revolt
-
దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్‌లు
ప్రస్తుతం దేశమంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన సమయంలో మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మంచి రేంజ్, స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ల చూస్తున్నారా? అయితే మీ కోసమే రయ్‌మంటూ దూసుకెళ్లే టాప్10 లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ (Revolt RV400 BRZ) భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌గా ప్రసిద్ధి చెందింది. అధిక పనితీరు, సొగసైన డిజైన్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ లాంచ్‌తో కంపెనీ ఇటీవలే ఆర్వీ400ని అప్డేట్ చేసింది. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.ఓలా రోడ్‌స్టర్ ప్రో ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఓలా రోడ్‌స్టర్ సిరీస్ విడుదలతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది అత్యుత్తమ రేంజ్, పనితీరు, ఫీచర్లను అందిస్తుంది. విడుదల చేసిన మోడళ్లలో టాప్-ఎండ్ వేరియంట్, ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro). దీని ప్రారంభ ధర రూ.1,99,999. అత్యధిక రేంజ్ 579 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 194 కిలో మీటర్లు.రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ఇటీవల రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ (Revolt RV1 and RV1+)లను విడుదల చేసింది. ఆర్వీ1, ఆర్వీ1 ప్లస్ ఇప్పుడు దేశ మొట్టమొదటి కమ్యూటర్ మోటార్‌సైకిళ్లుగా నిలిచాయి. బేస్ మోడల్ ధర రూ. 84,990, ప్లస్ వెర్షన్ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్). టాప్ రేంజ్ 160 కిలో మీటర్లు.ఒబెన్ రోర్బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ (Oben Rorr). ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. స్టైలిష్ నియో-క్లాస్ డిజైన్ లుక్స్‌తో ఉన్న ఈ బైక్ ప్రతి రైడర్‌ను ఆకట్టుకుంటుంది. దీని రేంజ్ 187 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు. ధర రూ.1,49,999.అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్‌లలో అల్ట్రావయోలెట్ అత్యంత ఇష్టమైన పేర్లలో ఒకటి. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఉత్తమ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) దాని ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదలైంది. దీని రేంజ్ 323 కి.మీ. కాగా టాప్ స్పీడ్ 155 కి.మీ. ప్రారంభ ధర రూ.2,99,000.కొమాకి రేంజర్ ఎక్స్పీకొమాకి రేంజర్ పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. అవి రేంజర్, ఎం16. రేంజర్‌ను భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్‌గా చెప్తారు. ఇది భారీ, దృఢమైన చక్రాలు, అద్భుతమైన క్రోమ్ ఎక్స్టీరియర్స్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కొమాకి రేంజర్ ఎక్స్పీ (Komaki Ranger XP) రేంజ్ 250 కిలో మీటర్లు కాగా స్పీడ్ 70-80 కిలో మీటర్లు. ఇక దీని ధర రూ.1,84,300.మ్యాటర్ ఏరామ్యాటర్ ఎనర్జీ కంపెనీ గత ఏడాది తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరా (Matter Aera)ను విడుదల చేసింది. ఇది సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్తో స్పష్టమైన, వినూత్న సాంకేతికతను మిళితం చేస్తూ బోల్డ్, స్ఫుటమైన డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ రేంజ్ 125 కి.మీ.కాగా ధర రూ.1,73,999 నుంచి ప్రారంభమవుతుంది.టోర్క్ క్రాటోస్-ఆర్ అర్బన్పుణెకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌మేకర్ టోర్క్ మోటార్స్ కొత్త క్రాటోస్-ఆర్ మోడల్ ( Tork Kratos R Urban)ను విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌ను రోజువారీ ప్రయాణాల కోసం, అర్బన్ రైడర్లకు సౌకర్యంగా రూపొందించారు. దీని ధర రూ.1.67 లక్షలు. ఇది 105 కిలో మీటర్ల టాప్ స్పీడ్, 120 కిలో మీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది.ఒకాయ ఫెర్రాటో డిస్రప్టర్ఒకాయ ఈవీ ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఫెర్రాటో బ్రాండ్ కింద డిస్రప్టర్ (Okaya Ferrato Disruptor)పేరుతో మొదటి మోడల్‌ను పరిచయం చేసింది.ఫెర్రాటో డిస్రప్టర్ ఆధునిక, ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కి.మీ. కాగా 129 కిలో మీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ధర రూ.1,59,999.ఓర్క్సా మాంటిస్ఓర్క్సా ఎనర్జీస్ గత సంవత్సరం మాంటిస్ (Orxa Mantis) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రీమియం ధర కలిగిన మాంటిస్, పదునైన ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్ట్రైకింగ్ ట్యాంక్ కౌల్, విలక్షణమైన కట్లు,క్రీజ్‌లతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.3.6 లక్షలు. 221 కి.మీ.రేంజ్‌ను, 135 కి.మీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. -
తిరుగుబాటు తర్వాత.. విరుచుకుపడ్డ పుతిన్
మాస్కో: తిరుగుబాటు.. తదనంతరం నాటకీయ పరిణామాల తర్వాత చల్లారిన సెగ.. ఈ క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడా కనిపించకపోవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. వేర్ ఈజ్ పుతిన్ అంటూ ఉక్రెయిన్, వెస్ట్రన్ మీడియా సంస్థలు పుతిన్‌ను ఏకిపారేశాయి. ఈ క్రమంలో సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, పాశ్చాత్య దేశాలపై, ఉక్రెయిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో రష్యాలో రక్తపాతం కోసం ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు ఆశలు పెట్టుకున్నాయని, కానీ, ఆ ఆశలు గల్లంతు అయ్యాయని వ్యంగ్యంగా స్పందించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యన్లు ఒకరినొకరు చంపుకుంటుంటే.. ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రకూటమి చూసి సంతోషించాలనుకున్నాయి. కానీ, రక్తపాతం నివారించేందుకే తాము ప్రయత్నించామని పుతిన్.. ప్రపంచానికి వెల్లడించారు. రష్యా నేల రక్తంతో తడిసి ముద్దవ్వడం మాకిష్టం లేదు. అందుకే వాగ్నర్ పోరాటయోధులకు క్షమాభిక్ష ప్రసాదించాం. తిరుగుబాటు సమయంలో రష్యన్లు ప్రదర్శించిన దేశభక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు అని పుతిన్ టీవీ ఛానెల్ ద్వారా ప్రసంగించారు. కీవ్‌లోని నియో నాజీలు, వాళ్లను పోషిస్తూ వస్తున్న పాశ్చాత్య మిత్రపక్షాలు.. ఇలా రష్యా శత్రువులంతా రష్యాలో సైనికులు ఒకరినొకరు చంపుకోవాలని బలంగా కోరుకున్నాయి. కానీ, భద్రతా బలగాలు ఆ పాచికను పారనివ్వలేదన్నారు. వాగ్నర్ గ్రూప్‌కు కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. తిరిగి సైన్యంతో కలిసి పని చేయడమా? బెలారస్‌కు వెళ్లిపోవడమా? రష్యాకే తిరిగి రావడమా? ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పాం. జరిగిన పరిణామాల్ని.. ఏదో అంతర్జాతీయ పరిణామంగా చిత్రీకరించేందుకు పాశ్చాత్య మీడియా ప్రయత్నించింది. కానీ, ఇది రష్యా అంతర్గత వ్యవహారం మాత్రమేనని పుతిన్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పుతిన్‌తో పెట్టుకున్నావ్.. కిటికీల దగ్గర జాగ్రత్త! -
ఉక్రెయిన్.. మంచి ఛాన్స్ మిస్ చేసుకుందా?
దాదాపు పాతికేళ్ల రష్యన్ అధికారంలో పుతిన్ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొని ఉండడు. అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తే.. తీవ్రారోపణలకు దిగి మరీ తిరుగుబావుటా జెండా ఎగరేయడం, ప్రధాన నగరాల్లో తన సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలకు కారకుడు కావడం.. చివరకు మిత్రదేశం జోక్యంతో వ్యవహారం చల్లారడం.. కేవలం 36 గంటల్లోనే పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. ఈ పరిణాలను నిశితంగా పరిశీలించడమే తప్పా.. తమకు అనుకూలంగా వాడుకోవాలని ఉక్రెయిన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం విడ్డూరం. దురాక్రమణతో దాదాపు ఏడాదిన్నర కాలంగా తీవ్రంగా నష్టపోతోంది ఆ దేశం. పాశ్చాత్యదేశాలు ఎంతలా సాయం అందించిన కూడా ఒంటరి పోరు తప్పడం లేదు. ఈ క్రమంలో వాగ్నర్ గ్రూప్‌ను తమవైపు తిప్పేసుకునే దిశగా ఉక్రెయిన్ ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల నుంచి వెలువడుతోంది. వాగ్నర్ గ్రూప్ ఉద్దేశం.. ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యాకు సహకరించడం. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నగరం బఖ్ముత్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించింది కూడా వాగ్నర్ గ్రూపే. ఈ క్రమంలో.. మే నెలలో అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పుతిన్ షెఫ్‌గా పేరున్న ప్రిగోజిన్ ఉన్నట్లుండి వెనక్కి వస్తున్నట్లు ప్రకటించడం.. ఆ వెంటనే రష్యా మిలిటరీ సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన దళంలోని 20వేలమందిని రష్యా మిలిటరీనే పొట్టనబెట్టుకుందని, తన విమర్శలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారడంతో తాజాగా క్షిపణులతో రష్యా రక్షణ శాఖ తన గ్రూప్‌ను లక్ష్యం చేసుకుందని సంచలన ఆరోపణలు దిగాడు ప్రిగోజిన్. ఈ క్రమంలోనే తిరుగుబాటు ప్రకటన చేయడంతో.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కట్టడి పాలనను తెరపైకి తెచ్చింది రష్యా. వీక్ పుతిన్! పతిన్కు తిరుగుబాట్లు అణచడం కొత్తేం కాకపోవచ్చు. కానీ, పుతిన్‌కు ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం నేర్పింది. చిన్నదేశాన్ని.. సులువుగా ఆక్రమింపజేయొచ్చనే అంచనాలు ఘోరంగా తప్పాయి. ఆ తర్వాత ఆయన ‘పవర్’ ప్రదర్శించే సందర్భమూ ఎక్కడా రాలేదు. ఈ లోపు మరొకటి. వాగ్నర్ గ్రూప్ అనే ప్రైవేట్ సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేసింది. పట్టుమని పాతిక వేల మంది కూడా లేరు ఆ గ్రూప్‌లో. కానీ, అత్యాధునిక ఆయుధాలతో రష్యాలో అల్లకల్లోలానికి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం కావడం, ఆ తిరుగుబాటును అణచలేక పొరుగు.. మిత్రదేశం అయిన బెలారస్ సాయం తీసుకోవడం పుతిన్ అధికారం ఎంతగా బలహీనపడుతుందో అనే విషయాన్ని తేలతెల్లం చేశాయి. మౌనం దేనికి సంకేతం? నాటకీయ పరిణామాలతో ముగిసింది రష్యా తిరుగుబాటు సంక్షోభం. తిరుగుబాటుకు కారకుడు.. నాయకత్వం వహించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ నిశబ్ధంగా ఉండిపోయాడు. బెలారస్లో ఆశ్రయం కోసం ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ తిరుగుబాటును దేశద్రోహంగా అభివర్ణించి.. ప్రిగోజిన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మౌనంగా ఉండిపోయారు. అసలా ప్రకటన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం అర్ధరాత్రి బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో దౌత్యం వహించి చర్చలను ఫలించేలా చేశారు. మాస్కో వైపు వచ్చే యత్నంలోనే.. వందల మైళ్ల దూరం నుంచే వాగ్నర్ బలగాలు వెనక్కి మళ్లిపోయాయి. పుతిన్-ప్రిగోజిన్ మధ్య జరిగిన ఒప్పందం ఏంటన్నది బహిర్గతం కాలేదు. కానీ, తనపై పెట్టిన దేశద్రోహం, తిరుగుబాటు, ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్ని కొట్టేయాలని ప్రిగోజిన్.. ప్రిగోజిన్ తిరిగి రష్యాలో అడుగుపెట్టకూడదనే షరతు మీద పుతిన్ అందుకు అంగీకరించినట్లు బెలారస్ మీడియా బెల్టా న్యూస్ కథనాలు ప్రచురిస్తోంది. అలాగే.. దౌత్యం నడిపిన లుకాషెంకోకు పుతిన్ కృతజ్ఞతలు తెలిజయజేసినట్లు తెలిపింది. బంద్ వాతావరణమే! రోస్తోవ్తో పాటు వొరోనెజ్, లిపెట్స్క్ తదితర ప్రాంతాల్లో మోహరించిన వాగ్నర్ దళాలు వెనుదిరిగాయి. ప్రిగోజిన్ అజ్ఞాతంలోకి వెళ్లింది ధృవీకరించుకున్నాక.. రష్యాలోని ప్రధాన నగరాల్లో అత్యవసర పరిస్థితిని.. ఆంక్షలను ఎత్తేశారు. పరిస్థితిని వీలైనంత త్వరగా సాధారణంగా మార్చేందుకు యత్నించారు. అయితే ముందస్తుగా ప్రకటించిన మాస్కో సెలవు దినం మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకులు యధావిధిగా కొనసాగనున్నాయి. ముందడుగు వేసుంటేనా? ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రపక్షాలు మంచి అవకావం మిస్ చేసుకున్నాయి. రష్యా ఒకటిన్నర రోజు తిరుగుబాటుపై కేవలం కీవ్ వర్గాలు ప్రకటనలనే పరిమితం అయ్యాయి. పరిస్థితులను పరిశీలిస్తున్నామని మాత్రమే పేర్కొన్నాయి. ఇది పుతిన్‌కు ఘోర అవమానం ప్రకటించాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. కానీ, ఈలోపే పరిస్థితి చల్లారింది. ప్రిగోజిన్ వెనువెంటనే బలగాల ఉపసంహరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్స్కీ వ్యక్తిగత సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్. అయితే ఇది ఆరంభం కాబోలని.. రష్యా భవిష్యత్తులో ఈ తరహావి మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదని మాత్రం అంచాన వేశారు. కానీ, ప్రిగోజిన్ బఖ్‌ముత్‌లో నాలుగు వారాల ముందే ఇచ్చిన తిరుగుబాటు ప్రకటనను సరిగ్గా గమనించి.. ముందడుగు వేసి ఉంటే అది క్రెమ్లిన్ మెడపై కత్తి పెట్టినట్లు అయ్యి ఉండేదన్నది పలువురి విశ్లేషణ. ఉక్రెయిన్ యుద్ధంలాగా.. ఈ తిరుగుబాటు సుదీర్ఘ కాలం కొనసాగినా.. ఉక్రెయిన్‌కు లాభం ఉండేదేమో!. ఇదీ చదవండి: ప్రిగోజిన్ తిరుగుబాటు.. రష్యా రక్షణ వ్యవస్థ అంత వీకా? -
సంక్షోభంలో రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గర్జించారు. తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్‌ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది. ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్ పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 25వేల మంది సైన్యంతో తిరుగుబాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్‌లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా మూసివేసినట్లు తెలుస్తోంది. తాత్కాలిక విరమణ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్స్కీ రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్‌లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
అక్కడి కొనుగోలుదారులకు పండగే.. రివోల్ట్ కొత్త డీలర్షిప్స్ షురూ!
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని 'రివోల్ట్ మోటార్స్' భారతీయ మార్కెట్లో మరో మూడు డీలర్‌షిప్‌లను విస్తరించింది. కంపెనీ ఇప్పుడు ఈ రిటైల్ స్టోర్లను ఇండోర్, గౌహతి, హుబ్లీ ప్రాంతాల్లో ప్రారభించింది. రివోల్ట్ మోటార్స్ ప్రారంభించిన ఈ మూడు కొత్త డీలర్‌షిప్‌లతో కలిపి కంపెనీ డీలర్‌షిప్‌ల సంఖ్య 35కి చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని డీలర్‌షిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇటీవలే రివోల్ట్ మోటార్స్‌లో 100 శాతం వాటాను పొందింది. భారతదేశంలో 70కి పైగా కొత్త స్టోర్లను ప్రారంభించాలానే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. రివోల్ట్ మోటార్స్ ఇటీవల తన ఫ్లాగ్షిప్ మోడల్ RV400 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీలను 2023 మార్చి 31 నాటికి పొందవచ్చు. ఇప్పటికే ఈ బైక్ విరివిగా దేశీయ మార్కెట్లో అమ్ముడవుతోంది. రివోల్ట్ ఆర్వి400 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. రివోల్ట్ ఆర్వి400 గంటకు ఎకో మోడ్‌లో 45 కిమీ, నార్మల్ మోడ్‌లో 65 కి.మీ, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 75 శాతం, 4.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్ బ్యాటరీపై 6 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది. -
కాంగ్రెస్‌లో ముసలం: రేవంత్‌రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటు
సాక్షి, కాంగ్రెస్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్తగా ఏర్పాటైన కమిటీలు కాకరేపుతున్నాయి. తమకు సరైన ప్రాధాన్యం లభించలేదంటూ సీనియర్ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ఉన్న సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారేనని, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ తమదేనని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కొత్త కమిటీలపై తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త కమిటీలు, నేతల అసంతృప్తిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో టీకాంగ్రెస్ నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీపై మీడియాతో మాట్లాడారు సీనియర్ నేతలు. ‘కమిటీల్లో అన్యాయం జరిగిందని చాలా మంది చెప్పారు. అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవటం ప్రతి ఒక్కరిపై ఉంది. సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు సాగాలని నేతలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. కొందరు కావాలనే బలమైన నేతలు, పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చర్చకు వచ్చింది.’ అని తెలిపారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే: ఉత్తమ్ సీఎల్పీ నేత ఇంట్లో జరిగిన సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తున్నామని, కాంగ్రెస్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘కొంతమందిని అవమానించడానికే కొత్త కమిటీ ప్రకటించినట్లుంది. 108 మందిలో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. సోషల్ మీడియాలో నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. కొంత మంది అసత్యప్రచారం చేయిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నవారు చేయలేనిది రేవంత్ చేస్తారా? అధిష్టానానికి అవగాహన లేకుండానే కొందరు చెబితే కమిటీ వేశారు. ఒరిజినల్ కాంగ్రెస్‌ను కాపాడుకోవడమే మా లక్ష్యం. కావాలని సోషల్ మీడియాలో మాపై బురదజల్లుతున్నారు. సీఎల్పీ నేతను అవమానిస్తున్నారు. ’ అని ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో అప్పుడు చెబుతాను.. ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి! -
సీఎం పదవి నుంచి గెహ్లాట్‌కు ఉద్వాసన!
రాజస్థాన్ అధికార రాజకీయంలో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతోందా?. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటును కాంగ్రెస్ అధిష్టానం బాగా సీరియస్‌గా తీసుకుందా?.. అడ్డుకోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నం చేయనుందా?. కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో.. అవుననే చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించి.. ఉత్కంఠకు తెర దించారు 71 ఏళ్ల అశోక్ గెహ్లాట్. రాజస్థాన్‌లో తాజాగా జరిగిన పరిణమాలు తనను ఎంతో బాధించాయని, అధిష్టానానికి క్షమాపణలు చెప్పానని మీడియాకు వెల్లడిస్తూనే.. అధ్యక్ష రేసులో లేనంటూ పేర్కొన్నారు. అయితే.. క్షమాపణలు తెలిపినా.. ఆయన వివరణతో అధిష్టానం సంతృప్తి చెందలేదని సమాచారం. తిరుగుబాటులో గ్లెహ్లాట్ ప్రమేయం లేదని రాజస్థాన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ ఇచ్చిన నివేదికలోనూ ‘క్లీన్చిట్’ దక్కినా.. అనుచరులను కట్టడి చేయలేకపోయారనే కోణంలో అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. అందుకే అధ్యక్ష రేసులో పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ముందు రాజస్థాన్ సీఎంగా కొనసాగింపు కష్టమేనని సోనియాగాంధీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కల చెదిరింది! రెంటికీ చెడిన రేవడి చందాన తయారయ్యింది ఇప్పుడు అశోక్ గెహ్లాట్ పరిస్థితి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఈయన.. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో నిలవాలని భావించారు. అందుకు అధిష్టానం కూడా మద్దతు ఇవ్వాలనుకుంది. అయితే ఒకేసారి జోడు పదవుల్లో కొనసాగాలని ఆయన ఆశపడ్డారు. కానీ, ఉదయపూర్ కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో ‘ఒకే వ్యక్తి-ఒకే పదవి’ తీర్మానానికి ఆమోదం తెలిపింది. అలాంటప్పుడు గెహ్లాట్ రెండు పదవుల్లో కొనసాగడం కుదరదని ముందుగానే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో.. తన అనుచరుడిని రాజస్థాన్ సీఎంగా ఎన్నుకుని.. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని, కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని భావించారు గెహ్లాట్. దీంతో ఆయనకు ఆప్తుడైన స్పీకర్ సీపీ జోషికి ఆ బంపరాఫర్ దక్కుతుందని అంతా భావించారు. అయితే గెహ్లాట్‌కు అధిష్టానం ఆ అవకాశం ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను రేసులో ముందు నిల్చొబెట్టడంతో.. గెహ్లాట్ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీఎం ఎన్నిక కోసం అజయ్ మాకెన్ అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సైతం డుమ్మా కొట్టి.. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు వేరుగా భేటీ కావడం, అందులో పీసీసీ చీఫ్ కూడా ఉండడంతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. పైలట్ తిరుగుబాటు మర్చిపోయారా? సచిన్ పైలట్ 2020 సంవత్సరంలో తిరుగుబాటు ప్రయత్నం చేశారు. అయితే.. అది విఫలమైంది. అలాంటప్పుడు.. పైలట్‌ను ఇప్పుడు సీఎంగా ఎలా చేస్తారని గెహ్లాట్ వర్గం అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించింది తిరుగుబాటు వర్గం. అంతేకాదు.. ఆ సమయంలో పార్టీ అధికారం కోల్పోకుండా నిలిపిన వ్యక్తుల్లో ఒకరిని సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయడం, ఆపై స్పీకర్‌కు మూకుమ్మడి రాజీనామాల సమర్పణతో.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ కల్లోలం మరో మలుపు తిరిగింది. ఆ మాత్రం చేయలేరా? పరిస్థితి చేయి దాటిపోతుండడంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ముందుగా గెహ్లాట్‌కు ఫోన్ చేసి తిరుగుబాటు పరిణామాలపై ఆరా తీశారు. అయితే, ఆ సమయంలో గెహ్లాట్ ఇచ్చిన సమాధానం అగ్నికి ఆజ్యం పోసింది. అప్పటికే అధిష్ఠానం ఆయన మీద గుర్రుగా ఉండగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారాయన. ‘‘ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని, తానేమీ చేయలేన’’ని ఆయన చేతులెత్తేయడంతో .. ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. పని చేసిన సీనియర్ల ఒత్తిడి! క్షమాపణ చెప్పినా అధ్యక్ష ఎన్నికకు ఆయన్ని దూరం చేయడంతో.. గెహ్లాట్ వైఖరి పట్ల అధిష్టానం ఏమేర ఆగ్రహంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘‘పార్టీ అధిష్టానానికి క్షమాపణలు తెలియజేస్తున్నా. పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. నేను సీఎంగా ఉండాలో లేదో సోనియా నిర్ణయిస్తారు’’ అంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గెహ్లాట్. సోనియా నిర్ణయం వెనుక సీనియర్ల ఒత్తిడి కూడా ఉందని తెలుస్తోంది. తిరుగుబాటు అనంతరం.. అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధినేత్రి(తాతాల్కిక) సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని కొందరు సభ్యులు. ఆయన్ని తప్పించి..ఆ స్థానే విధేయంగా ఉండే వేరే ఎవరినైనా ఎంపిక చేయాలంటూ కోరారు వాళ్లు. ‘‘ఆయన మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదని సోనియాకు సూచించారు వాళ్లు. ఎమ్మెల్యేలను నియంత్రించకుండా.. తెర వెనుక ఉంటూ ఆయన డ్రామాలు ఆడిస్తున్నారంటూ కొందరు సభ్యులు ఆరోపణలు గుప్పించారు కూడా. ఈ నేపథ్యంలో.. సీనియర్ల అభిప్రాయాలను సైతం సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నా.. ముఖ్యమంత్రిగా గెహ్లాట్ కొనసాగింపు కష్టమే అనే సంకేతాలు పంపింది కాంగ్రెస్ అధిష్టానం. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. గెహ్లాట్‌ను మార్చేసి ఆ స్థానంలో మరొకరిని సీఎంగా నియమిస్తారా? లేదా? అనేది త్వరలోనే సోనియాగాంధీ తీసుకునే స్పష్టమైన నిర్ణయం ద్వారా వెల్లడి కానుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు
1947 వరకు ‘ఈస్టిండియా’, ‘బ్రిటిష్ ఇండియా’లే తప్ప మనకంటూ ‘మదర్ ఇండియా’ లేదు! వ్యాపారం చేసుకోడానికి కంపెనీ పెట్టి, ఆ కంపెనీ పేరులో స్థానికత కోసం వ్యూహాత్మకంగా ‘ఇండియా’ అనే పేరును జతకలిపి, బ్రిటన్ పార్లమెంటు అనుమతితో ‘ఈస్టిండియా కంపెనీ’గా అవతరించిన బ్రిటిష్ ప్రైవేటు వ్యాపారులు.. లాభాలతో, అపరిమితమైన సంపదలతో సంతృప్తిచెందక, సొంత సైన్యాన్ని సమకూర్చుకుని సొంత పాలన కూడా మొదలు పెట్టినా.. ఈస్టిండియా కంపెనీపై ఆ కంపెనీ ఆధిపత్య ప్రాంతాలలోని భారత సిపాయిలు తిరగబడటంతో కంపెనీ కథ ముగింపునకు వచ్చింది. అనంతరం ఇండియా పాలన పగ్గాలను 1858లో బ్రిటన్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కూడా పదహారేళ్ల పాటు ఈస్టిండియా ఆనవాళ్లు దేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. చివరికి 1874 జూన్ 1న ఈస్టిండియా తిరుగుముఖం పట్టింది. 1858 తరువాత కూడా భారత ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. ఆనాటి క్వీన్ విక్టోరియా వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. 1885లో ‘భారత జాతీయ కాంగ్రెస్’ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలతో పాటు.. అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఉరికంబాలు ఎక్కించింది. వాస్తవానికి అప్పటికి వందేళ్ల ముందు నుంచి ఈ తిరుగుబాట్లు, ఉరికంబాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి ఈస్టిండియా కంపెనీ ఎలా చేసిందో, ఆంధ్రా యోధులు కంపెనీని ఎలా ఎదుర్కొన్నారో ప్రొఫెసర్ కె.ఎస్.ఎస్. శేష¯Œ ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర 1766–1857’ అనే పుస్తకంలో వివరించారు. 1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు అలాంటివే. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది. తమిళనాడు, మహారాష్ట్ర తమిళనాడులోని నెల్కట్టుంసేవల్ ప్రాంత పాలెగాడు పులిదేవర్. 1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్. పాంచాల¯Œ కురుచి ప్రాంతాన్ని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు అతడిని 1799లోనే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే.. వారి విప్లవ యోధులలో ఒకరు. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరగబడ్డారు. తూర్పు భారతం 19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం.. కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటి వ్యక్తి గోంధార్ కున్వార్. స్థానిక పాలకులైన కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్ కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. అది విఫలమైంది. మళ్లీ పియాలీ బర్ఫూఖన్ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్ కున్వార్, రూప్‌చంద్ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్ నాయత్వంలో జరిగిన ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్ జాతీయులను చంపాలని గదాధర్ గొహిన్ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లిన యోధుడు మణిరాం దివాన్. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్ సాయంతో పథకం వేశాడు. అయితే పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్ కారాగారంలోనే చనిపోయారు. 1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి పదులు, వందలుగా జరిగిన తిరుబాట్ల ఫలితంగా ఈస్టిండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాట పట్టించవలసి వచ్చింది. -
1857 సిపాయిల తిరుగుబాటు: వీరుల అస్థిపంజరాలు లభ్యం
బ్రిటిష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లోని బయటపడ్డాయి. అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు బుధవారం వెల్లడించారు. కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు. Chandigarh| These skeletons belong to 282 Indian soldiers killed during India's 1st freedom struggle against the British in 1857. These were excavated from a well found underneath religious structure in Ajnala near Amritsar, Punjab: Dr JS Sehrawat Asst Prof Dept Anthropology PU pic.twitter.com/pfGdz4W5sC — ANI (@ANI) May 11, 2022 ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
ఇమ్రాన్‌కు కష్టకాలం
నిన్న మొన్న వరకూ పాకిస్తాన్ సైన్యానికి ఇష్టసఖుడిగా ఉన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీఠం కదులుతున్న జాడలు కనబడుతున్నాయి. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికీ, ద్రవ్యోల్బణం కట్టుదాటడానికీ ఇమ్రానే బాధ్యుడంటూ ఇప్పటికే పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు పాకిస్తాన్ పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. వచ్చే సోమవారం దీనిపై చర్చ ప్రారంభం కాబోతుండగా ఈ నెల 28న తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆయన సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్(పీటీఐ) నుంచి 24 మంది ఎంపీలు తప్పుకొంటున్నట్టు కథనాలు వస్తుండగా, అధికార కూటమికి గుడ్‌బై చెబుతున్నట్టు మిత్రపక్షం ఒకటి ప్రకటించింది. ప్రస్తుతం పీపీపీ నాయకుడు, బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ సాగిస్తున్న ‘లాంగ్‌మార్చ్’ సరిగ్గా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగేనాటికి ముగుస్తుందంటున్నారు. కనుక ఇమ్రాన్ ఖాన్‌కు మున్ముందు వరస తిప్పలే. 324 మంది సభ్యులుండే జాతీయ అసెంబ్లీలో పీటీఐకి సొంతంగా 155 మంది సభ్యులున్నారు. ఆరు పార్టీలకు చెందిన 23 మంది మద్దతుంది. ప్రభుత్వ మనుగడకు కనీసం 172 మంది అవసరం. కనుక ఇప్పుడున్నవారిలో ఏడెనిమిదిమంది జారుకున్నా ఇమ్రాన్‌కు ముప్పు ముంచుకొచ్చినట్టే. నాలుగేళ్ల క్రితం సైన్యం ప్రాపకంతో అధికారంలోకొచ్చిన ఇమ్రాన్‌కు అసంతృప్తి కొత్తగాదు. ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలూ పాతవే. ఈ సంక్షోభాలే విపక్షాలకు ఇంధనంగా ఉపయోగపడుతుంటాయి. సైన్యం ఆశీస్సులుంటే విపక్ష నిరసనలు హోరెత్తుతాయి. లేదంటే విపక్ష నేతలంతా జైలు పాలవుతారు. ఇమ్రాన్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి దాదాపు రెండేళ్లుగా ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజాస్వామ్య ఉద్యమం(పీడీఎం) పేరిట నిరుడు ఉద్యమం నడిచింది. సైన్యం ఇమ్రాన్ వెనక దృఢంగా నిలవడంతో అది చప్పున చల్లారింది. తాజాగా ‘అవిశ్వాస’ సెగ కూడా ఆ బాపతే కావొచ్చని అనేకులు అనుకుంటుండగా అది రోజురోజుకూ విస్తరిస్తున్న వైనం అధికార పక్షానికి చెమటలు పట్టిస్తోంది. అసలు పాకిస్తాన్‌కు ఏమైంది? రోజులు మారుతున్నాయనీ, వాటితోపాటు తమ స్థానమూ చెల్లాచెదురవుతున్నదనీ అక్కడి పాలకులు గ్రహించకపోవడమే ఆ దేశానికి శాపమైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అడిగిందే తడవుగా అమెరికా డాలర్ల వర్షం కురిపించేది. అప్పుడప్పుడు ప్రజామోదంతో అధికారంలోకొచ్చిన పాలకులున్నా... ఆ ప్రభుత్వాలను కూలదోసి అధికార పీఠం సొంతం చేసుకున్న సైనికాధినేతలకు కొదవలేదు. అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్ మొదలు జియా వుల్ హక్, పెర్వేజ్ ముషార్రఫ్ వరకూ ఇందుకు ఉదాహరణలు. జియా అయితే అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను కూలదోసి తప్పుడు ఆరోపణలతో ఖైదు చేయడమే కాదు... విచారణ తతంగం నడిపి ఉరి తీయించాడు. కానీ సోవియెట్ యూనియన్ కుప్పకూలి అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యం ఏర్పడ్డాక, ప్రపంచీకరణ తర్వాత పాకిస్తాన్ ప్రాభవం క్షీణించడం మొదలైంది. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సాగించిన ఎడతెగని యుద్ధంలో తలబొప్పి కట్టి, అఫ్గాన్ నుంచి తప్పుకున్నాక అమెరికాకు పాకిస్తాన్‌తో మునుపటంత అవసరం లేకుండా పోయింది. పైగా అమెరికాకు మన దేశం మిత్రపక్షమైంది. అమెరికా స్థానంలో చైనా వస్తుందనీ, దాన్నుంచి పుష్కలంగా సాయం అందుతుందనీ పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అడిగినంత ఆర్థిక సాయం అందిస్తూనే, ఏమేం చేయాలో శాసించడం చైనాకు అలవాటు. ఇచ్చిన సొమ్ముకు మరిన్ని రెట్లు వసూలు చేయడం ఆనవాయితీ. అదే ఇమ్రాన్ కొంప ముంచింది. ఆదాయంలో అత్యధికం వడ్డీల చెల్లింపులకే పోతుంటే ఆయన ప్రభుత్వానికి కాళ్లూ చేతులూ ఆడలేదు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికీకరణ వంటివి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురికావడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణంతో రూపాయి చిక్కుతోంది. ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం అమాంతం పెరిగింది. మధ్య తరగతి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. చుట్టుముట్టిన ఈ సంక్షోభాల నుంచి బయటపడేందుకు దారీ తెన్నూ తోచక ఇమ్రాన్ ఊపిరాడకుండా ఉన్నారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ సైన్యం పాత్రే ప్రధానమైనది. ఇమ్రాన్‌ను ముందుపెట్టి వెనకనుంచి అది సాగించిన మంత్రాంగమే దీనికంతా మూలం. చేసిందంతా చేసి ఇప్పుడు తనకేమీ సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వానికి అండగా సైన్యం ముందుకు రావాలనీ, విపక్షాల నిరసనను అణిచేయాలనీ పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ హుస్సేన్ బహిరంగ ప్రకటన ద్వారా మొర పెట్టుకోగా, ‘దేశ రాజకీయాల్లో మా జోక్యం ఉండద’ంటూ సైన్యం బదులు పలికింది. పైగా తాము మొదటినుంచీ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామని గుర్తుచేసింది. సారాంశంలో ఇమ్రాన్‌ను బలిపశువును చేయడానికే అది సిద్ధపడిన సూచనలు కనబడుతున్నాయి. ఇదంతా అంతిమంగా తమ శత్రువు నవాజ్ షరీఫ్‌కు లాభిస్తుందనుకుంటే సైన్యం వెనక్కి తగ్గినా ఆశ్చర్యం లేదు. ఏతా వాతా తాము ఇష్టపడి గద్దెనెక్కించిన ఇమ్రాన్ భవితవ్యం ఇప్పుడు సైన్యం చేతుల్లో ఉంది. దాని ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయట పడనంతవరకూ పాకిస్తాన్ రాత మారదు. ఆ దేశాన్ని చుట్టుముట్టిన సంక్షోభాలూ సమసిపోవు. -
ఈ బైక్‌పై ఏకంగా రూ.28 వేల తగ్గింపు
ముంబై: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ తన ఆర్వీ 400 మోడల్ ధరపై రూ.28,201 తగ్గించింది. ధర కోత తర్వాత ఎక్స్–షోరూమ్ బైక్ ధర రూ.90,799గా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇటీవల ఫేమ్-2 పథకాన్ని సవరించింది. ఇందులో భాగంగానే ఈ మోడల్ ధరల్ని తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. రివోల్ట్ ఈ–బైక్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఒకసారి పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. గతవారంలో కేంద్రం సవరించిన ఫేమ్–2 నిబంధనల ప్రకారం... ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 1కిలోవాట్/అవర్‌కు రూ.10 వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీ రూ.15 వేలకు పెరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో టాటా మోటార్స్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనంపై రూ.11,250లను తగ్గించింది. అలాగే ఒకినావా ఆటోటెక్ ఈవీ పోర్ట్‌ఫోలియో ధరలు కనిష్టంగా రూ. 7,209, గరిష్టంగా రూ. 17,892లు చొప్పున తగ్గాయి. -
కమలంలో కలకలం: సీఎంపై తిరుగుబాటు
న్యూఢిల్లీ: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్‌ను సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీ అప్రదిష్టపాలవుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీకి చేరారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ఆరోగ్య, హెవీ వెయిట్ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బార్మన్ నేతృత్వంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా ఢిల్లీలోని త్రిపుర భవన్లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘మేం దాదాపు 12 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. రాష్ట్రంలో నెలకొన్న నియంతృత్వ, పేలవమైన పాలన గురించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. సీఎం వ్యాఖ్యలు, చేతలతో పార్టీ అప్రదిష్ట పాలవుతుంది’ అన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన విప్లవ్ దేవ్) ‘ఇప్పటికే పలు అంశాల గురించి ముఖ్యమంత్రి తర అనుచిత వ్యాఖ్యలతో పార్టీని అనేక సార్లు ఇబ్బందుల్లో పడేశారు. ఇక రాష్ట్రంలో కోవిడ్-19 సంక్షోభ నిర్వహణ పేలవంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య మంత్రి లేరు. దాంతో త్రిపురకు ఓ కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరతాం. ఇక అనుభవజ్ఞులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు డిప్యూటేషన్, స్వచ్ఛంద పదవీ విరమణతో రాష్ట్రాన్ని వీడుతున్నారు. కారణం ఏంటంటే వారు ముఖ్యమంత్రి నియంతృత్వ స్వభావాన్ని భరించలేకపోతున్నారు. ఆఖరికి మీడియాను కూడా బెదిరించారు. దాంతో పాత్రికేయులు కూడా సీఎంకు వ్యతిరేకంగా ముందుకొచ్చారుఝ’ అని తెలిపాడు. అంతేకాక ‘మేమంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండే కార్యకర్తలం అని జాతీయ నాయకత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో బీజేపీ దీర్ఘకాలం పదవిలో ఉండాలని భావిస్తున్నాం. కానీ ప్రస్తుత నాయకత్వం కొనసాగితే.. వామపక్షాలు, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు బలపడతాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారు’ అని తెలిపాడు. (చదవండి: అమ్మాయిని కలిసేందుకు వచ్చాడని...) అయితే ఈ వ్యాఖ్యలను విప్లవ్ దేవ్ ప్రధాన అనుచరులు ఖండించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మండి పడ్డారు. ‘రాష్ట్రంలో పాలన సాజవుగా సాగుతుంది. వీరు అవాంతరాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు పార్టీలో 7-8 మంది ఉంటారు. వీరంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు. బీజేపీ పాత నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలోని నాయకులు విప్లవ్ దేవ్ నాయకత్వం మీద పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నార’ని తెలిపారు. త్రిపురలో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) రాష్ట్రంలో 25 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని తొలగించి 2018లో అధికారంలోకి వచ్చింది. 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తరఫున 36 మంది, ఐపీఎఫ్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. -
నెత్తుటి జ్ఞాపకం
-
రివోల్ట్ ఇ-బైక్స్ లాంచ్
సాక్షి, హైదరాబాద్: రివోల్ట్ ఇంటెల్లి కార్పొరేషన్ తన ఈ-బైక్‌లను హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేసింది. రివోల్ట్ ఆర్వీ 400, ఆర్వీ300 పేరుతో ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా టెలికార్ప్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మాట్లాడుతూ స్థిరమైన, సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులో తెచ్చే క్రమంలో తమ నిబద్ధతను తమకొత్త వాహనాలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. నగదు చెల్లించి తీసుకుంటే ఆర్వీ 400 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,03,999. దీనికి బుకింగ్ చార్జ్ రూ.3,999 అదనం. ఆర్వీ300 మోటార్ సైకిల్ ధర రూ. 84,999. దీనికి రూ.2,999 బుకింగ్ చార్జ్ అదనం. 38 నెలలు నెలకు రూ.3,999 చెల్లించి ఆర్వీ400ను ముందుగానే పొందే అవకాశంకూడా అందుబాటులో వుంది. ఆర్వీ300 బైక్‌కు నెలకు రూ.2,999 చొప్పున 36 నెలలు చెల్లించాలి. బుకింగ్ ఫీజు అదనం. ఆర్వీ 400 బైక్: 3.24 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళుతుందని చెప్పారు. గంట కు గరిష్ఠంగా 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే రివాల్ట్ గూగుల్ భాగస్వామ్యంతో కనెక్ట్ చేసిన హెల్మెట్‌ను కూడా అందిస్తుంది. ఇది రైడర్‌ను వాయిస్ కమాండ్, రివాల్ట్ స్టార్ట్ ఉపయోగించి బైక్‌ను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. కాగా ఢిల్లీ పుణేలలో ఇప్పటికే ఈ బైక్‌లను ఇప్పటికే లాంచ్ చేసింది. -
తిరుగుబాటు నిజమే : కుమారస్వామి
సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమేనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. అయితే, సరైన నిర్ణయంతో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పెట్టుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగారు. అయితే, ఆయన వారితో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్, రోషన్ బేగ్, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్ గుండురావు, ఈశ్వర్ ఖండ్రే, షమనూర్ శివశంకరప్ప, సతీష్ జాక్రిహోలిలు కేబినేట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
ఎమ్మెల్యేల తిరుగుబాటు : ప్రభుత్వం కష్టమే?
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ముచ్చెమటలు పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్లలో చీలిక వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి. దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగారు. అయితే, ఆయన వారితో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్, రోషన్ బేగ్, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్ గుండురావు, ఈశ్వర్ ఖండ్రే, షమనూర్ శివశంకరప్ప, సతీష్ జాక్రిహోలిలు మంత్రి పదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యచరణపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు మాత్రం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలదని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం అన్యాయం చేసిన పార్టీకి ఎందుకు దన్నుగా నిలవాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కేబినెట్లోని సీనియర్లను తీసుకోకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారని తెలిసింది. లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రేలను సైతం కేబినేట్లోకి తీసుకోకపోవడం చర్చనీయాశంగా మారింది. వీర శైవ లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివ శంకరప్ప(89)ను కూడా కేబినేట్లోకి తీసుకోకుండా పక్కనబెట్టారు. కాగా, చర్చలు జరిపేందుకు యత్నించిన కేపీసీసీ చీఫ్ పరమేశ్వరపై అసంతృప్త ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డట్లు తెలిసింది. అయితే, పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని పరమేశ్వర పేర్కొన్నారు. కేబినెట్లో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయని, వాటిలోకి కొందరిని తీసుకుంటారని చెప్పారు. -
‘ప్రసారభారతి’ తిరుగుబాటు
అప్పుడప్పుడు కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. దూరదర్శన్, ఆకాశవాణి సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే ప్రసారభారతి సంస్థ పాలకుల ఆదేశాలను ధిక్కరించిన వైనం అలాంటి ఊహకందని పరిణామమే. ప్రసారభారతి బోర్డులో ఒక సభ్యుడి నియామకంతోపాటు ఇద్దరు పాత్రికేయులను భారీ వేతనాలతో ఉద్యోగులుగా తీసుకోవాలంటూ తాజాగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను ప్రసారభారతి బోర్డు తిరస్కరించింది. ఇలాంటి సిఫార్సులు ప్రసారభారతి చట్టాన్ని, దాని స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. అలాగే కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలన్న సూచనకు కూడా అంగీకరించలేదు. ప్రసారభారతి పుట్టి బుద్ధెరిగి ప్రభుత్వానికి ఇలా ఎదురుతిరిగిన సందర్భం లేదు. వాస్తవానికి ఆ సంస్థ ఏర్పాటు ఉద్దేశం పాలకుల అడుగులకు మడుగులొత్తాలని కాదు... అది స్వతంత్రంగా వ్యవహరించి దూరదర్శన్, ఆకాశ వాణిలను వృత్తిపరమైన ఉన్నత సంస్థలుగా తీర్చిదిద్దాలనే. కానీ ప్రసారభారతి తన ఆవిర్భావం వెనకున్న ఉద్దేశాన్ని మరిచింది. అధికారంలో ఉన్నవారి అభీష్టాన్ని నెరవేరుస్తూ వచ్చింది. ఫలితంగా దూరదర్శన్, ఆకాశవాణి ఎప్పటిలాగే మిగిలి పోయాయి. మన దేశంలో ఉన్నతాశయాలతో ప్రారంభించిన సంస్థలు వాటికి చాలా దూరంగా ఉండిపోవడం కొత్తేమీ కాదు. పరిశ్రమల నిర్వహణ బాధ్యతలను ఆయా రంగాల్లో నిపుణులైనవారికి అప్పగించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించాలని పబ్లిక్ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో అది విఫలమైంది. పరిశ్రమల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరగడం, ఉన్నత పదవుల్లో అయినవారిని నియమించాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం పర్యవ సానంగా చాలా పబ్లిక్ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి చివరకు మూతబడిన ఉదంతాలున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా స్వతంత్రంగా వ్యవహరించి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతుల్ని గడించిన సంస్థలు కూడా లేకపోలేదు. తాము అధికారంలోకొస్తే ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ప్రభుత్వ అజ్మాయిషీ నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పని పార్టీ లేదు. అత్యవసర పరిస్థితి కాలంలో సెన్సార్షిప్ అమలు చేసి ఆకాశవాణి గొంతు నులిమిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన తర్వాత తమకు అధికారమిస్తే ఇలాంటి దుస్థితి కలగకుండా చూస్తామని జనతాపార్టీ తొలిసారి హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర పార్టీలు సైతం అలాంటి హామీలివ్వడం, అమలు చేయకపోవడం రివాజుగా మారింది. కానీ బలహీనమైన ప్రభుత్వానికి నాయకత్వంవహించి, స్వల్పకాలం ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్ ఆశ్చర్యకరంగా 1990లో ఈ ప్రసారభారతి బిల్లుకు మోక్షం కలిగించి అది చట్టరూపం ధరించడానికి కారకులయ్యారు. ఆ తర్వాత వచ్చిన పీవీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అటకెక్కించింది. 1995లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాకే కదలిక మొదలైంది. అయినా రెండేళ్లకాలం వృథాగా గడిచిపోయింది. చివరకు ఐకె గుజ్రాల్ ప్రధానిగా వచ్చాక 1997లో ప్రసారభారతి చట్టం అమల్లోకి వచ్చింది. ప్రసారభారతి పనితీరు మొదటినుంచీ అంత సంతృప్తికరంగా ఏం లేదు. దాని పని అది చేసుకుంటే పెత్తనం చేయడానికి తమకేం మిగులుతుందని సమాచార మంత్రులుగా వచ్చినవారంతా భావించినట్టున్నారు. అందువల్లే ఆ సంస్థను తమ ఉక్కు పిడికిట్లో ఉంచుకున్నారు. దాదాపు 450 దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రసారభారతి దేశంలోనే అతి పెద్ద ప్రసార సేవల సంస్థ. వర్తమాన అవసరాలకు తగినట్టుగా ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని అది ప్రయత్నించిన దాఖలాలు లేవు. నిధుల కొరత దీనికి ప్రధాన కారణం అన్నది నిజమైనా... అందుకోసం ప్రభుత్వంతో అవసరమైతే తలపడాలని ఎవరూ అనుకోలేదు. ప్రసారభారతి సారథులుగా నియమితులయ్యేవారు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితులైనవారే ఉంటారు. ఆ మొహమాటం కొద్దీ వారు నోరెత్తరు. ఏ నియామకం చేయాలన్నా ప్రభుత్వామోదం కోసం ఎదురుచూడాల్సిందే. ఎవరైనా చొరవ తీసుకుని నిపుణులైనవారిని డైరెక్టర్ జనరళ్లుగా లేక బ్యూరో చీఫ్లుగా నియమిస్తే సమాచార మంత్రిగా ఉండేవారికి ఆగ్రహం కలుగుతుంది. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతున్నది ఇదే. ప్రసారభారతి చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల ఆస్తులు ప్రసారభారతి సంస్థకు బదిలీ కావాలి. అదే జరిగుంటే ఆ ఆస్తుల్ని ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి, ప్రభుత్వంపై ఆధారపడే స్థితిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉండేది. ప్రసారభారతి ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు 48,000మంది సిబ్బంది బదిలీకాగా, ప్రస్తుతం ఉన్నవారి సంఖ్య 32,000 మాత్రమే. వారిలో చాలా భాగం కాంట్రాక్టు కింద పనిచేస్తున్నవారే. ఆకాశవాణి, దూరదర్శన్లు ఎన్ని పరిమితుల్లో పనిచేసినా వృత్తిపరంగా ఉన్న తులైనవారిని అందించాయి. సృజనాత్మక రంగాల్లో లబ్ధప్రతిష్టులైనవారు ఆ సంస్థల్లో పనిచేశారు. వాటికి విశ్వసనీయత కలిగించారు. నిజానికి ప్రసారభారతి ఏర్పడ్డాక ఇవి రెండూ మరింత ఉన్నతంగా ఎదిగి ఉండాల్సింది. ప్రసారభారతిని బీబీసీ స్థాయిలో తీర్చిదిద్దాలని, ఆకాశవాణి, దూరదర్శన్‌లను అగ్రగామి సంస్థ లుగా రూపొందించాలని కలలుగన్నవారు లేకపోలేదు. కానీ వారు త్వరలోనే నీర సించిపోయారు. ఏమీ చేయలేక అచేతనంగా ఉండిపోయారు. కారణాలేమైనా ఇప్పుడు ప్రసారభారతి బోర్డు ప్రభుత్వ సిఫార్సులను, సూచనలను తిప్పికొట్టింది. మొత్తం కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలని హుకుం జారీ చేయడం, అందుకు ఉపయోగించిన భాష తమకు సమ్మతం కాదని తెలిపింది. ఈ ఉదంతంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రసారభారతి స్వయంప్రతిపత్తిని గౌరవించాలి. ప్రభుత్వ కర్ర పెత్తనం వల్ల ప్రయోజనం కలగకపోగా ప్రసారభారతి, దాంతోపాటు ఆకాశ వాణి, దూరదర్శన్లు మరింతగా దెబ్బతింటాయని తెలుసుకోవాలి. -
పన్నీర్ తిరుగుబాటు చేయకుంటే..?
చెన్నై: శశికళపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవిని పన్నీర్ సెల్వం చేజార్చుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చిన్నమ్మ చెప్పినట్టు వింటే సీఎం సీటులో కొనసాగేవారన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నెల 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) శశికళపై తిరుగుబాటు చేశారు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలయ్యారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయకుండా ఉంటే మళ్లీ సీఎంగా ఆయననే ‘చిన్నమ్మ’ కొనసాగించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శశికళను ఢీకొట్టి పదవితో పాటు పార్టీకి దూరమయ్యారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఒకవేళ సీఎం పదవి దక్కకపోయినా గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పోస్టు దక్కేదని సానుభూతి పరులు పేర్కొంటున్నారు. ‘చిన్నమ్మ’, పార్టీకి విధేయుడిగా సెల్వం కొనసాగితే మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించివుండేవారన్న వాదనలు విన్పిస్తున్నాయి. తనకు ఎదురు తిరిగిన పన్నీర్ సెల్వంపై జైలుకు వెళుతూ శశికళ కక్ష తీర్చుకున్నారు. పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చొపెట్టి పన్నీర్ పై ప్రతీకారం సాధించారు. దీంతో పన్నీర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. -
చిక్కుల్లో 'సింగ్'
కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్‌పై 17 మంది కార్పొరేటర్ల తిరుగుబావుటా మొన్న మంత్రి ఈటెలను కలిసిన కార్పొరేటర్లు నిన్న అక్రమ నల్లాలు, సబ్‌ప్లాన్ నిధులపై కమిషనర్‌కు వినతి అక్రమ నల్లా దందాకు కారకుడెవరో తేల్చాల్సిందే కార్పొరేషన్లో ముసలంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన ఈటెలను కలిసిన సమయంలో మేయర్‌కు వ్యతిరేకంగా ముగ్గురు కార్పొరేటర్లుమాత్రమే ఉండగా.. కమిషనర్‌ను కలిసేటప్పటికీ ఆ సంఖ్య 17కు చేరింది. ఒకట్రెండు రోజుల్లో ఈ సంఖ్య 25కు చేరే అవకాశాలున్నాయని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. కార్పొరేషన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 35. ఇందులో మేయర్‌ను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 25 దాటడంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్లో స్వపక్ష సభ్యులే విపక్షంగా మారారు. మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌పై తిరుగుబావుటా ఎగరేశారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తమ డివిజన్లకు నిధులను కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. చివరకు దళిత వాడల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన సబ్‌ప్లాన్ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇదేమని అడిగితే విపక్ష కాంగ్రెస్ సభ్యులను తమపైకి ఎగదోస్తున్నారని వాపోతున్నారు. మేయర్ వ్యవహారశైలి మారకపోతే తాము రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. గురువారం ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లను కలిసి మేయర్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్లు.. శుక్రవారం నగర కమిషనర్‌ను కలిసి మేయర్‌కు వ్యతిరేకంగా వినతిపత్రం అందజేశారు. ఈటలను కలిసిన సమయంలో మేయర్‌కు వ్యతిరేకంగా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. కమిషనర్‌ను కలిసేటప్పటికీ ఆ సంఖ్య 17కు చేరింది. ఒకట్రెండు రోజుల్లో ఈ సంఖ్య 25కు చేరే అవకాశాలున్నాయని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేస్తామని, అయినా తీరు మారకుంటే సొంత పార్టీకి రాజీనామా చేసేందుకూ వెనుకాడబోమని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి కరీంనగర్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 35. ఇందులో మేయర్‌ను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 25 దాటడంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. మేయర్‌పై వ్యతిరేకత ఎందుకంటే...? మేయర్ రవీందర్‌సింగ్‌పై అధికార పార్టీలో సింహభాగం కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేయడానికి చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. గతంలో పాలకపక్ష సభ్యులను సంప్రదించకుండా శానిటేషన్ టెండర్లను మేయర్ రవీందర్‌సింగ్ ఏకపక్షంగా రద్దు చే సిన ప్పటి నుండే మేయర్‌కు, కార్పొరేటర్లకు మధ్య విభేదాలు మొదలైనట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనికితోడు సొంత పార్టీ వారిని కాదని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్ సునీల్రావుసహా విపక్ష సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తూ తమను విస్మరిస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. అభివృద్ధి పనుల కేటాయింపు, నిధుల మళ్లింపులోనూ వివక్ష చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావుకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మేయర్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చే రుకున్న దళిత, బీసీ నేతలైన మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌లను ఆ స్థాయిలో సన్మానించకపోవడాన్ని రవీందర్‌సింగ్ వ్యతిరేకులు తప్పుపడుతున్నారు. జూన్ 2నుంచి వారం రోజుల పాటు జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీకి చెందిన కార్పొరేటర్లను కలుపుకుపోవడం లేదని, ఎవరికీ ఆహ్వానాలు పంపడం లేదని అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన కార్పొరేటర్లకే పెద్దపీట వేస్తున్నారని, వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లినా మేయర్ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 నెలలుగా మేయర్‌పై వ్యతిరేకతతో ఉన్నప్పటికీ అదను కోసం వేచిచూస్తున్న కార్పొరేటర్లకు అక్రమ నల్లాల దందా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు అంశాలు అస్త్రాలుగా మారాయి. అందులో భాగంగా గత రెండ్రోజులుగా మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లను కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేశారు. మేయర్ తీరు మారకపోతే రాజీనామా చేస్తామని చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన మంత్రి ఈటల ఆయా కార్పొరేటర్లను బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యే గంగులకు అప్పగించారు. ఎమ్మెల్యే సదరు కార్పొరేటర్లను బుజ్జగిస్తున్నప్పటికీ... శుక్రవారం వారంతానగర పాలక సంస్థ కమిషనర్ రమణాచారిని కలిసి మేయర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తొలుత వీరంతా కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ తరువాత మనుసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేయర్ మద్దతుదారులను ఇరుకున పెట్టేందుకు వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కార్పొరేటర్‌పై కేసు వెనుక..? ఇటీవల ఓ గోడ వివాదంలో 20వ డివిజన్‌కు చెందిన మహిళా కార్పొరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్ మద్దతుదారులైన సదరు కార్పొరేటర్‌పై కావాలనే వ్యతిరేక వర్గం కేసు నమోదు చేయించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఐటీ, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లలో మేయర్, వ్యతిరేకవర్గం మధ్య ఆధిపత్యపోరు చివరకు ఎటు దారితీస్తుందోనని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కమిషనర్‌ను కలిసిన కార్పొరేటర్లు వీరే.. 1. గంట కళ్యాణి 2. కంసాల శ్రీనివాస్ 3. మహ్మద్ ఆరిఫ్ 4. లింగంపల్లి శ్రీనివాస్, 5. లంక రవీందర్, 6. నలువాల రవీందర్ 7. పెద్దపల్లి రవీందర్ 8. బోనాల శ్రీకాంత్ 9. కర్రె లింగయ్య 10. బండారి వేణు. మిగిలిన ఏడుగురు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులున్నారు. వీరిలో 11. సిగిరి రవి (వెంకటమ్మ కుమారుడు), 12. అబ్బాస్‌షమీ (8వ వార్డు కార్పొరేటర్ గౌసియా బేగం-ఎంఐఎం భర్త), 13. బోయినపల్లి శ్రీనివాస్ (10వ వార్డు రజిత భర్త), 14. మెండి చంద్రశేఖర్ (12వ వార్డు లత భర్త), 15. నేతికుంట యాదయ్య (20వ వార్డు కళావతి భర్త), 16. చల్ల హరిశంకర్ (41వ వార్డు కార్పొరేటర్ స్వరూపరాణి భర్త), 17. కొండపల్లి సతీష్ (49వ వార్డు కార్పొరేటర్ బత్తుల భాగ్యలక్ష్మి అల్లుడు). ఫిర్యాదులో పేర్కొన్న అంశాలివీ... నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగంలో గత ఆరు నెలల నుంచి నిబంధనలకు విరుద్దంగా అక్రమ నల్లా కనెక్షన్లు, రూపాయి చెల్లించకుండా ట్యాంకర్ల నీటిని అమ్ముకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ జనాభా లేని డివిజన్లలో ఖర్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో 8 డివిజన్లను గుర్తించి నిధులు ఖర్చుచేయగా ప్రస్తుతం 18 డివిజన్లకు పనులు కేటాయించడం ఎస్సీలకు అన్యాయం చేసినట్లే. డివిజన్లను పెంచాలనుకుంటే 10 డివిజన్లకు మించి పెంచొద్దు. లేనిపక్షంలో అధికార పక్ష కార్పొరేటర్లమే కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన అంశాల్లో ఎక్కడా మేయర్ పేరును ప్రస్తావించని కార్పొరేటర్లు కమిషనర్‌తో మట్లాడుతున్న సందర్భంలో పలుమార్లు మేయర్ పేరును ప్రస్తావిస్తూ పై అంశాలన్నింటికీ ఆయనే బాధ్యుడిని చేస్తూ మాట్లాడటం గమనార్హం. -
ప్రభుత్వంపై పోలీసుల తిరుగుబాటు
గువాహటి: అసోంలో సాయుధ బలగాలు తిరుగుబాటు జెండా ఎగరేశాయి. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం ఆ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్పీవోలు) చేపట్టిన గువాహటి ముట్టడి కార్యక్రమం హింసాయుతంగా మారింది. తిరుగుబాటును అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులకు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. మరో ముగ్గురు పౌరులుకూడా గాయపడినట్లు తెలిసింది. అసోం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 840 మంది సాయుధ ఎస్పీవోలు సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు సమర్పించారు. అవన్నీ బుట్టదాఖలు కావడంతో గువహటిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలోనే 340 మంది ఎస్పీవోలు శనివారం రాత్రి దిమా హసావో జిల్లా కేంద్రం నుంచి మూడు డంపర్లు, ఒక ట్రక్కులో గువాహటికి బయలుదేరారు. తతిమావారు మార్గం మధ్యలో ర్యాలీలో చేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు తిరుగుబాటుదారుల్ని గువాహటిలోకి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 'ఆందోళన విరమించాలనే తమ అభ్యర్థనను ఎస్సీవోలు పెడచెవినపెట్టి కాల్పులకు దిగారని, బదులుగా తాము కూడా కాల్పులు జరపవలిసి వచ్చిందని అసోం ఐజీ(లా అండ్ ఆర్డర్) ఎస్ ఎన్ సింగ్ మీడియాకు చెప్పారు. కాల్పుల్లో ఇద్దరు ఎస్పీవోలు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారని చెప్పారు. జాతీయ రహదారుల్లోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకోసం అసోం ప్రభుత్వం 2008లో వందలమంది ఎస్పీవోలను అద్దె ప్రాతిపతికన నియమించుకుంది. ఏళ్లుగా తమతో రకరకాల సేవలు చేయించుకుంటున్న ప్రభుత్వం.. జీతభత్యాలు, సర్వీసు క్రమబద్ధీకరణ విషయాల్లో తమకు అన్యాయం చేస్తోన్నదని ఎస్పీవోలు ఆగ్రహంతో ఉన్నారు. గతేడాది సెప్పెంబర్లోనూ ఎస్పీవోలు ఇదే తరహా తిరుబాటుకు ప్రయత్నించడం, పోలీసులు దానిని అణిచివేయడం గమనార్హం. కాగా, తాజా తిరుగుబాటును తీవ్రంగా పరిగణిస్తున్నామని, అందులో పాలుపంచుకున్న ఎస్పీవోలందరినీ చట్టపరంగా శిక్షిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. -
రెబల్స్ పై ఇరాక్ బలగాల పైచేయి
రెండు పట్టణాలు తిరిగి స్వాధీనం బాగ్దాద్: మిలిటెంట్లతో పోరులో పైచేయి సాధించామని ఇరాక్ ప్రభుత్వ బలగాలు తెలిపాయి. బాగ్దాద్ సమీపంలోని రెండు పట్టణాలను తిరుగుబాటుదారుల చేతుల్లోంచి తిరిగి చేజిక్కించుకున్నామని, వారిని వెనక్కి తరిమికొడుతున్నామని ఆర్మీ కమాండర్లు ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ బలగాలు గత 24 గంటల్లో 279 మంది మిలిటెంట్లను హతమార్చాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. పోరులో పైచేయి సాధించామని ప్రధాని నూరీ అల్ మాలికి ఈ ప్రతినిధి కాసెమ్ అత్తా తెలిపారు. షియా మతపెద్ద అయతొల్లా అలీ అల్‌సిస్తానీ పిలుపుపై వలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆర్మీలో చేరనున్నట్లు తెలిపారు. మరోపక్క.. ఖాలెస్ పట్టణంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాంతంలో జరిగిన దాడిలో ముగ్గురు పోలీసులు సహా ఆరుగురు చనిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) జీహాదీ గ్రూపు నేతృత్వంలో సోమవారం తిరుగుబాటు లేవదీసిన మిలిటెంట్లు ఓ రాష్ట్రాన్ని పూర్తిగా, మరో మూడు రాష్ట్రాల్లోని అధిక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో దేశంలో అంత్యర్యుద్ధం మొదలైంది. సంక్షోభం నేపథ్యంలో అమెరికా గల్ఫ్‌కు విమాన వాహక నౌకను పంపింది. తిరుగుబాటును అణిచే శక్తి ఇరాక్‌కు ఉందని, విదేశీ సైనిక జోక్యం వద్దని ఇరాన్ హెచ్చరించింది. ఇరాక్‌కు వెళ్లొద్దు: భారత్.... హింసతో అట్టుడుకుతున్న ఇరాక్‌కు ప్రయాణాలు మానుకోవాలని తమ పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు జాగ్రత్తలు తీసుకోవాలని, స్వదేశానికి వచ్చే అంశంపై ఆలోచించుకోవాలని విదేశాంగ శాఖ పేర్కొంది. సాయం కోసం 964770444 4899/4899(మొబైల్), 964770484 3247/3247(మొ -
రాజధానిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
హైదరాబాద్: రాజధానిలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. కొందరు పార్టీ వీడే యోచనలో ఉండగా, మరికొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు లంకల దీపక్ రెడ్డి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. టీడీపీ నేత సామరంగారెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. మరో నలుగురు టీడీపీ టీడీపీ కార్పొరేటర్లు పార్టీకి రాజీ నామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొందరు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీ తరపున రంగంలోకి దిగారు. ఎల్బీనగర్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో కృష్ణయ్య వాహనం ధ్వంసమైంది. దీంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.