
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్ష కూటమి సభ విజయవంతమైన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఇతర కలసి వచ్చే విపక్షాలతో కలిసి బిహార్‌లో ‘జన ఆకాంక్ష’ పేరుతో ఓ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 3న పట్నాలోని గాంధీ మైదాన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సభ జరగబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీల నేతలను కాంగ్రెస్ ఈ సభకు ఆహ్వానించింది. బిహార్లో ఇప్పటికే ఆర్జేడీ కాంగ్రెస్‌కు బలమైన మిత్రపక్షం. హిందుస్తాన్ ఆవామీ మోర్చాకూడా కాంగ్రెస్ మద్దతుదారే. ఈ నేపథ్యంలోనే పట్నాలో సభ నిర్వహణకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. మరో కీలక రాష్ట్రమైన బిహార్లోనూ కాంగ్రెస్ కోరుకున్నన్ని సీట్లు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.