సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క
దీనిపై అధ్యయనం చేసే బాధ్యత మంత్రి శ్రీధర్‌బాబుకు...
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చ
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) హామీని లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో లక్షలాది మందికి ఉపాధిని కలి్పంచే ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ అయ్యింది.
ఈనెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న జనజాతర సభ, కేంద్ర ఎన్నికల మేనిపెస్టోకు అనుబంధంగా రాష్ట్ర అంశాల చేర్పు, 100 రోజుల కాంగ్రెస్ పాలనపై చర్చించారు. ఈ సందర్భంగా ఐటీఐఆర్ ప్రస్తావనకు రాగా, ఈ హామీని చేర్చే అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం రేవంత్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఈనెల 5న జాతీయస్థాయిలో ఏఐసీసీ విడుదల చేస్తుందని, ఈ మేనిఫెస్టోలోని అంశాలతోపాటు రాష్ట్ర ప్రజలకు అవసరమయ్యే అంశాలను కూడా రాష్ట్రస్థాయి మేనిఫెస్టోలో చేర్చాలని, ఈ అంశంపై పార్టీ నేతలు అధ్యయనం చేయాలని కోరారు.
అయితే, పారీ్టకి వ్యతిరేకంగా బయట మాట్లాడొద్దని, మీడియాతో మాట్లాడేవారిపై కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ నేతలను హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్, మంత్రు లు శ్రీధర్‌బాబు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, కె.జానారెడ్డి, ఎం.కోదండరెడ్డి, షబ్బీర్‌అలీ, జెట్టి కుసుమకుమార్, రేణుకాచౌదరి, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లురవి, వంశీచంద్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ‘కేటీఆర్..మీరు బాగా చదువుకున్నారు. మంత్రిగా పనిచేశారు. పద్ధతిగా మాట్లాడాలి కదా. వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడటం ఏం భాష? భాష, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.’అని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment