banking scandals
-
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన విధానాల్ని అవలంబిస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన తప్పుపట్టారు. సమాజాన్ని విడగొట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ఆయన వాడుతున్న భాష ప్రధాని స్థాయి వ్యక్తి వాడదగింది కాదని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం బెంగళూరుకు వచ్చిన ఆయన కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకింగ్ మోసాలు నాలుగురెట్లు ‘ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ యూపీఏ హయాంలో భారత వృద్ధి రేటు 7.8 శాతంగా కొనసాగింది. ప్రస్తుత ప్రధాని మోదీ పాలనలో దేశాభివృద్ధి 14 ఏళ్లు వెనక్కి వెళ్లింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మోదీ అనాలోచిత నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు’ అని మన్మోహన్ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 67 శాతం తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారని, మోదీ హయాంలో ఎక్సైజ్ పన్నులను మితిమీరి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో బ్యాంకింగ్ మోసాలు నాలుగురెట్లు పెరిగాయని, పెద్దనోట్ల రద్దుతో పాటు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ లోపం వల్ల బ్యాంకింగ్ రంగంపై ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నగదు కొరత విపరీతంగా వేధిస్తోందని, మంచివని ప్రచారం చేస్తూ మోదీ ప్రవేశపెడుతున్న విధానాలు చివరకు నష్టాల్ని మిగులుస్తున్నాయని ఎద్దేవా చేశారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పరారీపై మాట్లాడుతూ.. 2015, 2016 సంవత్సరాల్లో ఏదో తప్పు జరుగుతుందన్న సంకేతాలు వెలువడినప్పటికీ మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తీవ్ర సంక్షోభంలో రైతన్న ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది’ అని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీయే హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు శూన్యమని, వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోందని తప్పుపట్టారు. ‘వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 21 శాతం తగ్గిపోయాయి. మోదీ మాత్రం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు, వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేస్తారు’ అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో పెట్టుబడులు 34–35 శాతం పెరిగాయని, మోదీ హయాంలో ఆ రంగం పూర్తిగా దెబ్బతిందని మన్మోహన్ విమర్శించారు. ‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో తిరోగమనంలో పయనిస్తోంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో మోదీ హామీనిచ్చారు. అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతింది’ అని మన్మోహన్ మండిపడ్డారు. -
ప్రైవేటు బ్యాంకుల్లోనే స్కామ్‌లు ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ 11,400 కోట్ల రూపాయలకు ముంచారని వార్తలు వెలువడినప్పుడు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం మంచిదని సూచనలు వచ్చాయి. అదే ఉత్తమమంటూ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్‌తోపాటు భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్ఐసీసీఐ), భారత వాణిజ్య అనుబంధ మండళ్లు (ఏసీసీఐ) వంతపాడాయి. ఆ తర్వాత నెల రోజులకు ప్రైవేటురంగంలోని ఐసీసీఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంకుల్లో కూడా ఆర్థిక కుంభకోణాలు జరిగిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతైనా ప్రైవేటు బ్యాంకుల్లో స్కామ్‌లు తక్కువేలే అంటున్నవాళ్లు ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ స్కాములు జరుగుతున్నాయా, ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువ స్కామ్‌లు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని కచ్చితంగా తేల్చుకునేందుకు లెక్కలు ప్రజలకు అందుబాటులో లేవు. రుణాలు చెల్లించే స్థోమత ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా రుణాలు చెల్లించని వారిని ‘విల్‌ఫుల్ డీఫాల్టర్లు’గా వ్యవహరిస్తారు. వీరి నుంచి తీసుకున్న రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు లీగల్ కేసులు దాఖలు చేస్తాయి. ఆ కేసుల వివరాలను బ్యాంకులు ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్’కు అందజేస్తాయి. అలా ఓ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ వద్ద గత పదేళ్ల డేటాను సేకరించగా, డీఫాల్టర్లపై కేసులు దాఖలు చేసిన ప్రవైటు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులకన్నా ఎక్కువున్నాయి. ఈ కేసుల ద్వారా మనకు రెండు విషయాలు మన దృష్టికి వస్తాయి. అందులో ఒకటే నిజం కావొచ్చు, మరోటి తప్పుకావచ్చు. లేదంటే రెండింట్లోనూ కొంత, కొంత వాస్తవం ఉండొచ్చు. డీఫాల్టర్ల నుంచి రుణాలను రాబట్టడడం కోసం ప్రైవేటు బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించి కేసులు పెట్టి ఉండవచ్చు. లేదా నిజంగానే రుణాలు ఎగ్గొట్టిన వారు ప్రభుత్వ బ్యాంకులకన్నా ఎక్కువే ఉండొచ్చు. కొంత అటూ ఇటుగాను ఉండొచ్చు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు బ్యాంకుల పరిస్థితి ఆరోగ్యంగా ఉందా, లేదా అన్న అంశాన్ని చెడ్డ రుణాలు లేదా నిరర్థక ఆస్తులను బట్టి అంచనా వేస్తారు. రుణాలు తీసుకున్నవారు కనీసం 90 రోజుల పాటు వడ్డీ లేదా అసలు చెల్లించకపోతే వాటిని నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తారు. బ్యాంకులకు వచ్చే లాభాల్లో ఇలాంటి నిరర్థక ఆస్తులు ఎంత తక్కువగా ఉంటే బ్యాంకుల పరిస్థితి అంత బాగా ఉన్నట్లు లెక్క. ఈ నిరర్థక ఆస్తులు గత కొన్నేళ్ల క్రితం వరకు తక్కువగా ఉండేది. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. 2006 నుంచి 2011 సంవత్సరం మధ్యన భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు లక్ష కోట్ల రూపాయలు ఉండగా, అవి 2017, డిసెంబర్ నెల నాటికి 8.85 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. నిరర్థక ఆస్తులన్నింటికీ ఉద్దేశపూర్వకంగా చెల్లించని డీఫాల్టర్లుగా పరిగణించలేం. పరిశ్రమల కోసం, ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్న వారికి లాభాలు రాకపోవడం వల్ల వారు రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. ఉద్దేశపూర్వక డీఫాల్టర్లు ఎంత మంది ఉన్నారో, వారు తీసుకున్న మొత్తం ఎంతో ప్రతి బ్యాంకు ప్రతి ఏటా భారతీయ రిజర్వ్ బ్యాంకుకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. సామాన్యంగా ఈ సమాచారాన్ని ఆర్బీఐ బహిర్గతం చేయదు. కానీ పంజాబ్ జాతీయ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులకు చెందిన డీఫాల్టర్ల వివరాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. విల్‌ఫుల్ డీఫాల్టర్లు డిసెంబర్, 2017 నాటికి ఎగ్గొట్టిన మొత్తం 1,10,050 కోట్ల రూపాయలు. మొత్తం బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో ఈ మొత్తం ఏడు శాతం మాత్రమే. ప్రైవేటు బ్యాంకుల డీఫాల్టర్ల వివరాలను సమాచార హక్కు కింద కూడా వెల్లడించడానికి వీల్లేదు. అయితే డీఫాల్టర్ల వివరాలను, వారి నుంచి వాటిని వసూలు చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు అందజేయాలి. వాటిని ఆ బ్యాంకు బహిర్గతం చేయదు. అయితే ఈ వివరాలను బ్యాంకులు క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు అందజేస్తాయి. అలా సీఐబీఎల్ సంస్థ నుంచి కోటి, ఆపైన రుణాలు తీసుకున్న మొత్తం డీఫాల్టర్లపై 40 బ్యాంకులు దాఖలు చేసిన కేసుల వివరాలను, 25 లక్షలు, ఆపైనా రుణాలు తీసుకుని కేసులు దాఖలైన వారి వివరాలను సేకరించి అధ్యయనం చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. 25లక్షలపైన తీసుకొని ఎగ్గొట్టిన వారి రుణాల మొత్తం ప్రైవేటు బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 14.2 శాతం ఉండగా, ఆ మొత్తం ప్రభుత్వ బ్యాంకుల్లో 12.3 శాతం మాత్రమే ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో కోటికి పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన రుణాల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 42. 9 శాతం కాగా, ప్రభుత్వ బ్యాంకుల్లో వారు ఎగ్గొట్టిన మొత్తం 33.1 శాతంగా ఉంది. రుణాల వసూళ్లకు ఎక్కువ విలువైన కేసులను దాఖలు చేసిన ప్రైవేటు బ్యాంకుల్లో ‘కోటక్ మహీంద్ర బ్యాంక్’ మొదటి స్థానంలో ఉండగా, ధనలక్ష్మీ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో విజయ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఈ వివరాలను బట్టి కూడా ప్రైవేటు బ్యాంకుల్లో డీఫాల్టర్లు ఎగ్గొట్టిందీ ఎక్కువా లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో ఎగ్గొట్టిందీ ఎక్కువ ? అన్న విషయం స్పష్టం కాదు. నిరర్థక ఆస్తుల మొత్తం ఎంతో తెలిస్తేగానీ ఆ విషయం తెలీదు. ఎప్పటికప్పుడు బ్యాంకు రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తారు కనుక నిరర్థక ఆస్తులు మాఫీ అవుతూ వస్తుంటాయి. ప్రైవేటు బ్యాంకులు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు రుణాలు ఎక్కువగా ఇస్తాయి. లాభం వస్తుందో, లేదో తెలియని మౌలిక సౌకర్యాల రంగానికి ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఎక్కువగా ఇస్తుంటాయి. ఈ లెక్కన అందుబాటులో ఉన్న అంకెల ప్రకారం ప్రైవేటు బ్యాంకుల్లోనే స్కాములు ఎక్కువగా ఉన్నట్లు లెక్క. -
బ్యాంకింగ్ కుంభకోణాలపై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ కుంభకోణాలపై వివరణ ఇచ్చేందుకు మే 17న తమ ముందు హాజరు కావాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌ను పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో సుమారు రూ.13 వేల కోట్ల స్కాంతోపాటు గత కొన్ని నెలలుగా పలు ఇతర బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగుచూడడం తెల్సిందే. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేత మొయిలీ నేతృత్వంలోని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ ఎంపీ నిశికాంత్‌తో సహా పలువురు సభ్యులు ఆర్బీఐ రుణాల ఎగవేతను నియంత్రించ లేకపోయిందని అభిప్రాయపడినట్టు తెలిసింది. బ్యాంకులకు సంబంధించిన పలు అంశాలపై 3 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అధికారులను కమిటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్‌ను హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. -
ఆ మోసాలను ఆధార్‌తో అడ్డుకోలేం!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక నేరాలు, ఉగ్ర కార్యకలాపాల కట్టడికి ఆధార్ దోహదపడుతుందన్న కేంద్రం వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది. బ్యాంకింగ్ మోసాలకు ఆధార్‌తో పరిష్కారం లభించదంది. ఆధార్ చట్టబద్ధత, చెల్లుబాటుపై గురువారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, ప్రభుత్వ తరఫు లాయర్ల మధ్య ఆసక్తికర వాదనలు జరిగాయి. ‘బ్యాంకులను మోసగిస్తున్న వారెవరో అంతా బహిరంగంగానే తెలిసిపోతోంది. ఎవరెవరికి రుణాలు మంజూరు అవుతున్నాయో బ్యాంకులకు తెలియదా? అధికారులే మోసగాళ్లతో చేతులు కలిపి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు ఆధార్ పరిష్కారం చూపదు’ అని బెంచ్ పేర్కొంది. లబ్ధిదారుల గుర్తింపునకే ప్రయోజనకరం సంక్షేమ పథకాల అసలు లబ్ధిదారులను గుర్తించడంలో మాత్రమే ఆధార్ ప్రభుత్వానికి సహాయపడుతుందని బెంచ్ పేర్కొంది. మొబైల్ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు, బాంబు దాడులను నివారించొచ్చని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. దీనికి ప్రతిగా బెంచ్ స్పందిస్తూ.. ‘ఉగ్రవాదులు సిమ్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటారా? కొంత మంది ఉగ్రవాదులను పట్టుకోవడానికి 120 కోట్ల మంది భారతీయులు మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసందానం చేసుకోవాలని అడుగుతున్నారు. కేవలం చట్టబద్ధ జాతీయ ప్రయోజనాల రీత్యా అలా కోరడం సబబేనా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల బతుకులు బాగుచేయడంలో ఆధార్ దోహద పడుతుందని వేణుగోపాల్ పేర్కొనగా.. ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోందని, 67% సంపద ఒక శాతం ధనికుల వద్దే పోగైందని బెంచ్ పేర్కొంది. ప్రతిదానికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడం వల్లే అనవసర సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. -
కొద్దిసేపు చర్చ.. ఆపై రసాభాస
న్యూఢిల్లీ: గత మూడు రోజులకు భిన్నంగా పార్లమెంటు ఉభయ సభల్లో గురువారం కొద్ది సేపు ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఏకతాటిపై నిలిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై సభ్యులు తమ వాణి వినిపించారు. లైంగిక దాడుల పట్ల ప్రతిపక్షం ఆందోళన రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే.. మహిళల అంశాలపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు.. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా ఆమోదం పొందేలా చూడాలని కోరారు. చర్చను చైర్మన్ వెంకయ్య ప్రారంభిస్తూ.. ‘ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు.. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో రిజర్వేషన్లతో పాటు దేశం వేగంగా పురోగమించేందుకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది’ అని అన్నారు. అనంతరం వివిధ పార్టీల మహిళా ఎంపీలు ప్రసంగించారు. ప్రధాని సమాధానానికి కాంగ్రెస్ పట్టు అనంతరం చర్చ పూర్తి కాగానే విపక్షాలు నిరసన కొనసాగించాయి. బ్యాంకింగ్ కుంభకోణాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభను హోరెత్తించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్షాల తీరుపై వెంకయ్య∙అసహనం వ్యక్తం చేస్తూ.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు. అనంతరం సమావేశమయ్యాక బ్యాంకింగ్ కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోరుతూ కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలతో పాటు ఇతర అంశాలపై ప్రాంతీయ పార్టీలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారానికి వాయిదా వేశారు. రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే స్పీకర్ మహాజన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ..రెట్టించిన శక్తి, ఆత్మ విశ్వాసంతో మహిళలు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారత ఎంతో అవసరమని... అయితే దాన్ని సాధించడమే అతి పెద్ద సవాలన్నారు. స్పీకర్ ప్రసంగం ముగియగానే.. విపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన కొనసాగించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీ ఎంపీల ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం సభ మళ్లీ సమావేశమైనా.. అదే పరిస్థితి ఉండడంతో శుక్రవారానికి వాయిదా పడింది. -
చోటా మోదీ ఎక్కడ?
న్యూఢిల్లీ: వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్ కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం విపక్షాలు పట్టుబట్టడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదాపడ్డాయి. పీఎన్బీ, ఇతర బ్యాంకు స్కాంలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా... చోటా మోదీ (నీరవ్ మోదీ) ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. ప్రాంతీయ పార్టీలు కూడా తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగించ డంతో ఉభయసభలు నిరసనలతో హోరెత్తాయి. తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్ఎస్, మరాఠీకి ప్రాచీన హోదా కోసం ఎన్డీఏ మిత్రపక్షం శివసేన, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకేలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశాయి. లోక్‌సభలో రెండో రోజూ అదే తీరు.. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే నినాదాలు చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశమయ్యాక కూడా అదే పరిస్థితి కొనసాగింది. ‘చోటా మోదీ (నీరవ్ మోదీ) ఎక్కడికి పారిపోయారు.. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. నీరవ్‌ను భారత్‌కు తీసుకురండి’ అంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక అవకతవకలపై చర్చకు కేంద్రం సిద్ధమని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తారని చెప్పారు. అయినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ మూడుసార్లు వాయిదా.. బ్యాంకు కుంభకోణాలు, ఇతర ప్రాంతీయ అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల ఆందోళనలతో రాజ్యసభలో రెండో రోజు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు సిద్ధమని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్లు చెప్పినా గందరగోళం సద్దుమణగలేదు. దీంతో మూడు సార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో సభ బుధవారానికి వాయిదా పడింది. త్రిపురలో సైద్ధాంతిక విజయం: మోదీ త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వంపై బీజేపీ భారీ గెలుపును సైద్ధాంతిక విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇరవై ఐదేళ్లపాటు కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటం పార్టీ ఆలోచననే మార్చివేసిందని వ్యాఖ్యానించారు. ఇదే ఊపును రాబోయే నెలల్లోనూ కొనసాగించేందుకు కష్టపడి పనిచేయాలని పార్టీ నేతలను కోరారు. మంగళవారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ‘మన విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పుడు కర్ణాటక వంతు అంటూ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు’ అని మంత్రి అనంత్‌కుమార్ మీడియాకు చెప్పారు. మరోవైపు, జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్) ‘ఆయుష్మాన్ భారత్’ అమలు దిశగా సాగుతున్న ఏర్పాట్లపై ప్రధాని మోదీ సమీక్షించారు. -
‘యూపీఏ హయాంలోనే బ్యాంకుల పతనం’
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పతనానికి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. యూపీఏ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా రుణాలు జారీచేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ రూపురేఖలను మార్చారని చెప్పుకొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీరునూ ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ జోక్యంతో బ్యాంకింగ్ వ్యవస్థ అప్పట్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే నీరవ్ మోదీ కుంభకోణం వంటి బ్యాంకింగ్ స్కామ్‌లు చోటుచేసుకున్నాయన్నారు. యూపీఏ చేపట్టిన బంగారు దిగుమతుల పథకం లోపభూయిష్టంగా తయారై గీతాంజలి సహా ఏడు ప్రయివేటు జ్యూవెలరీ కంపెనీలకు మేలు చేసిందని అప్పటి ఆర్థిక మంత్రి పీ . చిదంబరం తీరును ఆక్షేపించారు. బ్యాంకు రికార్డుల్లో సరైన సమాచారం నిక్షిప్తం చేసేందుకు యూపీఏ అనుమతించలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో రుణాలు పెద్ద ఎత్తున జారీ చేసినా వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదని అన్నారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన 80:20 స్కీమ్‌లో లాభపడిందెవరో కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గీతాంజలి ఇతర కంపెనీల తరపున లాబీయింగ్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని మంత్రి కోరారు. రాహుల్ ఇటలీ నుంచి తిరిగివచ్చాక తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. -
‘బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రం’
సాక్షి, న్యూఢిల్లీ : భారీ కుంభకోణాలు వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్‌ను కోరింది. గత ఐదేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో రూ 61,000 కోట్ల విలువైన స్కామ్‌లు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ పేర్కొంది. బ్యాంకులను మోసం చేస్తున్న వారికి బీజేపీ సర్కార్ అండదండలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. బిలియనీర్ జ్యూవెలరీ నీరవ్ మోదీ పీఎన్బీని రూ 17,000 కోట్లకు ముంచిన కుంభకోణం వెలుగుచూడగా, తాజాగా రొటోమాక్ అధినేత విక్రమ్ కొఠారీ భారత బ్యాంకులకు రూ 800 కోట్లు ఎగవేసిన మరో స్కాం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందన్నారు. బ్యాంకులను మోసం చేసిన అక్రమార్కులు, ఎన్పీఏలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రచురించి, వారి పేర్లను వెల్లడించాల్సిందిగా అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తివారీ డిమాండ్ చేశారు. -
బ్యాంకింగ్ మోసాల కట్టడి!
♦ తాజా విధానానికి ఆర్బీఐ కసరత్తు ♦ డిప్యూటీ గవర్నర్ ముంద్రా వెల్లడి ముంబై: బ్యాంకింగ్ మోసాల్ని కట్టడి చేయటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. మోసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీటిని నిరోధించడంలో అటు బ్యాంకింగ్ వ్యవస్థ, ఇటు కస్టమర్ పోషించాల్సిన పాత్ర... వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా చెప్పారు. అటు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతుండటంతో ఆర్బీఐ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎలక్ట్రానిక్ లావాదేవీల విషయంలో కస్టమర్ల విశ్వాసాన్ని పెంచాలని కూడా ఆర్బీఐ భావిస్తున్నట్లు ముంద్రా తెలియజేశారు. ఆయా అంశాల్లో పురోగతికోసం త్వరలో ఒక విధానం తేనున్నట్లు బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముంద్రా తెలిపారు. మోసాలు జరగకుండా చూడటం, జరిగిన పక్షంలో కస్టమర్‌కు తగిన న్యాయం చేయటం వంటి చర్యలు ఈ విధానంలో ఉంటాయని చెప్పారాయన. ఆన్లైన్ లావాదేవీలు ఒకపక్క పెరుగుతుండగా.. మరోపక్క అనధికార నిధుల బదలాయింపు, ఏటీఎంల నుంచి మోసపూరిత లావాదేవీలు, తప్పుదారి పట్టించే ఈ-మెయిల్స్ వంటివి కూడా పెరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారాయన. ‘‘ఈ సవాళ్లను అధిగమించడానికి సమర్థమైన యంత్రాంగం కావాలి. మొబైల్ నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపుల్లో మోసాలకు చోటులేని వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే టెక్నాలజీపై కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది. మోసాలపై కస్టమర్లలో చైతన్యం తేవటం కూడా ముఖ్యమే. ఈ చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠతకు కూడా ఉపకరిస్తాయి’’ అని ముంద్రా వివరించారు.