కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్‌పై 17 మంది కార్పొరేటర్ల తిరుగుబావుటా
మొన్న మంత్రి ఈటెలను కలిసిన కార్పొరేటర్లు
నిన్న అక్రమ నల్లాలు, సబ్‌ప్లాన్ నిధులపై కమిషనర్‌కు వినతి
అక్రమ నల్లా దందాకు కారకుడెవరో తేల్చాల్సిందే
కార్పొరేషన్‌లో ముసలంపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన
ఈటెలను కలిసిన సమయంలో మేయర్‌కు వ్యతిరేకంగా ముగ్గురు కార్పొరేటర్లుమాత్రమే ఉండగా.. కమిషనర్‌ను కలిసేటప్పటికీ ఆ సంఖ్య 17కు చేరింది. ఒకట్రెండు రోజుల్లో ఈ సంఖ్య 25కు చేరే అవకాశాలున్నాయని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 35. ఇందులో మేయర్‌ను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 25 దాటడంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
కరీంనగర్ కార్పొరేషన్‌లో స్వపక్ష సభ్యులే విపక్షంగా మారారు. మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌పై తిరుగుబావుటా ఎగరేశారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తమ డివిజన్లకు నిధులను కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. చివరకు దళిత వాడల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన సబ్‌ప్లాన్ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇదేమని అడిగితే విపక్ష కాంగ్రెస్ సభ్యులను తమపైకి ఎగదోస్తున్నారని వాపోతున్నారు. మేయర్ వ్యవహారశైలి మారకపోతే తాము రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. గురువారం ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లను కలిసి మేయర్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్లు.. శుక్రవారం నగర కమిషనర్‌ను కలిసి మేయర్‌కు వ్యతిరేకంగా వినతిపత్రం అందజేశారు. ఈటలను కలిసిన సమయంలో మేయర్‌కు వ్యతిరేకంగా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. కమిషనర్‌ను కలిసేటప్పటికీ ఆ సంఖ్య 17కు చేరింది. ఒకట్రెండు రోజుల్లో ఈ సంఖ్య 25కు చేరే అవకాశాలున్నాయని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేస్తామని, అయినా తీరు మారకుంటే సొంత పార్టీకి రాజీనామా చేసేందుకూ వెనుకాడబోమని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి కరీంనగర్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 35. ఇందులో మేయర్‌ను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 25 దాటడంతో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
మేయర్‌పై వ్యతిరేకత ఎందుకంటే...?
మేయర్ రవీందర్‌సింగ్‌పై అధికార పార్టీలో సింహభాగం కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేయడానికి చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. గతంలో పాలకపక్ష సభ్యులను సంప్రదించకుండా శానిటేషన్ టెండర్లను మేయర్ రవీందర్‌సింగ్ ఏకపక్షంగా రద్దు చే సిన ప్పటి నుండే మేయర్‌కు, కార్పొరేటర్లకు మధ్య విభేదాలు మొదలైనట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనికితోడు సొంత పార్టీ వారిని కాదని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ సునీల్‌రావుసహా విపక్ష సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తూ తమను విస్మరిస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. అభివృద్ధి పనుల కేటాయింపు, నిధుల మళ్లింపులోనూ వివక్ష చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావుకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మేయర్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చే రుకున్న దళిత, బీసీ నేతలైన మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌లను ఆ స్థాయిలో సన్మానించకపోవడాన్ని రవీందర్‌సింగ్ వ్యతిరేకులు తప్పుపడుతున్నారు. జూన్ 2నుంచి వారం రోజుల పాటు జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీకి చెందిన కార్పొరేటర్లను కలుపుకుపోవడం లేదని, ఎవరికీ ఆహ్వానాలు పంపడం లేదని అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన కార్పొరేటర్లకే పెద్దపీట వేస్తున్నారని, వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లినా మేయర్ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 నెలలుగా మేయర్‌పై వ్యతిరేకతతో ఉన్నప్పటికీ అదను కోసం వేచిచూస్తున్న కార్పొరేటర్లకు అక్రమ నల్లాల దందా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు అంశాలు అస్త్రాలుగా మారాయి. అందులో భాగంగా గత రెండ్రోజులుగా మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లను కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేశారు. మేయర్ తీరు మారకపోతే రాజీనామా చేస్తామని చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన మంత్రి ఈటల ఆయా కార్పొరేటర్లను బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యే గంగులకు అప్పగించారు. ఎమ్మెల్యే సదరు కార్పొరేటర్లను బుజ్జగిస్తున్నప్పటికీ... శుక్రవారం వారంతానగర పాలక సంస్థ కమిషనర్ రమణాచారిని కలిసి మేయర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తొలుత వీరంతా కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ తరువాత మనుసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేయర్ మద్దతుదారులను ఇరుకున పెట్టేందుకు వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
కార్పొరేటర్‌పై కేసు వెనుక..?
ఇటీవల ఓ గోడ వివాదంలో 20వ డివిజన్‌కు చెందిన మహిళా కార్పొరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్ మద్దతుదారులైన సదరు కార్పొరేటర్‌పై కావాలనే వ్యతిరేక వర్గం కేసు నమోదు చేయించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఐటీ, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లలో మేయర్, వ్యతిరేకవర్గం మధ్య ఆధిపత్యపోరు చివరకు ఎటు దారితీస్తుందోనని టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కమిషనర్‌ను కలిసిన కార్పొరేటర్లు వీరే..
1. గంట కళ్యాణి 2. కంసాల శ్రీనివాస్ 3. మహ్మద్ ఆరిఫ్ 4. లింగంపల్లి శ్రీనివాస్, 5. లంక రవీందర్, 6. నలువాల రవీందర్ 7. పెద్దపల్లి రవీందర్ 8. బోనాల శ్రీకాంత్ 9. కర్రె లింగయ్య 10. బండారి వేణు. మిగిలిన ఏడుగురు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులున్నారు. వీరిలో 11. సిగిరి రవి (వెంకటమ్మ కుమారుడు), 12. అబ్బాస్‌షమీ (8వ వార్డు కార్పొరేటర్ గౌసియా బేగం-ఎంఐఎం భర్త), 13. బోయినపల్లి శ్రీనివాస్ (10వ వార్డు రజిత భర్త), 14. మెండి చంద్రశేఖర్ (12వ వార్డు లత భర్త), 15. నేతికుంట యాదయ్య (20వ వార్డు కళావతి భర్త), 16. చల్ల హరిశంకర్ (41వ వార్డు కార్పొరేటర్ స్వరూపరాణి భర్త), 17. కొండపల్లి సతీష్ (49వ వార్డు కార్పొరేటర్ బత్తుల భాగ్యలక్ష్మి అల్లుడు).
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలివీ...
- నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగంలో గత ఆరు నెలల నుంచి నిబంధనలకు విరుద్దంగా అక్రమ నల్లా కనెక్షన్లు, రూపాయి చెల్లించకుండా ట్యాంకర్ల నీటిని అమ్ముకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ జనాభా లేని డివిజన్లలో ఖర్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో 8 డివిజన్లను గుర్తించి నిధులు ఖర్చుచేయగా ప్రస్తుతం 18 డివిజన్లకు పనులు కేటాయించడం ఎస్సీలకు అన్యాయం చేసినట్లే.
- డివిజన్లను పెంచాలనుకుంటే 10 డివిజన్లకు మించి పెంచొద్దు. లేనిపక్షంలో అధికార పక్ష కార్పొరేటర్లమే కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
- రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన అంశాల్లో ఎక్కడా మేయర్ పేరును ప్రస్తావించని కార్పొరేటర్లు కమిషనర్‌తో మట్లాడుతున్న సందర్భంలో పలుమార్లు మేయర్ పేరును ప్రస్తావిస్తూ పై అంశాలన్నింటికీ ఆయనే బాధ్యుడిని చేస్తూ మాట్లాడటం గమనార్హం.