విప్లవ్ కుమార్ దేవ్
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ద తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. మే 6(ఆదివారం)న ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తమ అధికారిక ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ వివాదస్పద వ్యాఖ్యలను జోడించింది. 150 సెకన్ల పాటు నిడివి కలిగిన ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం బీజేపీకి ఊపు తీసుకొచ్చే నేత త్రిపుర సీఎం విప్లవ్ కుమారేనని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు విప్లవ్ కుమార్, బీజేపీల అభిప్రాయాలు మాత్రమేనని పేర్కొంది.
త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విప్లవ్ కుమార్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం విప్లవ్‌ను మందలించినట్లు వార్తలొచ్చాయి. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన విప్లవ్ వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, బీజేపీని ఇరుకున పెట్టేసాయి. ఈ వ్యాఖ్యాలనే ట్వీట్ ద్వారా కాంగ్రెస్ మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment