
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 17న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, పీసీపీని అవమానించేలా మాట్లాడినందుకే ఆయనకు షోకాజ్ నోటీసులు అందించామని ఆ పార్టీ క్రమశిక్షణకమిటీ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చినా రాజగోపాల్‌రెడ్డి తీరు మార్చుకోకపోవడమే కాకుండా కఠినంగా రిప్లై ఇచ్చారన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోందని రాజగోపాల్‌రెడ్డి అనడం వలనే ఆయనకు నోటీస్ ఇచ్చామన్నారు. పార్టీ విలువలను కాపాపడానికి తప్పు చేసిన వారికి షోకాజ్ నోటీసులు అందించడం సహజమన్నారు. తమ నోటీసులకి రిప్లై ఇచ్చిన లెటర్‌లో బీజేపీలో చేరుతానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొనలేదని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.