కమలనాథుల పట్టు నిలుస్తుందా? | Congress challenges in win to madhya pradesh | Sakshi
Sakshi News home page

కమలనాథుల పట్టు నిలుస్తుందా?

Published Thu, May 2 2019 12:11 AM | Last Updated on Thu, May 2 2019 7:24 AM

 Congress challenges in win to madhya pradesh - Sakshi

బీజేపీకి కంచుకోట అయిన మధ్యప్రదేశ్‌లో గత లోక్‌సభ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయపరంపర కొనసాగిస్తుందా? లేక అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ మళ్ళీ తన జవసత్వాలను కూడగట్టుకొని లోక్‌సభ సీట్లు సాధిస్తుందా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతోన్న చర్చ. ఇప్పటికి నాలుగోదశలో ఆరు స్థానాలకు పోలింగ్‌ పూర్తి కాగా, మే 6న జరిగే ఐదో దశలో మరో ఏడు స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 29 స్థానాలకు 27 గెలుచుకున్న బీజేపీకి ఇప్పుడు ఈ అఖండ విజయాన్ని నిలబెట్టుకోవడం పెద్ద అగ్ని పరీక్ష. మోదీ మేజిక్‌ పైనే బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం, సామాజిక సమీకరణలపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.

మధ్య ప్రదేశ్‌లోని  దామోహ్, రేవా, బేతుల్, సత్నా, ఖజురహో, హోశంగాబాద్, టీకంగఢ్‌ స్థానాలకు మే 6న పోలింగ్‌ జరగనుంది. దామోహలో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌  56.14 శాతం ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చౌధరీ మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ 2,13,299 ఓట్ల మెజారిటీని సాధించారు. 1962లో ఏర్పాటైన ఈ లోక్‌ సభ స్థానంలో గత 15 ఏళ్ళుగా కాంగ్రెస్‌ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారి బీజేపీ నుంచి తిరిగి ప్రహ్లాద్‌ సింగ్‌ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి ప్రతాప్‌ సింగ్‌లోధి పోటీ చేస్తున్నారు.

పార్టీకి గట్టి పునాదులున్న ఈ స్థానంలో ఈసారి కూడా బీజేపీకే విజయావకాశాలున్నాయని భావిస్తున్నారు. రేవా లోక్‌ సభ స్థానం లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ జనార్ధన్‌ మిశ్రా కాంగ్రెస్‌ అభ్యర్థి సుందర్‌ లాల్‌ తివారీని ఓడించారు.  2009లో బీఎస్పీ దేవ్‌రాజ్‌ సింగ్‌ పాటిల్‌ ఈ సీటుని దక్కించుకోవడం విశేషం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ షాపై, బీజేపీ అభ్యర్థి జ్యోతీ ధుర్వే 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది, 61.43 శాతం ఓట్లను సాధించుకోగలిగారు. అయితే ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ జ్యోతీ ధుర్వే స్థానంలో దుర్గాదాస్‌ ని బీజేపీ పోటీచేయిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి రామూ టేకామ్‌ దుర్గాదాస్‌తో ఢీకొనబోతున్నారు.

సత్నాలో సత్తా చాటేదెవరు?
మజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌ సింగ్‌ కంచుకోట సత్నా లోక్‌సభ స్థానం 2019 ఎన్నికల్లో ఎవరి పరం కానున్నదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వి«ంధ్య ప్రాంతం, బుందేల్‌ ఖండ్‌ ప్రాంతాలు ఈ పార్లమెంటు పరిధిలోకే వస్తాయి. ఈ ప్రాంతంలో ఠాకూర్లే దాదాపు సగం మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు సైతం ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. 1998 నుంచి బీజేపీ ఆధిపత్యంలోనే సత్నా పార్లమెంటు స్థానం ఉంది.

అయితే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓటింగ్‌ శాతం మాత్రం తగ్గుతూ వస్తోంది. చివరకు మోదీ వేవ్‌లో 2014లో సైతం ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ సింగ్‌ పై బీజేపీ అభ్యర్థి గణేష్‌ సింగ్‌ 8,688 ఓట్ల అతితక్కువ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. భారతీయ జనతాపార్టీ మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన గణేష్‌ సింగ్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంత లోతైన పునాదులేర్పర్చుకున్న దాఖలాలైతే లేవన్నది విశ్లేషకుల అంచనా.

2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ రాజేంద్ర సింగ్‌ పై గణేష్‌ సింగ్‌ 83,688 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగిస్తే, 2009లో బీఎస్పీ అభ్యర్థి సుఖ్‌లాల్‌ కుశ్వాహ పై కేవలం 4,418 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ప్రాభవం క్షీణిస్తూ వచ్చింది. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజారాం త్రిపాఠిని బరిలోకి దింపితే ఈసారి కూడా బీజేపీ గణేష్‌ సింగ్‌ని తిరిగి బరిలోకి దింపింది. అగ్రవర్ణాల ఓట్లు అధికంగా ఉన్న ఈ సీటుని బీజేపీ తిరిగి కైవసం చేసుకోవడం అంత తేలికైతే కాదన్నది విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్‌ అభ్యర్థి త్రిపాఠి స్థానికంగా పేరున్న వ్యక్తి కావడం, ఆయన సామాజిక వర్గం కూడా కాంగ్రెస్‌కి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు గెలుపుబాజా మోగించిన బీజేపీకి ఈసారి కూడా గెలుపు ఖాయమని ఆ పార్టీ అభిమతం.  సత్నా పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

ఖజురహోలో రాణి సాహీబా!
ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఖజురహో అందాలకు ఎన్నికల సందడి తోడయ్యింది. బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి కి నాలుగుసార్లు పట్టంగట్టిన ప్రాంతంలో ఇప్పుడు కాంగ్రెస్‌ రాణి కవితాసింగ్‌ని బరిలోకి దింపింది. స్థానిక రాజకుటుంబానికి చెందిన  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విక్రం సింగ్‌ నాటీ రాజా, భార్య అయిన కవితా సింగ్‌ ‘‘నేను లోకల్‌’’  తన గెలుపు ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. అయితే  సేఫ్‌ సీటుగా భావించే ఖజురహో నుంచి కేంద్ర మంత్రి ఉమాభారతి  పోటీచేస్తారంటూ తొలుత వార్తలు వచ్చినా, అంతిమంగా ఈ సీటుని బీజేపీ వి.డి శర్మకి ఇచ్చింది.

ప్రస్తుత బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ నాగేంద్ర సింగ్, ఈ సీటుని విడిచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. 1989 నుంచి 1998 వరకు మొత్తం నాలుగు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఉమాభారతి ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు. మొత్తం 8 అసెంబ్లీ సీట్లున్న ఈ పార్లమెంటు స్థానం ఛతార్‌పూర్, పన్నా, కత్నీ ప్రాంతాల కలయికగా ఏర్పడింది. బుందేలా పాలకుడు రాజ్‌పుత్‌ చాత్రాసాల్, ఛతార్‌పూర్‌ ని నిర్మించారు. ఇదే చారిత్రక నేపథ్యంలో ఖజురహో ప్రాంతంలో రాజ్‌పుత్‌ల సాంప్రదాయక ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే జనాభా రీత్యా ఓబీసీ, ఎస్సీ సామాజిక వర్గాలదే ఇక్కడ ఆధిక్యం. ఇక్కడ మొత్తం 17,02,833 మంది ఓటర్లున్నారు. ఇందు లో షెడ్యూల్డ్‌ కులాల ప్రజలు 18.57 శాతం ఉంటే, షెడ్యూల్డ్‌ తెగలవారు 15.13 శాతం ఉన్నారు.

‘‘ఛతార్‌పూర్‌ కోడలినీ, పన్నా కూతురిని అయిన నన్ను ఈ ప్రాంత ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు రాణి కవితా సింగ్‌. సాంప్రదాయ ఓటింగ్‌ దండిగా ఉన్న బీజేపీ సైతం తమ ఖాతాలోదే ఖజురహో అన్న ధీమాతో ఉంది.

హోశంగాబాద్‌లో బీజేపీ విజయపరంపర...
మధ్య ప్రదేశ్‌లోని నర్మదా నదీతీరాన ఉన్న çహోశంగాబాద్‌ లోక్‌ సభ స్థానంలో 6 పర్యాయాలుగా బీజేపీ విజయపరంపర కొనసాగించింది. ఇక్కడ 2009 మినహా 1991 నుంచి, 2014 వరకూ అన్ని సార్లూ ఈ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హోశంగాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలిచిన ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ 2013లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  2014లో బీజేపీ ఇదే స్థానం నుంచి ఉదయ్‌ ప్రతాప్‌సింగ్‌ని పోటీకి దింపి విజయపరంపర కొనసాగించింది. ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ మళ్ళీ ఇక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర పటేల్‌ (గుడ్డూభయ్యా)తో పోటీపడి బీజేపీ అభ్యర్థి ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ 64.90 శాతం ఓట్లను కైవసం చేసుకోగలిగారు. 15 లక్షలకు పైగా ఓటర్లున్న ఈ లోక్‌సభ స్థానంలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా 16.65 శాతం ఉంటే, ఆదివాసీల జనాభా 12.53 శాతం ఉంది. ఈసారి కాంగ్రెస్‌ నుంచి శైలేంద్ర దివాన్‌ చంద్రభాన్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి ఎంపీ.చౌధురీ పోటీచేస్తున్నారు. హోశంగాబాద్‌ లోక్‌ సభ స్థానం పరిధిలో నర్సింగ్‌పూర్, టెండూఖేదా, గదర్వారా, సియోని మాల్వా, హోశంగాబాద్, సోహాగ్‌పూర్, పిపారియా, ఉదయ్‌పూర్‌ సహా మొత్తం 8 అసెంబ్లీ సీట్లున్నాయి.

టీకంగఢ్‌ లో టఫ్‌ ఫైట్‌?
కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్‌ లోక్‌సభ సభ్యుడు, విద్యార్థి దశనుంచీ భారతీయ జనతాపార్టీ భావజాలాన్ని భుజస్కందాలపై మోస్తోన్న వీరేందర్‌ కుమార్‌ టీకంగఢ్‌ నుంచి ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. స్థానిక బీజేపీ నాయకత్వంలో వీరేందర్‌ కుమార్‌ పట్ల ఉన్న అసంతృప్తిని తోసిరాజంటూ అతనికే ఈ సీటు కేటాయించడం ఆయనపట్ల బీజేపీ కి ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి  వీరేందర్‌ కుమార్‌తో కాంగ్రెస్‌ నుంచి కిరణ్‌ అహిర్వార్‌ తలపడబోతున్నారు.

అయితే సాంప్రదాయకంగా బీజేపీకి పట్టున్న ఈ స్థానంలో గెలుపు ఖాయమన్న ధీమాతో బీజేపీ ఉంది. గత ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన వీరేందర్‌ సింగ్‌ ఈసారి అంతకంటే అధిక మెజారిటీ సాధిస్తానంటున్నారు. మొత్తం 8 అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ లోక్‌సభ స్థానంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్‌ మూడు, సమాజ్‌వాదీ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ప్రధానంగా యాదవులు, ఆహిర్వార్ల సంఖ్య అధికంగా ఉన్న టీకంగఢ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది.


కవితా సింగ్‌, రాజరాం త్రిపాఠి, ప్రహ్లాద్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement