మధు యాష్కి గౌడ్
హైదరాబాద్: నాపై జరిగిన దాడి హత్యాయత్నమేనని, పథకం ప్రకారమే హత్యాయత్నానికి టీఆర్‌ఎస్ నాయకులు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత మధు యాష్కి ఆరోపించారు. హైదరాబాద్‌లో మధు యాష్కి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రలోభాలకు ప్రజలు లొంగలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి, దాడులకు పాల్పడి అణచివేద్దామని అనుకున్నా ప్రజలు వెనుదిరగలేదన్నారు. టీఆర్‌ఎస్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు కాలం చెల్లిందని వ్యాక్యానించారు. సోనియా ప్రచారం తర్వాత కూటమికి ఊపు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో కచ్చితంగా విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ఎప్పుడూ సర్వేలను విశ్వసించదని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల నాడి తమకు అనుకూలంగా ఉంది.. ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు. లగడపాటి తెలంగాణ విలన్ అన్న కేటీఆర్ ఆయనతో ఎందుకు చాటింగ్ చేశారని ప్రశ్నించారు. లగడపాటి సర్వే టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చినపుడు ఎగిరి గంతేయలేదా అని అడిగారు. ఇప్పుడు ఎందుకు ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్ని డబ్బులు ఖర్చు చేసిన ప్రజలు తలొగ్గలేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment