పుతిన్, ప్రిగోజిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ గర్జించారు.
తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్‌ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది.
ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్‌ఎస్‌బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్
పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
25వేల మంది సైన్యంతో తిరుగుబాటు
ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్‌లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్‌లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా
మూసివేసినట్లు తెలుస్తోంది.
తాత్కాలిక విరమణ
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్‌గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్‌స్కీ
రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్‌లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment