దాదాపు పాతికేళ్ల రష్యన్ అధికారంలో పుతిన్ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొని ఉండడు. అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తే.. తీవ్రారోపణలకు దిగి మరీ తిరుగుబావుటా జెండా ఎగరేయడం, ప్రధాన నగరాల్లో తన సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలకు కారకుడు కావడం.. చివరకు మిత్రదేశం జోక్యంతో వ్యవహారం చల్లారడం.. కేవలం 36 గంటల్లోనే పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే..
ఈ పరిణాలను నిశితంగా పరిశీలించడమే తప్పా.. తమకు అనుకూలంగా వాడుకోవాలని ఉక్రెయిన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం విడ్డూరం. దురాక్రమణతో దాదాపు ఏడాదిన్నర కాలంగా తీవ్రంగా నష్టపోతోంది ఆ దేశం. పాశ్చాత్యదేశాలు ఎంతలా సాయం అందించిన కూడా ఒంటరి పోరు తప్పడం లేదు. ఈ క్రమంలో వాగ్నర్ గ్రూప్‌ను తమవైపు తిప్పేసుకునే దిశగా ఉక్రెయిన్ ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల నుంచి వెలువడుతోంది.
వాగ్నర్ గ్రూప్ ఉద్దేశం.. ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యాకు సహకరించడం. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నగరం బఖ్‌ముత్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించింది కూడా వాగ్నర్ గ్రూపే. ఈ క్రమంలో.. మే నెలలో అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పుతిన్ షెఫ్‌గా పేరున్న ప్రిగోజిన్ ఉన్నట్లుండి వెనక్కి వస్తున్నట్లు ప్రకటించడం.. ఆ వెంటనే రష్యా మిలిటరీ సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన దళంలోని 20వేలమందిని రష్యా మిలిటరీనే పొట్టనబెట్టుకుందని, తన విమర్శలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారడంతో తాజాగా క్షిపణులతో రష్యా రక్షణ శాఖ తన గ్రూప్‌ను లక్ష్యం చేసుకుందని సంచలన ఆరోపణలు దిగాడు ప్రిగోజిన్. ఈ క్రమంలోనే తిరుగుబాటు ప్రకటన చేయడంతో.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కట్టడి పాలనను తెరపైకి తెచ్చింది రష్యా.
వీక్ పుతిన్!
పతిన్‌కు తిరుగుబాట్లు అణచడం కొత్తేం కాకపోవచ్చు. కానీ, పుతిన్‌కు ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం నేర్పింది. చిన్నదేశాన్ని.. సులువుగా ఆక్రమింపజేయొచ్చనే అంచనాలు ఘోరంగా తప్పాయి. ఆ తర్వాత ఆయన ‘పవర్’ ప్రదర్శించే సందర్భమూ ఎక్కడా రాలేదు. ఈ లోపు మరొకటి. వాగ్నర్ గ్రూప్ అనే ప్రైవేట్ సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేసింది. పట్టుమని పాతిక వేల మంది కూడా లేరు ఆ గ్రూప్‌లో. కానీ, అత్యాధునిక ఆయుధాలతో రష్యాలో అల్లకల్లోలానికి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం కావడం, ఆ తిరుగుబాటును అణచలేక పొరుగు.. మిత్రదేశం అయిన బెలారస్ సాయం తీసుకోవడం పుతిన్ అధికారం ఎంతగా బలహీనపడుతుందో అనే విషయాన్ని తేలతెల్లం చేశాయి.
మౌనం దేనికి సంకేతం?
నాటకీయ పరిణామాలతో ముగిసింది రష్యా తిరుగుబాటు సంక్షోభం. తిరుగుబాటుకు కారకుడు.. నాయకత్వం వహించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ నిశబ్ధంగా ఉండిపోయాడు. బెలారస్‌లో ఆశ్రయం కోసం ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ తిరుగుబాటును దేశద్రోహంగా అభివర్ణించి.. ప్రిగోజిన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మౌనంగా ఉండిపోయారు. అసలా ప్రకటన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శనివారం అర్ధరాత్రి బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో దౌత్యం వహించి చర్చలను ఫలించేలా చేశారు. మాస్కో వైపు వచ్చే యత్నంలోనే.. వందల మైళ్ల దూరం నుంచే వాగ్నర్ బలగాలు వెనక్కి మళ్లిపోయాయి. పుతిన్-ప్రిగోజిన్ మధ్య జరిగిన ఒప్పందం ఏంటన్నది బహిర్గతం కాలేదు. కానీ, తనపై పెట్టిన దేశద్రోహం, తిరుగుబాటు, ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్ని కొట్టేయాలని ప్రిగోజిన్.. ప్రిగోజిన్ తిరిగి రష్యాలో అడుగుపెట్టకూడదనే షరతు మీద పుతిన్ అందుకు అంగీకరించినట్లు బెలారస్ మీడియా బెల్టా న్యూస్ కథనాలు ప్రచురిస్తోంది. అలాగే.. దౌత్యం నడిపిన లుకాషెంకోకు పుతిన్ కృతజ్ఞతలు తెలిజయజేసినట్లు తెలిపింది.
బంద్ వాతావరణమే!
రోస్తోవ్‌తో పాటు వొరోనెజ్, లిపెట్‌స్క్ తదితర ప్రాంతాల్లో మోహరించిన వాగ్నర్ దళాలు వెనుదిరిగాయి. ప్రిగోజిన్ అజ్ఞాతంలోకి వెళ్లింది ధృవీకరించుకున్నాక.. రష్యాలోని ప్రధాన నగరాల్లో అత్యవసర పరిస్థితిని.. ఆంక్షలను ఎత్తేశారు. పరిస్థితిని వీలైనంత త్వరగా సాధారణంగా మార్చేందుకు యత్నించారు. అయితే ముందస్తుగా ప్రకటించిన మాస్కో సెలవు దినం మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకులు యధావిధిగా కొనసాగనున్నాయి.
ముందడుగు వేసుంటేనా?
ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రపక్షాలు మంచి అవకావం మిస్ చేసుకున్నాయి. రష్యా ఒకటిన్నర రోజు తిరుగుబాటుపై కేవలం కీవ్ వర్గాలు ప్రకటనలనే పరిమితం అయ్యాయి. పరిస్థితులను పరిశీలిస్తున్నామని మాత్రమే పేర్కొన్నాయి. ఇది పుతిన్‌కు ఘోర అవమానం ప్రకటించాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ. కానీ, ఈలోపే పరిస్థితి చల్లారింది. ప్రిగోజిన్ వెనువెంటనే బలగాల ఉపసంహరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ వ్యక్తిగత సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్. అయితే ఇది ఆరంభం కాబోలని.. రష్యా భవిష్యత్తులో ఈ తరహావి మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదని మాత్రం అంచాన వేశారు. కానీ, ప్రిగోజిన్ బఖ్‌ముత్‌లో నాలుగు వారాల ముందే ఇచ్చిన తిరుగుబాటు ప్రకటనను సరిగ్గా గమనించి.. ముందడుగు వేసి ఉంటే అది క్రెమ్లిన్ మెడపై కత్తి పెట్టినట్లు అయ్యి ఉండేదన్నది పలువురి విశ్లేషణ. ఉక్రెయిన్ యుద్ధంలాగా.. ఈ తిరుగుబాటు సుదీర్ఘ కాలం కొనసాగినా.. ఉక్రెయిన్‌కు లాభం ఉండేదేమో!.
ఇదీ చదవండి: ప్రిగోజిన్ తిరుగుబాటు.. రష్యా రక్షణ వ్యవస్థ అంత వీకా?
Comments
Please login to add a commentAdd a comment