
బండ్ల గణేశ్
బండ్ల గణేష్ ఓవర్ యాక్షన్ కొంప ముంచిందా?
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరినప్పటి నుంచి పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు, రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఓ చానెళ్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో గణేశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆ పార్టీ తరపున గణేశ్ గుప్తా బరిలోకి దిగుతున్నారు. దీంతో బుజ్జగింపుగా పార్టీ అధికార ప్రతినిధి పదవి కేటాయించింది. అయితే బండ్ల గణేశ్ ఈ పదవితో సంతృప్తి చెంది పార్టీ ప్రచారంలో పాల్గొంటాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
ఓవర్ యాక్షనే కొంప ముంచిందా?
మరోవైపు బండ్ల గణేష్ ఓవర్ యాక్షన్ కొంప ముంచిందన్న ప్రచారం జోరు అందుకుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చేసిన హడావుడే టికెట్ రాకుండా చేసిందని, ఆయన అత్యుత్సాహమే కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణస్వీకారానికి సంబంధించిన వీడియోలు.. ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కొన్ని కామెంట్లూ విపరీతంగా వైరల్ కావడం అతనిపట్ల అధిష్టానానికి ప్రతికూల సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది.