కాంగ్రెస్‌ కొత్త ఖాతా తెరుస్తుందా? | bjp, congress sketches in to win a uttar pradesh | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కొత్త ఖాతా తెరుస్తుందా?

Published Fri, May 3 2019 5:28 AM | Last Updated on Fri, May 3 2019 5:45 AM

bjp, congress sketches in to win a uttar pradesh - Sakshi

లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ సహా 14 స్థానాలకు మే 6న పోలింగ్‌ జరుగుతుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ గెలిచిన అమేఠీ, రాయ్‌బరేలీ మినహా మిగిలిన పన్నెండు స్థానాలను కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన అవధ్‌ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాలున్న ఈ దశ ఎన్నికల్లో ఈసారి కూడా అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి అత్యవసరం.

దళితులు, బీసీలు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న బహుజన్‌ సమాజ్‌వాదీపార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూటమికి కూడా ఈ ప్రాంతంలో గట్టి పునాదులున్నాయి. అగ్రనేతలు మళ్లీ పోటీచేస్తున్న రెండు సీట్లతోపాటు మరో మూడు స్థానాలైనా సంపాదించాలని కాంగ్రెస్‌ ఆరాటపడుతోంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని లక్నో నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఫతేపూర్‌ నుంచి కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి పోటీ చేస్తున్నారు. మందిర్‌–మసీదు వివాదానికి కేంద్ర బిందువు అయిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ స్థానానికి  కూడా గట్టి పోటీ ఉంది.

బీజేపీ తర్వాత బలమైన కూటమి మహాగuŠ‡బంధన్‌
 2014 ఎన్నికల్లో ఈ 14 యూపీ సీట్లలో పది చోట్ల ఎస్పీ, బీఎస్పీలు రెండో స్థానంలో నిలిచాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే అవి బీజేపీకి పడిన ఓట్లను మించిపోతాయి. ధౌరహ్రా, బారాబంకీ, ఫైజాబాద్, సీతాపూర్‌ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 సీట్లలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో తల్లీ కొడుకుల స్థానాలే కాంగ్రెస్‌ పరువు నిలబెట్టాయి. లక్నోలో రాజ్‌నాథ్‌పై పోటీచేస్తున్నవారిలో శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్‌ సిన్హా(ఎస్పీ) ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హిందూ మతాచార్యుడు ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్‌ పోటీచేస్తున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై బహారాయిచ్‌(ఎస్సీ రిజర్వ్‌డ్‌) స్థానం నుంచి గెలిచిన సావిత్రీబాయి ఫూలే ఈసారి కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం చేయడం లేదంటూ సావిత్రీబాయి బీజేపీ నాయకత్వాన్ని విమర్శించాక పార్టీకి దూరమయ్యారు.

లక్నోలో రాజ్‌నాథ్‌కు పోటీయే లేదా?
తొలి ప్రధాని నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్,  కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్, బీజేపీ తొలి ప్రధాని ఏబీ వాజ్‌పేయి అనేకసార్లు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో. యూపీ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ తరఫున హిందూ పీఠాధిపతి(సంభల్‌ కల్కి మఠం) ప్రమోద్‌ కృష్ణం, ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున పూనమ్‌ సిన్హా పోటీచేస్తున్నారు.  అయితే, ఎస్పీ, కాంగ్రెస్‌ చివరి నిమిషంలో బయటి నుంచి అభ్యర్థులను ‘దిగుమతి’ చేసుకోవడాన్ని బట్టి చూస్తే రాజ్‌నాథ్‌కు సునాయాసంగా గెలిచే అవకాశం ఇస్తున్నట్టు భావించాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఠాకూర్‌ వర్గానికి చెందిన రాజ్‌నాథ్‌కు అన్ని వర్గాల మద్దతు ఉంది. నియోజకవర్గంలోని 19.6 లక్షల మంది ఓటర్లలో 4 లక్షల మంది కాయస్థులు, లక్ష మంది సింధీలు, నాలుగు లక్షల మంది బ్రాహ్మణులు, మూడు లక్షల మంది ఠాకూర్లు, నాలుగు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. పూనమ్‌ సింధీ కావడం, ఆమె భర్త శత్రుఘ్న కాయస్థ కుటుంబంలో పుట్టిన కారణంగా ఈ వర్గాల ఓట్లన్నీ తమ అభ్యర్థికి పడతాయనే ఆశతో ఎస్పీ నేతలు ఉన్నారు.

అమేఠీలో రాహుల్‌
అమేఠీ అవతరించినప్పటి నుంచీ జరిగిన 15 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్‌  గెలిచింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకులు, కోడలు, మనవడు విజయం సాధించిన కాంగ్రెస్‌ కంచుకోట ఇది. ఇందిర చిన్న కొడుకు సంజయ్‌గాంధీ 1977లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. 1980 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1998లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి అమేఠీ మాజీ సంస్థానాధీశుని కొడుకు సంజయ్‌సింగ్‌ తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి సతీష్‌శర్మను ఓడించారు. 2004 నుంచీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడుసార్లు అమేఠీ నుంచి ఎన్నికయ్యారు. 2014లో రాహుల్‌ చేతిలో ఓడిన బీజేపీ ప్రత్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీకి దిగారు. పాత ప్రత్యర్థుల మధ్యే 2019లో ఎన్నికల పోరు జరుగుతోంది. రాహుల్‌పై స్మృతి తొలిసారి పోటీచేసి ఓడినా ఆయన మెజారిటీని 3 లక్షల 70 వేల నుంచి లక్షా ఏడు వేలకు తగ్గించగలిగారు.

రాజ్యసభ సభ్యురాలైన స్మృతి మళ్లీ అమేఠీ బరిలోకి దిగడంతో రాహుల్‌ ఎందుకైనా మంచిదని కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీచేస్తున్నారు. అమేఠీలో ఓటమి భయంతోనే రాహుల్‌ కాంగ్రెస్‌కు సురక్షితమైన రెండో సీటు నుంచి పోటీకి దిగారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ కారణంగానే సంజయ్‌ ఓడిపోయారుగాని గాంధీ–నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ నేడు అమేఠీలో ఓడిపోయే అవకాశం లేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ అగ్రనేతలందరూ ప్రచారానికి వస్తున్నారు. బిహార్‌కు చెందిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్‌విలాస్‌ పాస్వాన్‌ సైతం అమేఠీలో స్మృతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్‌ చెల్లెలు ప్రియాంకా గాంధీ కూడా ఇక్కడ విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటూ, గెలుపుపై తన అన్నకు అనుమానమే లేదనీ, వయనాడ్‌ ప్రజల కోరిక మేరకే అక్కడ నుంచి పోటీచేస్తున్నారని ధీమాగా చెప్పారు.

రాయ్‌బరేలీలో సోనియా నాలుగోసారి పోటీ
మామ ఫిరోజ్‌ గాంధీ, అత్త ఇందిర, ఇందిర మేనత్త షీలాకౌల్‌ వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ ఆరోసారి పోటీచేస్తున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ పోటీకి దిగారు. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. అమేథీతోపాటు రాయ్‌బరేలీలో కూడా ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థిని నిలబెట్టలేదు. సోనియా తొలిసారి 1999లో అమేఠీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఓ సాంకేతిక సమస్య కారణంగా సోనియా 2006లో రాజీనామా చేశాక మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేసి గెలిచారు. కిందటి ఎన్నికల్లో ఆమె తన బీజేపీ ప్రత్యర్థి అజయ్‌ అగర్వాల్‌పై మూడున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో దాదాపు రెండున్నర లక్షలు, 2006 ఉప ఎన్నికలో 4 లక్షల 17 వేలు, 2009లో 3 లక్షల 72 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా తన ప్రత్యర్థులపై విజ యం సాధించారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి దినేష్‌ప్రతాప్‌ సింగ్‌ 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా తరఫున సహాయకునిగా పనిచేసి 2016లో ఎమ్మెల్సీ అయ్యారు. కిందటేడాది కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోనియా గెలుపుపై అనుమానాలు లేకున్నా ఈసారి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కూతు రు ప్రియాంక కూడా తల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

ధౌరహ్రాలో జితిన్‌ ప్రసాద మరో ప్రయత్నం!
కాంగ్రెస్‌ దివంగత నేత జితేంద్ర ప్రసాద కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద(కాంగ్రెస్‌) రెండోసారి పోటీచేస్తున్న స్థానం ధౌరహ్రా. జితిన్‌ తండ్రి జితేంద్ర గతంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షునిగా, మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సోనియాగాంధీపై పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన జితిన్‌ తొలిసారి 2004లో షాజహాన్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి ఎన్నికయ్యారు. 2008లో అవతరించిన ధౌరహ్రా నుంచి 2009లో గెలిచి 2011 నుంచి 2014 వరకూ మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేశారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రెండోసారి ఇదే సీటు నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు.  బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్‌ అహ్మద్‌ను లక్షా పాతిక వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి కొన్ని వందల ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు. బీసీ కులమైన కుర్మీలు ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున అర్షద్‌ సిద్దిఖీ(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. ఆయన తండ్రి ఇలియాస్‌ సిద్దిఖీ గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.  

ఫైజాబాద్‌లో త్రిముఖ పోటీ
ప్రాచీన నగరం అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో మరోసారి ప్రతిష్టాత్మక పోటీ జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు లల్లూ సింగ్, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నిర్మల్‌ ఖత్రీ, ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి ఆనంద్‌సేన్‌ యాదవ్‌(ఎస్పీ) పోటీలో ఉన్నారు. 2014లో లల్లూ సింగ్‌ తన సమీప ప్రత్యర్థి మిత్రసేన్‌ యాదవ్‌ను 2 రెండు లక్షల 82 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి ఆనంద్‌సేన్‌ తండ్రి మిత్రసేన్‌ మొదటిసారి 1989లో సీపీఐ టికెట్‌పైన, 1998లో ఎస్పీ తరఫున, 2004లో బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. తండ్రీకొడుకులిద్దరికీ నేరమయ రాజకీయాలతో సంబంధాలున్నాయి. తండ్రి మాదిరిగానే ఆనంద్‌సేన్‌ కూడా బీఎస్పీలో ఉన్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక మాయావతి కేబినెట్‌లో మంత్రిగా కొన్ని రోజులు పనిచేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల్‌ ఖత్రీ కూడా గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున ఫైజాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయోధ్య ప్రాంతంలో నిరుద్యోగం, పరిశ్రమల స్థాపన జరగకపోవడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యాయి. ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆయోధ్య ఎన్నిక ప్రచారానికి వచ్చినా రామజన్మభూమి వివాదంపై మాట్లాడలేదు. మహా కూటమి నేతలు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఆయోధ్యకు 70 కిలో మీటర్ల దూరంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మోదీపై నియోజకవర్గ ప్రజలకు అభిమానం తగ్గలేదనీ, ఎంపీగా లల్లూ సింగ్‌ పనితీరును పట్టించుకోకుండా ప్రధానిపై మోజుతోనే బీజేపీకి ఓట్లేస్తారని ఫైజాబాద్‌ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

బహరాయిచ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత సావిత్రీబాయి ఫూలే
పోటీచేయడంతో బహరాయిచ్‌ నియోజకవర్గం ఎన్నికపై ఆసక్తి పెరిగింది. షెడ్యూల్డ్‌ కులాలకు రిజర్వ్‌చేసిన ఈ స్థానం నుంచి 2014లో సాధ్వీ సావిత్రీబాయి ఫూలే బీజేపీ టికెట్‌పై పోటీచేసి తన సమీప ఎస్పీ ప్రత్యర్థి షబ్బీర్‌ అహ్మద్‌ వాల్మికీపై 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ హనుమంతుడి కులం గురించి మాట్లాడి సమాజాన్ని చీల్చివేస్తున్నారంటూ సావిత్రీబాయి కిందటి డిసెంబర్‌లో బీజేపీ నుంచి వైదొలిగారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌లో చేరగానే బహరాయిచ్‌ టికెట్‌ ఇచ్చారు. ఆమె స్థానంలో బీజేపీ టికెట్‌ అక్షర్‌వర్‌ లాల్‌కు లభించింది. మొదట బీఎస్పీలో ఉన్న సావిత్రీబాయి బౌద్ధమతాన్ని అనుసరిస్తూ ప్రజా సేవ ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత బీజేపీలో చేరి 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటికే పేరు సంపాదించిన ఆమెకు కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ ఎలాంటి ప్రయత్నం లేకుండానే దక్కింది. ఎస్సీ అభ్యర్థి షబ్బీర్‌ అహ్మద్‌ వాల్మీకీ రెండోసారి పోటీచేస్తున్నారు. ఎస్పీ కులమైన వాల్మికీ వర్గానికి చెందిన ఆయన పేరులోని మొదటి రెండు పదాల కారణంగా ఆయన హిందూ దళితుడు కాదనీ, ముస్లిం అని కొందరు కోర్టు కెక్కగా నడిచిన కేసులో ఆయన తాను హిందువునని నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కొత్త అభ్యర్థి తరఫున ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థికి మొగ్గు ఉన్నట్టు కనిపిస్తోంది.


పూనమ్‌ సిన్హా, దినేష్‌ ప్రతాప్‌సింగ్, అర్షద్‌ సిద్దిఖీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement