సాక్షి, తెలంగాణ డెస్క్: మరో 28 రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఫలితాలు నిరాశను మిగిల్చినా జాతీయ రాజకీయాలతో ముడిపడిన లోక్‌సభ ఎన్నికల్లోనైనా కాలం కలసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, చేవెళ్ల, నాగర్‌కర్నూల్ స్థానాల్లో విజయావకాశాలున్నాయని, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరిలో గట్టి పోటీ ఇస్తామని, మిగిలిన స్థానాల్లో శక్తి మేర పోరాడాల్సి ఉంటుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. ముఖ్యంగా ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాంధీ ఛరిష్మా, గెలుపు గుర్రాల ఎంపికకు తోడు స్థానిక నేతల సహకారం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుంది.
ఇందూరు బరిలో ఎవరు?
నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసిన మధుయాష్కీ ఈసారి భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీజేఎస్ అధినేత కోదండరాంకు మద్దతివ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. లేదంటే దళిత నేత, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాంకు అవకాశమివ్వనుంది. ఇద్దరిలో ఎవరు పోటీచేసినా మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో పాటు జువ్వాడి నర్సింగరావు, ఈరవత్రి అనిల్, తాహెర్‌బిన్, మహేశ్‌కుమార్‌గౌడ్, షబ్బీర్‌అలీల సహకారం అవసరమవుతుంది.
పెద్దపల్లి: ‘ఊట్ల’.. ‘కవ్వంపల్లి’
పెద్దపల్లి (ఎస్సీ) రిజర్వుడు స్థానం టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, ఊట్ల వరప్రసాద్ ఆశిస్తున్నారు. ఇక్కడ మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా రేసులోకి వచ్చారు. వీరి గెలుపోటములను ప్రభావితం చేసే నేతల్లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు తదితరులున్నారు. వీరితో పాటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని క్షేత్రస్థాయి నాయకత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తేనే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలున్నాయి.
కరీంనగర్: బరిలో ప్రభాకర్
కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ దాదాపు ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పొన్నంకు లోక్‌సభ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న గుర్తింపు అదనపు బలం. దీనికి తోడు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, ఆది శ్రీనివాస్, ఆరేపల్లి మోహన్, కె.కె.మహేందర్‌రెడ్డి, అల్గుబెల్లి ప్రవీణ్‌రెడ్డి లాంటి నేతల సహకారం అవసరం.
‘ఆదివాసీ’ సీటులో హస్తవాసి ఎవరిదో?
ఆదిలాబాద్ (ఎస్టీ) విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే, రమేశ్ రాథోడ్, సోయం బాపూరావు పార్టీ అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన నరేశ్‌జాదవ్‌తో పాటు సోయం బాపూరావు, ఆయన సతీమణి భారతీబాయి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.
వరంగల్: మందకృష్ణ.. మరో ఆరుగురు
వరంగల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆయనతో పాటు డాక్టర్ రాజమౌళి, ఇందిర, విజయకుమార్ మాదిగ, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ రాజయ్య, విజయకుమార్ మాదిగ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మందకృష్ణ కాకపోతే వీరిలో ఒకరిని అధిష్టానం ఎంపిక చేయనుంది. ఇక్కడ కొండా మురళి, సురేఖ దంపతులతో పాటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కొండేటి శ్రీధర్, దొంతిమాధవరెడ్డి, విజయరామారావు, ఇందిర తదితర నేతల సహకారం అవసరమవుతుంది.
లష్కర్ బరిలో అంజన్న
గతంలో గెలుపొందిన సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి భ™ఈసారి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్ పోటీలో ఉండబోతున్నారు. దాదాపు ఈయన పేరు ఖరారైనట్టేనని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలో డాక్టర్ దాసోజు శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, బండా కార్తీకరెడ్డి, బండా చంద్రారెడ్డి, ఎం.ఆర్.జీ. వినోద్‌రెడ్డితో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ స్థాయి నేతలు ప్రభావం చూపనున్నారు.
హైదరాబాద్: పోటీలో ఫిరోజ్!
ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అయితే, మొదటి నుంచీ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరు ప్రచారంలో ఉన్నా ఆయన స్థానంలో కొత్తగా నాంపల్లి నియోజకవర్గ నేత ఫిరోజ్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇక్కడి నుంచి దాదాపు ఫిరోజ్ పేరు ఖాయమేనని అంటున్నారు. ఈ స్థానం పరిధిలోని గోషామహల్ మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంఐఎం చేతిలోనే ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభావితం చేయగల నేతలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. పార్టీ సంస్థాగత బలం, అభ్యర్థి సామాజిక వర్గం, ఎంఐఎంపై ఉన్న వ్యతిరేకతే ఇక్కడ కాంగ్రెస్ బలాలుగా అంచనా వేయాల్సి ఉంటుంది.
జహీరాబాద్: అయితే ‘కలకుంట్ల’.. లేదంటే...
జహీరాబాద్ లోక్‌సభ నుంచి కలకుంట్ల మదన్‌మోహన్‌రావు (మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు)ను బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఆయన పార్టీలో చేరిన మొదటి రోజు నుంచే జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారంలో ఉండగా, మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక్కడ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, సురేశ్‌షెట్కార్, గంగారాం, అరుణతార లాంటి నేతలు ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్నవారు.
మెదక్: ‘గాలి’కే టికెట్!
మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్‌కుమార్ దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఈయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పార్టీలో చేరి పఠాన్‌చెరు టికెట్‌ను ఆశించారు. అయితే, సమీకరణాల దృష్ట్యా టికెట్ రాకపోవడంతో ఇప్పుడు మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రియల్టర్‌గా ఆయనకున్న సంబంధాలు, పార్టీ నేతల సహకారం విజయాన్ని అందిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ స్థానంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, నర్సారెడ్డి లాంటి నేతలు పార్టీ అభ్యర్థి గెలుపోటములపై ప్రభావం చూపించగలరు.
గట్టి పోటీ అంచనా
♦ మహబూబ్‌నగర్
♦ మల్కాజ్‌గిరి
నల్లగొండ: ఆ ఇద్దరు..
నల్లగొండ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పక్షాన ప్రభావితం చేయగల నేతల జాబితా పెద్దదే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు మాజీ మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్‌రెడ్డి తదితర నేతలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పక్షాన ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదంటే జానారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ, వెంకటరెడ్డి భువనగిరి వెళ్తారని, జానారెడ్డి పోటీకి ఆసక్తిగా లేరని అంటున్నారు. అదే జరిగితే పటేల్ రమేశ్‌రెడ్డి, ఉత్తమ్ సతీమణి పద్మావతిలలో ఒకరు బరిలో ఉండొచ్చు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతిరెడ్డి, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట నియోజకవర్గంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలు ఇక్కడ ఎవరు పోటీచేసినా వారికి ఓట్లు కురిపించగల కేడర్ ఉన్న నేతలుగా గుర్తింపు పొందారు.
భువనగిరి: కోటంత జాబితా
భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోనూ కాంగ్రెస్ బలంగానే ఉంది. ఇక్కడ మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆయనకు క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది. స్వతహాగా క్షేత్రస్థాయి నేతలను కూడా గుర్తుపట్టగలిగేంత స్థాయిలో ఆయనకు పలుకుబడి ఉంది. జనగామలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఇబ్రహీంపట్నం పరిధిలో మల్‌రెడ్డి రంగారెడ్డి, సుధీర్‌రెడ్డి లాంటి నేతలు ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలను మెరుగుపరచగలిగే సత్తా ఉన్న నాయకులు. అయితే, ఇక్కడి నుంచి ఈసారి బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మధుయాష్కీగౌడ్, వంగాల స్వామిగౌడ్, కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.అనూహ్యంగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఖమ్మం.. గుమ్మంలో నలుగురు!
గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలనిచ్చిన ఖమ్మం లోక్‌సభను కైవసం చేసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్త గాయత్రి రవితో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి సు ధాకర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి కూడా తనకే అవకాశం ఇవ్వాల ని పట్టుపడుతున్నారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీలో చేరితే టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అయితే, ఇక్కడ ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో కాంగ్రెస్‌కు నాయకత్వ లోపం ఉంది. పొత్తుల్లో భాగంగా ఈ మూడు స్థానాలను తెలుగుదేశానికి కేటాయించడంతో ఇక్కడ ఓట్లు రాల్చే నేతలు ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, వైరాలోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న రాములు నాయక్ స్వతంత్రంగా గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలిన మధిరతో పాటు వైరా స్థానాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పట్టుంది. ఖమ్మంలో కూడా కొందరు అనుచరులున్నారు. పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు బలమైన నాయకులు. సంభానికి సత్తుపల్లిలోనూ కేడర్ ఉంది.
నాగర్‌కర్నూల్: ‘చేతి’నిండా పోటీదారులే
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక లోక్‌సభ స్థానం నాగర్‌కర్నూల్. ఇక్కడి నుంచి 2014 ఎన్నికల్లో నంది ఎల్లయ్య గెలుపొందారు. మళ్లీ పోటీకి అవకాశమివ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే, వయోభారం కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెడతారనే ప్రచారం ఉంది. ఆయన కాకుంటే ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, ఇటీవల తుంగతుర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్, మాజీ మంత్రి డి.కె.అరుణ మద్దతిస్తోన్న సతీశ్‌మాదిగ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక్కడ కూడా మాజీ మంత్రి డి.కె.అరుణ కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలకపాత్ర పోషించనున్నారు. చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి తదితర నేతల ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై ఉండనుంది.
‘మానుకోట’ రహస్యం
మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ (ఎస్టీ) లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ కేడర్‌ను సమన్వయం చేసుకునే నేతలను వెతకాల్సి ఉంది. ములుగులో సీతక్క, భద్రాచలంలో పొడెం వీరయ్య, మహబూబాబాద్‌లో బలరాం నాయక్, నర్సంపేటలో దొంతిమాధవరెడ్డి ఇక్కడి నుంచి పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులను భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బలరాం నాయక్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉత్సాహం చూపిస్తున్నారు.
చేవెళ్ల: ‘కొండా’ ఖరారు!
చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారయినట్టే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు శేరిలింగంపల్లి నుంచి భిక్షపతియాదవ్, తాండూరులో పైలట్ రోహిత్‌రెడ్డి, నరేశ్, పరిగిలో రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్‌లో మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్, ఎ.చంద్రశేఖర్ లాంటి నేతలు అండగా నిలవాల్సి ఉంటుంది. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో మహేశ్వరం, రాజేంద్రనగర్ స్థానాల్లో ఆయన స్వంత బలం, కొద్దోగొప్పో మిగిలిన కాంగ్రెస్ కేడర్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది.
మల్కాజ్‌గిరి: రేసులో నలు‘గురి’..
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో కూడిన మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలో ఎవరైనా ఒకరు పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఆకుల రాజేందర్, కూనశ్రీశైలంగౌడ్, బండారి రాజిరెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, క్రిశాంక్‌తో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ స్థాయి నేతలు కీలక పాత్ర పోషించనున్నారు.
‘పాలమూరు’లో పోటీపై ఉత్కంఠ
మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి డి.కె.అరుణతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మల్లు రవి, సి.ప్రతాపరెడ్డి, శివకుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, షరాబు కృష్ణ, ఒబేదుల్లా కొత్వాల్ లాంటి నేతలు ఇక్కడ ఓట్లు రాల్చగలిగే సామర్థ్యం ఉన్నవారు. ముఖ్యంగా డీకే అరుణ సొంత నియోజకవర్గం నాగర్‌కర్నూల్ పార్లమెంటు పరిధిలోకి వచ్చినప్పటికీ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం వ్యాప్తంగానూ ఆమెకు భారీ అనుచరగణం ఉంది. లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థి.. అరుణ, జైపాల్ ఆశీస్సులుంటేనే బయటపడే అవకాశాలుంటాయి. ఇక్కడి నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జైపాల్‌రెడ్డి బరిలో ఉంటారని భావించినా ఆయన పెద్దగా ఆసక్తితో లేనట్టు తెలుస్తోంది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంటే డి.కె.అరుణ కూడా బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment