
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నెల 15 లోపే కమిటీల ప్రకటన ఉంటుందని భావించినా నేతల పేర్ల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో వాయిదా పడాల్సి వచ్చింది. ఈ కమిటీల విషయమై ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. అయితే ఆయన ప్రతిపాదించిన పేర్లలో అధిష్టానం కొన్ని సవరణలు సూచించింది. పార్టీలో సీనియార్టీతోపాటు గతంలో నిర్వహిం చిన పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎన్నిసార్లు విజయం సాధించారు, ఏ సామాజిక వర్గానికి చెంది న వారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని మరోసారి జాబితాను తేవాలని ఆదేశించినట్టు సమాచారం. కర్ణాటక ఎపిసోడ్ ముగిశాక రాష్ట్ర కమిటీలపై అధిష్టానం దృష్టి సారిస్తుందని తెలుస్తోంది.
ఆ రెండు పదవుల్లో ఒక మార్పు
పీసీసీ, సీఎల్పీ నేతలుగా ఒకే జిల్లాకు చెందిన వారు ఉండడంతో ఆ రెండు పదవుల్లో ఒక మార్పు తప్పక ఉంటుందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఢిల్లీ టూర్‌కి వెళ్లిన ఉత్తమ్‌కు పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసే అశోక్ గెహ్లాట్, అధ్యక్షుడు రాహుల్‌గాంధీలను కలిసే అవకాశం రాకపోవడం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, కొప్పుల రాజులతో మాత్రమే చర్చలు జరిపి రావడంతో ఈ విషయంపై స్పష్టత రాలేదు. పీసీసీ చీఫ్ మార్పు ఉండకపోవచ్చనే సమాచారం ఉన్నా.. సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని అంటున్నారు.
ఆయన స్థానంలో ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లుభట్టి విక్రమార్కను ఎంపిక చేస్తారన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తానొక్కడిని ఉంటే ఫర్వాలేదని, ఇంకో ఇద్దరు, ముగ్గురిని నియమిస్తే తనను ఆ పదవిలో కొనసాగించాల్సిన అవసరం లేదని భట్టి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా భట్టికి సీఎల్పీ పదవి దక్కవచ్చని అంటున్నారు. ఇక మిగిలిన పదవులకు వీహెచ్, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, దానం నాగేందర్, ఎస్.సంపత్‌కుమార్, రాజనర్సింహ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment