సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ ఫైర్ అయింది. అదో గ్రేట్ ఫ్లాప్ షో అని, ఇక సీఎం కేసీఆర్ శకం ముగిసినట్టేనని టీపీసీసీ నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి డీకే అరుణ, గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ సభ జనం లేక వెలవెల పోయిందని, 25 లక్షల మంది వస్తారని గొప్పలకు పోయి మూడు లక్షల జనాన్ని తరలించారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. జనం లేకపోవడంతోనే కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని, చెప్పిందే చెప్పి జనానికి ఏం సందేశం ఇచ్చారో కేసీఆర్‌కే అర్థం కాకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ పని అయిపోయిందనేందుకు ఈ సభే నిదర్శనమని, ఇక రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసినట్టేనని ఆమె అన్నారు. తాను లేకుంటే ఇదంతా జరిగేదా అని కేసీఆర్ అంటున్నారని, అసలు ఆయన లేకపోతే ఇంతకంటే పదిరెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగేదన్నారు. ముందస్తుకు పోతే ముందుగానే కేసీఆర్ కుర్చీ పోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. సభ పెట్టి పెద్ద షో చేయాలనుకున్న కేసీఆర్ ఆశలు నెరవేరలేదని, కేసీఆర్ సభ గ్రేట్ ఫ్లాప్ షోగా మిగిలిందని అన్నారు. జనం కూడా బలవంతంగా వచ్చారని పేర్కొన్నారు. గ్రామాల్లో బస్సులెక్కేందుకు జనం లేక స్థానిక నేతలు నానా తంటాలు పడ్డారని అన్నారు. ‘సభ ఎందుకు నిర్వహించారో వాళ్లకే అర్థం కాలేదు. కేసీఆర్ జనానికి ఏం సందేశం ఇచ్చారు.
కేసీఆర్ ప్రసంగం పేలవంగా సాగింది. చెప్పిన మాటలు పదే పదే చెప్పారు. జనం లేకపోవడంతో కేసీఆర్ స్పీచ్‌లో నిరాశ కనిపించింది. తన వెంట జనం లేరనేది కేసీఆర్‌కు అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందో చెప్పలేదు. ఇంకా సెంటిమెంట్‌తోనే ఓట్లు వేయించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. నేను లేకుంటే ఈ అభివృద్ధి జరిగేదా.. అని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ లేకుంటే ఇంకా ఎన్నో రెట్లు అభివృద్ధి జరిగేది. ఏ వర్గాలకు న్యాయం జరగలేదు. ఉద్యోగ సంఘాలు నోరువిప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముందస్తుపై కేసీఆర్ ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శకం ఇక ముగిసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే అధికారం’అని ఆమె అన్నారు.
పగటి దొంగల నివేదిక సభ: మధుయాష్కీ
అహంకారంతో కేసీఆర్ దొరల పాలన చేస్తున్నారని, తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఆస్తి ఎంతో, ఇప్పుడు ఎంతో లెక్క చెప్పాలని, కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని మధుయాష్కీ చెప్పారు. అది ప్రగతి నివేదన సభ కాదని, పగటి దొంగల నివేదిక సభ అని వ్యాఖ్యానించారు. బీసీలకు గొర్లు, బర్లు, నల్లానీళ్లు కాదని, ప్రగతిభవన్‌లో అధికారం కావాలన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశిని చినమల్లయ్య లాంటి తెలంగాణ యోధుల పేరు పలికే అర్హత కేసీఆర్‌కు లేదని, ఎన్నికలు తొందరగా వస్తే పాపాత్ముడి పాలన తొందరగా పోతుందని ప్రజలు ఆశిస్తు న్నారన్నారు. ప్రధాని మోదీని చూస్తేనే కేసీఆర్ లాగు తడుస్తుందని, జోనల్ ఆమోదం కోసం చస్తవా.. చేస్తవా అని మోదీని అన్న కేసీఆర్, విభజన హామీలపై ఎందుకు అడగలేదని ప్రశ్నిం చారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌కు నోబెల్ బహు మతి ఇవ్వొచ్చని యాష్కీ ఎద్దేవా చేశారు.
తాగుబోతుల సభలాగా సాగింది: దాసోజు
టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ చెప్పిన దాంట్లో పావలా వంతు జనాలు కూడా ప్రగతి నివేదన సభకు రాకపోవడానికి ప్రజల్లో ఉన్న అసం తృప్తే కారణమన్నారు. రూ.500, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా కనీసం 5 లక్షల మందిని సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. అది రాజకీయ సభలా లేదని, తాగుబోతుల సభ లాగా సాగిందని, ప్రజారవాణాకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులను మొబైల్ బార్లుగా మార్చారని ఆరోపించారు. దసరా రోజు రావణాసురుడిని కూల్చినట్టు ప్రకృతి ప్రకోపంతో కేసీఆర్ కటౌట్‌ను కూల్చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment