బ్యాంకింగ్ మోసాల కట్టడి!
♦ తాజా విధానానికి ఆర్‌బీఐ కసరత్తు
♦ డిప్యూటీ గవర్నర్ ముంద్రా వెల్లడి
ముంబై: బ్యాంకింగ్ మోసాల్ని కట్టడి చేయటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి సారించింది. మోసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీటిని నిరోధించడంలో అటు బ్యాంకింగ్ వ్యవస్థ, ఇటు కస్టమర్ పోషించాల్సిన పాత్ర... వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా చెప్పారు. అటు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతుండటంతో ఆర్‌బీఐ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎలక్ట్రానిక్ లావాదేవీల విషయంలో కస్టమర్ల విశ్వాసాన్ని పెంచాలని కూడా ఆర్‌బీఐ భావిస్తున్నట్లు ముంద్రా తెలియజేశారు.
ఆయా అంశాల్లో పురోగతికోసం త్వరలో ఒక విధానం తేనున్నట్లు బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముంద్రా తెలిపారు. మోసాలు జరగకుండా చూడటం, జరిగిన పక్షంలో కస్టమర్‌కు తగిన న్యాయం చేయటం వంటి చర్యలు ఈ విధానంలో ఉంటాయని చెప్పారాయన. ఆన్‌లైన్ లావాదేవీలు ఒకపక్క పెరుగుతుండగా.. మరోపక్క అనధికార నిధుల బదలాయింపు, ఏటీఎంల నుంచి మోసపూరిత లావాదేవీలు, తప్పుదారి పట్టించే ఈ-మెయిల్స్ వంటివి కూడా పెరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారాయన.
‘‘ఈ సవాళ్లను అధిగమించడానికి సమర్థమైన యంత్రాంగం కావాలి. మొబైల్ నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపుల్లో మోసాలకు చోటులేని వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే టెక్నాలజీపై కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది. మోసాలపై కస్టమర్లలో చైతన్యం తేవటం కూడా ముఖ్యమే. ఈ చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠతకు కూడా ఉపకరిస్తాయి’’ అని ముంద్రా వివరించారు.