గతంలో ఎన్నడూలేనట్లుగా సీల్డ్ కవర్ సంస్కృతికి భిన్నంగా రాహుల్‌గాంధీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంక తమ ఆశలు గల్లంతేనా అనే నిరాశ సీనియర్లలో వ్యాపించింది. అధినేత మాట కాబట్టి ఎవరూ బయటపడడం లేదు.
సాక్షి, బెంగళూరు: ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్యే. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ఆదివారం రాత్రి బెంగళూరు సభలో ప్రకటించారు. ఇప్పుడిదే రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తోంది. మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే తామే ముఖ్యమంత్రి అయిపోదామని కాంగ్రెస్‌లో చాలా మంది కలలు కంటూ కూర్చొన్నారు. ఈ తరుణంలో రాహుల్‌గాంధీ వారి ఆశలపై నీళ్లు చల్లారు. గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ముఖ్యమంత్రి స్థానం చేజారిపోయిందని ఇప్పటికీ చింతిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు అధినేత మాటలతో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దళిత వర్గం కోటా నుంచి మల్లికార్జున ఖర్గే, ఎంపీ కేహెచ్ మునియప్పలు కూడా సీఎం రేసులో ఉన్నారు.
పరమేశ్వర్‌కే పెద్ద దెబ్బ
2013 ఎన్నికల్లో పరమేశ్వర్ కొరటగెరెలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇందులో సిద్ధరామయ్య హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటుంటారు. ఈ సారి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్యేనని రాహుల్ ప్రకటించడంతో పరమేశ్వరకు దిక్కుతోచలేదని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఆయనతో పాటు సీఎంసీటుపై కన్నేసిన చాలా మందికి లోలోపల చింత మొదలైంది.
అదే సిద్ధరామయ్య బలం
సీఎం సిద్ధరామయ్య మూలతః జేడీఎస్‌కు చెందినవారు. సుమారు ఎనిమిదేళ్ల కిందట కాంగ్రెస్‌లోకి వచ్చారు. అంతకుముందు జేడీఎస్‌లో ఉండగా సిద్ధరామయ్య అహింద ద్వారా బలం పెంచుకోవడం తెలిసిందే. కాంగ్రెస్‌లో హేమాహేమీల మధ్య తన ప్రత్యేకతను చాటుకుంటూ 2013లో ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఏకు మేకై కూర్చొన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు సీఎం సిద్ధరామయ్యపై బలమైన అవినీతి ఆరోపణలు లేవు. మిగతా నాయకులు అంత బలవంతులు కాదు. దీంతో సిద్ధరామయ్యకు పార్టీలో తిరుగే లేకుండా పోయింది. కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నియామకాల వరకు అన్నీ సిద్ధరామయ్య చేతిలోకి వచ్చేశాయి. దీంతో ఖర్గే, ఎస్‌ఎం కృష్ణవంటి సీనియర్ల ప్రభ కూడా మసకబారింది. పరిపాలనలో తనదైన ముద్రను చూపిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌కు తానే దిక్కనే స్థాయికి ఎదిగారు.
Comments
Please login to add a commentAdd a comment