
గాంధీభవన్‌లో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన కీలక దశకు చేరింది. నవంబర్ 1న అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు వెల్లడించారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 1న పార్టీ అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని ధ్రువీకరించేలా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా సాయంత్రం ఢిల్లీలో మాట్లాడుతూ.. నవంబర్ 1న అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. దీంతో నవంబర్ 1న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కావడం లాంఛనమేనని టీపీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం లేదని, తొలుత 40–50 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, మిగిలిన అభ్యర్థులను దశలవారీగా నామినేషన్ల దాఖలు వరకు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటు ఈ నెల 29 నాటికి పూర్తి...
మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సోమవారం నాటికి ఓ కొలిక్కి రానున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా ఎప్పుడు వీలుంటే అప్పుడు కలుస్తున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు సీట్ల పంపకాలపై చర్చలు వేగంగానే చేస్తున్నారు. కాంగ్రెస్ 95, టీడీపీ 12, సీపీఐ 4, టీజేఎస్ 8 స్థానాల్లో పోటీచేసేలా దాదాపు ఒప్పందం ఖరారయిందనే చర్చ జరుగుతోంది. టీజేఎస్‌తో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయాయని, ఒకట్రెండుసార్లు భేటీ అయితే పూర్తిస్థాయిలో చర్చలు పూర్తవుతాయని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. సోమవారం కల్లా కూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తేనే బుధవారం కాంగ్రెస్ తొలి జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
ఢిల్లీకి ఉత్తమ్...
అధిష్టానం పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. అభ్యర్థుల జాబితాను ఓ కొలిక్కి తెచ్చే ప్రక్రియలో అధిష్టానం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో ఉత్తమ్‌తో చర్చించేందుకు ఆయన్ను ఢిల్లీ రమ్మన్నట్లు తెలిసింది. శనివారం రాత్రి, వీలైతే ఆదివారం మధ్యాహ్నం వరకూ ఆయన ఢిల్లీలోనే ఉంటారని, అధిష్టానం పెద్దలను కలసి పొత్తుల అంశంతో పాటు అభ్యర్థుల తుది జాబితాపై కూడా అధిష్టానంతో చర్చిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
15 నియోజకవర్గాలు.. స్క్రీనింగ్ కమిటీ చర్చలు..
ఢిల్లీ నుంచి వచ్చిన భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ శనివారం గోల్కొండ రిసార్ట్స్‌లో ఆశావహులతో సమావేశమయింది. సూర్యాపేట, కంటోన్మెంట్, సికింద్రాబాద్, చేవెళ్ల, వికారాబాద్, ఇబ్రహీంపట్నంతో పాటు మొత్తం 15 నియోజకవర్గాలకు చెందిన ఆశావహులతో ఈ కమిటీ భేటీ అయింది. టీపీసీసీ కోర్ కమిటీ సభ్యులు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశావహులందరినీ వ్యక్తిగతంగా పిలిపించి అభిప్రాయ సేకరణ చేశారు. మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి.. పార్టీలో ఎన్ని రోజులుగా పని చేస్తున్నారు.. నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎలా ఉంది.. మీకిస్తే గెలుస్తారా.. మీకివ్వకపోతే వేరే వాళ్లను గెలిపిస్తారా.. లాంటి ప్రశ్నలతో ఆశావహుల మనోగతాన్ని తెలుసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఆదివారం కూడా హైదరాబాద్‌లోనే ఉండి అభిప్రాయ సేకరణ చేస్తుందని, ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళుతుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment