ఢిల్లీ: నేడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. దీంతో స్క్రీనింగ్ కమిటీలో సభ్యులతో ఛైర్మన్ మురళీధరన్ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నారు.
తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోసారి జరగనుంది. అటు.. అభ్యర్థులు ఎంపిక సాగదీతతో ప్రచారంలో వెనుకబడి పోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రియాంక, రాహుల్ బస్సు యాత్రల తర్వాతనే లిస్ట్ విడుదల చేస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్రకు ముందే లిస్ట్ విడుదల చేస్తే పంచాయతీలు జరిగే అవకాశం ఉందని అధిష్టానం భయపడుతోంది.
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. 70 సీట‍్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై నేడు సమావేశమైంది. కానీ ఎటూ తేలకపోవడంతో మరోసారి సమావేశం కానుంది. ఎంపిక చేయాల్సిన దాదాపు 30 సీట్లలో ఒక్కో స్థానంలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడటంతో అభ్యర్థుల ఎంపిక కమిటీకి తలనొప్పిగా తయారైంది.
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తాం. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుంది. బిసిలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చింది. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను మేము పరిశీలించాం. అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నాం. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే’ అని తెలిపారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. ఆ 30 సీట్లలో తీవ్ర పోటీ
‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి
Comments
Please login to add a commentAdd a comment