
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ వెనక్కితగ్గడం లేదు. ఆయనకు నచ్చజెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లోని పీసీసీ నేతలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా కూడా సమర్పించారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్‌కు చెందిన ఓ కార్యకర్త మరో అడుగు ముందుకేశాడు. రాహుల్ మొండివైఖరికి నిరసనగా ఆత్మహత్యకు యత్నించాడు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట ఉన్న చెట్టెక్కి ఉరిపోసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ రాజీనామా అంశంపై కార్యకర్తలు, నేతలు ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కార్యకర్త చెట్టు ఎక్కేందుకు యత్నించగా.. అక్కడున్నవారు అడ్డుకున్నారు.
ధర్నా కార్యక్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ లిలోథియా, ఏఐసీసీ కార్యదర్శి మహెందర్ జోషి, నసీబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ నిరవధిక దీక్ష చేస్తున్నట్టు రాజేష్ తెలిపారు. కాగా తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఆ భేటీలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment