
అహ్మదాబాద్: ఓవైపు గుజరాత్‌లో మొదటిదఫా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా.. మరోవైపు రెండోదఫా ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి తిరిగి అధికారం కట్టబెట్టేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నారు. శనివారం లునవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసగించారు. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలోని ముస్లిం ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. 'దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ముస్లింలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకమైన హామీలను ఇచ్చింది. కానీ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి రిజర్వేషన్లు అమలుచేయలేదు' అని అన్నారు.
'నన్ను తిడుతూ.. నా నిరుపేద నేపథ్యాన్ని పరిహాసిస్తూ.. నా తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలను నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా.. ఈ దేశమే నాకు సర్వస్వం. నా జీవితంలోని ప్రతి క్షణాన్ని భారత్ కోసం, 125 కోట్లమంది భారతీయుల కోసం అర్పిస్తున్నాను' అని మోదీ ఉద్వేగంగా పేర్కొన్నారు.