Russian President Vladimir Putin Accuses West Of Wanting Russians To Kill Each Other In Mutiny - Sakshi
Sakshi News home page

తిరుగుబాటు తర్వాత తొలిసారి బయటకు.. వాళ్లపై విరుచుకుపడిన పుతిన్‌

Published Tue, Jun 27 2023 9:12 AM | Last Updated on Tue, Jun 27 2023 12:56 PM

Ukraine West Want Russians To Kill Each Other In Mutiny Says Putin - Sakshi

మాస్కో: తిరుగుబాటు.. తదనంతరం నాటకీయ పరిణామాల తర్వాత చల్లారిన సెగ.. ఈ క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎక్కడా కనిపించకపోవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. వేర్‌ ఈజ్‌ పుతిన్‌ అంటూ ఉక్రెయిన్‌, వెస్ట్రన్‌ మీడియా సంస్థలు పుతిన్‌ను ఏకిపారేశాయి. ఈ క్రమంలో సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, పాశ్చాత్య దేశాలపై,  ఉక్రెయిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటు నేపథ్యంలో రష్యాలో  రక్తపాతం కోసం ఉక్రెయిన్‌, పాశ్చాత్య దేశాలు ఆశలు పెట్టుకున్నాయని, కానీ, ఆ ఆశలు గల్లంతు అయ్యాయని వ్యంగ్యంగా స్పందించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. రష్యన్‌లు ఒకరినొకరు చంపుకుంటుంటే.. ఉక్రెయిన్‌, పాశ్చాత్య మిత్రకూటమి చూసి సంతోషించాలనుకున్నాయి. కానీ, రక్తపాతం నివారించేందుకే తాము ప్రయత్నించామని పుతిన్‌.. ప్రపంచానికి వెల్లడించారు. 

రష్యా నేల రక్తంతో తడిసి ముద్దవ్వడం మాకిష్టం లేదు. అందుకే వాగ్నర్‌ పోరాటయోధులకు క్షమాభిక్ష ప్రసాదించాం. తిరుగుబాటు సమయంలో రష్యన్‌లు ప్రదర్శించిన దేశభక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు అని పుతిన్‌ టీవీ ఛానెల్‌ ద్వారా ప్రసంగించారు. కీవ్‌లోని నియో నాజీలు, వాళ్లను పోషిస్తూ వస్తున్న పాశ్చాత్య మిత్రపక్షాలు.. ఇలా రష్యా శత్రువులంతా రష్యాలో సైనికులు ఒకరినొకరు చంపుకోవాలని బలంగా కోరుకున్నాయి. కానీ, భద్రతా బలగాలు ఆ పాచికను పారనివ్వలేదన్నారు.

వాగ్నర్‌ గ్రూప్‌కు కూడా కొన్ని ఆప్షన్స్‌ ఇచ్చాం. తిరిగి సైన్యంతో కలిసి పని చేయడమా? బెలారస్‌కు వెళ్లిపోవడమా? రష్యాకే తిరిగి రావడమా? ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పాం. జరిగిన పరిణామాల్ని.. ఏదో అంతర్జాతీయ పరిణామంగా చిత్రీకరించేందుకు పాశ్చాత్య మీడియా ప్రయత్నించింది. కానీ, ఇది రష్యా అంతర్గత వ్యవహారం మాత్రమేనని పుతిన్‌ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పుతిన్‌తో పెట్టుకున్నావ్‌.. కిటికీల దగ్గర జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement