కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ముచ్చెమటలు పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్‌లలో చీలిక వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి. దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగారు.
అయితే, ఆయన వారితో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్, రోషన్ బేగ్, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్ గుండురావు, ఈశ్వర్ ఖండ్రే, షమనూర్ శివశంకరప్ప, సతీష్ జాక్రిహోలిలు మంత్రి పదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యచరణపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు మాత్రం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలదని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం అన్యాయం చేసిన పార్టీకి ఎందుకు దన్నుగా నిలవాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కేబినెట్‌లోని సీనియర్లను తీసుకోకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారని తెలిసింది.
లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రేలను సైతం కేబినేట్‌లోకి తీసుకోకపోవడం చర్చనీయాశంగా మారింది. వీర శైవ లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివ శంకరప్ప(89)ను కూడా కేబినేట్‌లోకి తీసుకోకుండా పక్కనబెట్టారు. కాగా, చర్చలు జరిపేందుకు యత్నించిన కేపీసీసీ చీఫ్ పరమేశ్వరపై అసంతృప్త ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డట్లు తెలిసింది.
అయితే, పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని పరమేశ్వర పేర్కొన్నారు. కేబినెట్‌లో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయని, వాటిలోకి కొందరిని తీసుకుంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment