సిద్ధరామయ్యతో కుమారస్వామి
బెంగళూరు : రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈ విషయం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా తెలుసు. ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురాలేకపోయిన ఆయనకు బద్దశత్రువులతో కలసి పని చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి కంటే యడ్యూరప్ప అయితేనే సిద్ధరామయ్య ఇష్టపడేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జేడీఎస్‌తో కూటమిని కొనసాగించాలని ఆయన్ను ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వాస్తవాలను తెలుసుకుని మసులుకోవాలని సిద్ధరామయ్యకు హితబోధ చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో దేవెగౌడ కుటుంబం పాలన చేయడం సిద్ధరామయ్యకు సహించడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ వెనుక పాలనలో నడవడం మరీ రుచించడం లేదు.
కేబినేట్ విస్తరణ పూర్తై మూడు వారాలు గడిచాయో.. లేదో..! అప్పుడు సోదర జేడీఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కుమారస్వామిపై రోజుకో వ్యంగ్యాస్త్రాన్ని వదులుతున్నారాయన. సిద్ధా వైఖరి పట్ట మిత్రపక్షం జేడీఎస్‌లోనే కాక, సొంతపార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను భుజాలపై ఎత్తుకుని నడిపించిన మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు అదే పార్టీకి తలనొప్పిగా మారడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ ప్రభుత్వం ఇంకెంతకాలం నిలబడుతుందంటూ సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కూడా సిద్ధూ అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుమారస్వామితో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీకి ఎలాంటి సమస్యా లేదని సిద్ధరామయ్య గుర్తించాలని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పేర్కొన్నారు.
తాజాగా బయటికి వస్తున్న వీడియోలన్నీ సిద్ధరామయ్య చికిత్స పొందుతున్న దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తాంగడి ప్రకృతి వైద్య కేంద్రం నుంచే వస్తున్నాయని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లోని ఓ వర్గం భావిస్తోంది. గందరగోళ వాతావరణం సృష్టించేందుకే మాజీ సీఎం వీటిని విడుదల చేస్తున్నారని సదరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment