పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు క్రిమినల్ కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా ఆబిడ్స్ రోడ్డు పోలీసులు స్వామిపై కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాలను వినియోగిస్తారని సుబ్రహ్మణ్యస్వామి రెచ్చగొట్టే విధంగా లేనిపోని వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి తీరును తప్పు పట్టారు. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా స్వామి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ జాతీయతపై నిరాధార ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాల గురించి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తిగా భిన్నంగా బీజేపీ ఎంపీల ప్రవర్తన ఉందని, సుబ్రహ్మణ్యస్వామి చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ నుంచి స్వామిని సస్పెండ్ చేయాలని డాక్టర్ దాసోజు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో శ్రవణ్‌తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు.
అనంతరం మైనార్టీ సంక్షేమ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 33 మంది విద్యార్థులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment