగే సంధ్యారాణికి నియోజకవర్గంలో అనుకూలమైన వర్గం ఉన్నప్పటికీ అది ఎన్నికల్లో విజయాన్నందించేంత పెద్దది కాదు. ఆమె సామర్ధ్యం కూగా ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని చేకూర్చేంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో సాలూరు టీడీపీకి మూడో ప్రత్యామ్నాయంగా మారవచ్చని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి రంగంలోకి దిగారు.
పార్టీ టిక్కెట్టుకు యత్నాలు
స్వాతిరాణి భర్త గణేష్‌కు సాలూరు సొంత నియోజకవర్గం కావడంతో తమ సామాజిక వర్గం, బంధుగణం ఓట్లతో గట్టెక్కేయొచ్చని భావించి పండుగలకు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళాలు గుప్పిస్తూ నియోజకవర్గ పార్టీలో ఎదగాలని చూస్తున్నారు.ఇవన్నీ సీటు కోసం చేస్తున్న గిమ్మిక్కులైనప్పటికీ భారీ ప్లెక్సీల ద్వారా లేని బలాన్ని ఉన్నట్లుగా అధిష్టానం పెద్దలకు చూపించుకోవడానికి స్వాతిరాణి వర్గం చేస్తున్న ప్రయత్నాలు భంజ్‌దేవ్‌కు నష్టం చేకూర్చేవిగానే ఉన్నాయి. అంతేగాదు చినబాబు మద్దతు కూడా స్వాతిరాణికే ఉందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా చిన్నవయసులోనే పదవిలోకి వచ్చిన ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీకొట్టేంత సామర్థ్యం లేదు. అధికారుల బదిలీలు, డెప్యుటేషన్ల విషయంలో కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఆమెపైనా ఉన్నాయి. అయినా ఆమె భర్త గణేష్ వెనకుండి ఆమెను నడిపిస్తూ, తన సామాజిక వర్గం, ఆర్థిక వనరులను ప్రధానంగా నమ్ముకుని ఈసారి పార్టీ టిక్కెట్టు సాధించాలనుకుంటున్నారు.
జనం మదిలే ఇప్పటికే ఓ ముద్ర
సాలూరు నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే పదవి చేపట్టినా ఎలాంటి అవినీతి మరక తనపై పడకుండా ప్రజాబలమున్న నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరను ఢీ కొట్టే సామర్ధ్యం స్వాతిరాణికే కాదు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో లేదన్నది సుస్పష్టం. అయినప్పటికీ వీరిలో ఎవరో ఒకరికి టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వాలనుకుంటే ఆ ఒక్కరూ ఎవరనే గందరగోళం టీడీపీ వర్గీయుల్లో నెలకొంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అవ్వడంతోనే టిక్కెట్టు ఖరారైపోయిందనుకుంటున్న భంజ్‌దేవ్‌కు మాత్రం ఇద్దరు రాణుల కారణంగా చివరికి అతని సీటుకే ఎసరొస్తుందేమోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment