
రాంచీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అధికార బీజేపీ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. మిగతా స్థానాల్లో ఇతరులు విజయం దిశగా వెళ్తున్నారు. మొత్తం మీద అధికార బీజేపీ వ్యతిరేకంగా ఫలితాలు వెలువుడుతున్నాయి. కాంగ్రెస్- జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ జార్ఖండ్ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అందిన సమచారం ప్రకారం కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దీటైన పోటీ ఇస్తూ పాలక బీజేపీపై విస్పష్ట ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. ఒకవేళ మెజార్టీకి ఒకటీ, రెండు సీట్ల దూరంలో నిలిచినా.. ఇతరుల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాలకు కాగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యులు మద్దతు అవసరం కానుంది. దీంతో సోరెన్ మరోసారి సీఎం పీఠం అధిరోహించే అవకాశం ఉంది. కాగా ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టపాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి షిబు సొరెన్ తనయుడైన హేమంత్ ఎప్పుడూ సాదాసీదాగా ఉంటూ పార్టీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. ఫలితాల నేపథ్యంలో ఆయన భార్యతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలావుండగా ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జంషెడ్‌పూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆయనపై పోటీకి దిగిన బీజేపీ రెబల్ అభ్యర్థి సర్యూరాయ్ రెండువేల ఓట్లపైగా ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఇక్కడి నుంచి రఘువర్‌దాస్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment