సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్ నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పతనానికి, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. యూపీఏ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా రుణాలు జారీచేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ రూపురేఖలను మార్చారని చెప్పుకొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీరునూ ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ జోక్యంతో బ్యాంకింగ్ వ్యవస్థ అప్పట్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే నీరవ్ మోదీ కుంభకోణం వంటి బ్యాంకింగ్ స్కామ్‌లు చోటుచేసుకున్నాయన్నారు. యూపీఏ చేపట్టిన బంగారు దిగుమతుల పథకం లోపభూయిష్టంగా తయారై గీతాంజలి సహా ఏడు ప్రయివేటు జ్యూవెలరీ కంపెనీలకు మేలు చేసిందని అప్పటి ఆర్థిక మంత్రి పీ . చిదంబరం తీరును ఆక్షేపించారు. బ్యాంకు రికార్డుల్లో సరైన సమాచారం నిక్షిప్తం చేసేందుకు యూపీఏ అనుమతించలేదని ఆరోపించారు.
యూపీఏ హయాంలో రుణాలు పెద్ద ఎత్తున జారీ చేసినా వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదని అన్నారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన 80:20 స్కీమ్‌లో లాభపడిందెవరో కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గీతాంజలి ఇతర కంపెనీల తరపున లాబీయింగ్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని మంత్రి కోరారు. రాహుల్ ఇటలీ నుంచి తిరిగివచ్చాక తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment