పోటీలో ఉండాల్సిందే!  | Congress has Decided to Contest the MLC by Election | Sakshi
Sakshi News home page

పోటీలో ఉండాల్సిందే! 

Published Wed, May 8 2019 4:26 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress has Decided to Contest the MLC by Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఫలితం ఎలా ఉంటుందన్న దానితో సంబంధం లేకుండా బరిలో ఉండడం ద్వారా 3 స్థానాల పరిధిలోని పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ల భేటీలో నిర్ణ యించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 3 స్థానాల్లో నల్లగొండలో గతంలో కాంగ్రెస్‌ పార్టీనే గెలవగా, వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కొండా మురళీధర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ 2 స్థానాల్లో తమ పట్టు కాపాడుకోవా లని కాంగ్రెస్‌ యోచిస్తోంది. వీటికితోడు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం కూడా పార్టీ నేతల్లో పోటీ కనిపిస్తుండడంతో ఇక్కడా బరి లోకి దిగాలనే ఆలోచనలతో మూడు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ జరుపుతున్నారు.

మూడుస్థానాల్లో ఎక్కడ ఎవరిని బరిలో దించాలన్న దానిపై ఉత్తమ్‌ కూడా కసరత్తు చేస్తున్నారు. నల్ల గొండ స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూ రు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేటకు చెందిన పటేల్‌ రమేశ్‌రెడ్డిల్లో ఒకరిని బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూడూరుకి ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించడంతో అది కాస్తా చేజారింది. దీంతో ఈసారి నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నా యి. ఇక, వరంగల్‌ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పోటీ చేస్తారా లేదా అన్నదానిపై అభ్యర్థిత్వం ఆధారపడి ఉంటుంది.

కొండా పోటీకి సై అంటే ఆయనకే అవకాశం దక్కనుంది. లేదంటే డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, ఉత్తర తెలంగాణ ఎన్నికల కోఆర్డినేటర్‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి దేశాయ్‌ల్లో ఒకరిని బరిలో దించే అవకాశాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలతో పాటు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిల్లో ఒకరిని బరిలో దించనున్నారు. మొత్తం మీద పోటీ చేయాలని నిర్ణయం జరిగిందని, ఎక్కడ నుంచి ఎవరు బరిలో ఉండే అంశంపై మాత్రం ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement