సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ 11,400 కోట్ల రూపాయలకు ముంచారని వార్తలు వెలువడినప్పుడు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం మంచిదని సూచనలు వచ్చాయి. అదే ఉత్తమమంటూ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్‌తోపాటు భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌ఐసీసీఐ), భారత వాణిజ్య అనుబంధ మండళ్లు (ఏసీసీఐ) వంతపాడాయి. ఆ తర్వాత నెల రోజులకు ప్రైవేటురంగంలోని ఐసీసీఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంకుల్లో కూడా ఆర్థిక కుంభకోణాలు జరిగిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతైనా ప్రైవేటు బ్యాంకుల్లో స్కామ్‌లు తక్కువేలే అంటున్నవాళ్లు ఉన్నారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ స్కాములు జరుగుతున్నాయా, ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువ స్కామ్‌లు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని కచ్చితంగా తేల్చుకునేందుకు లెక్కలు ప్రజలకు అందుబాటులో లేవు. రుణాలు చెల్లించే స్థోమత ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా రుణాలు చెల్లించని వారిని ‘విల్‌ఫుల్ డీఫాల్టర్లు’గా వ్యవహరిస్తారు. వీరి నుంచి తీసుకున్న రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు లీగల్ కేసులు దాఖలు చేస్తాయి. ఆ కేసుల వివరాలను బ్యాంకులు ‘క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీస్’కు అందజేస్తాయి. అలా ఓ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీ వద్ద గత పదేళ్ల డేటాను సేకరించగా, డీఫాల్టర్లపై కేసులు దాఖలు చేసిన ప్రవైటు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులకన్నా ఎక్కువున్నాయి. ఈ కేసుల ద్వారా మనకు రెండు విషయాలు మన దృష్టికి వస్తాయి. అందులో ఒకటే నిజం కావొచ్చు, మరోటి తప్పుకావచ్చు. లేదంటే రెండింట్లోనూ కొంత, కొంత వాస్తవం ఉండొచ్చు. డీఫాల్టర్ల నుంచి రుణాలను రాబట్టడడం కోసం ప్రైవేటు బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించి కేసులు పెట్టి ఉండవచ్చు. లేదా నిజంగానే రుణాలు ఎగ్గొట్టిన వారు ప్రభుత్వ బ్యాంకులకన్నా ఎక్కువే ఉండొచ్చు. కొంత అటూ ఇటుగాను ఉండొచ్చు.
బ్యాంకుల నిరర్థక ఆస్తులు
బ్యాంకుల పరిస్థితి ఆరోగ్యంగా ఉందా, లేదా అన్న అంశాన్ని చెడ్డ రుణాలు లేదా నిరర్థక ఆస్తులను బట్టి అంచనా వేస్తారు. రుణాలు తీసుకున్నవారు కనీసం 90 రోజుల పాటు వడ్డీ లేదా అసలు చెల్లించకపోతే వాటిని నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తారు. బ్యాంకులకు వచ్చే లాభాల్లో ఇలాంటి నిరర్థక ఆస్తులు ఎంత తక్కువగా ఉంటే బ్యాంకుల పరిస్థితి అంత బాగా ఉన్నట్లు లెక్క. ఈ నిరర్థక ఆస్తులు గత కొన్నేళ్ల క్రితం వరకు తక్కువగా ఉండేది. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. 2006 నుంచి 2011 సంవత్సరం మధ్యన భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు లక్ష కోట్ల రూపాయలు ఉండగా, అవి 2017, డిసెంబర్ నెల నాటికి 8.85 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. నిరర్థక ఆస్తులన్నింటికీ ఉద్దేశపూర్వకంగా చెల్లించని డీఫాల్టర్లుగా పరిగణించలేం. పరిశ్రమల కోసం, ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్న వారికి లాభాలు రాకపోవడం వల్ల వారు రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉండవచ్చు.
ఉద్దేశపూర్వక డీఫాల్టర్లు ఎంత మంది ఉన్నారో, వారు తీసుకున్న మొత్తం ఎంతో ప్రతి బ్యాంకు ప్రతి ఏటా భారతీయ రిజర్వ్ బ్యాంకుకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. సామాన్యంగా ఈ సమాచారాన్ని ఆర్బీఐ బహిర్గతం చేయదు. కానీ పంజాబ్ జాతీయ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులకు చెందిన డీఫాల్టర్ల వివరాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. విల్‌ఫుల్ డీఫాల్టర్లు డిసెంబర్, 2017 నాటికి ఎగ్గొట్టిన మొత్తం 1,10,050 కోట్ల రూపాయలు. మొత్తం బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో ఈ మొత్తం ఏడు శాతం మాత్రమే. ప్రైవేటు బ్యాంకుల డీఫాల్టర్ల వివరాలను సమాచార హక్కు కింద కూడా వెల్లడించడానికి వీల్లేదు. అయితే డీఫాల్టర్ల వివరాలను, వారి నుంచి వాటిని వసూలు చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు అందజేయాలి. వాటిని ఆ బ్యాంకు బహిర్గతం చేయదు. అయితే ఈ వివరాలను బ్యాంకులు క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు అందజేస్తాయి. అలా సీఐబీఎల్ సంస్థ నుంచి కోటి, ఆపైన రుణాలు తీసుకున్న మొత్తం డీఫాల్టర్లపై 40 బ్యాంకులు దాఖలు చేసిన కేసుల వివరాలను, 25 లక్షలు, ఆపైనా రుణాలు తీసుకుని కేసులు దాఖలైన వారి వివరాలను సేకరించి అధ్యయనం చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.
25లక్షలపైన తీసుకొని ఎగ్గొట్టిన వారి రుణాల మొత్తం ప్రైవేటు బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 14.2 శాతం ఉండగా, ఆ మొత్తం ప్రభుత్వ బ్యాంకుల్లో 12.3 శాతం మాత్రమే ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో కోటికి పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన రుణాల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 42. 9 శాతం కాగా, ప్రభుత్వ బ్యాంకుల్లో వారు ఎగ్గొట్టిన మొత్తం 33.1 శాతంగా ఉంది. రుణాల వసూళ్లకు ఎక్కువ విలువైన కేసులను దాఖలు చేసిన ప్రైవేటు బ్యాంకుల్లో ‘కోటక్ మహీంద్ర బ్యాంక్’ మొదటి స్థానంలో ఉండగా, ధనలక్ష్మీ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో విజయ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది.
ఈ వివరాలను బట్టి కూడా ప్రైవేటు బ్యాంకుల్లో డీఫాల్టర్లు ఎగ్గొట్టిందీ ఎక్కువా లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో ఎగ్గొట్టిందీ ఎక్కువ ? అన్న విషయం స్పష్టం కాదు. నిరర్థక ఆస్తుల మొత్తం ఎంతో తెలిస్తేగానీ ఆ విషయం తెలీదు. ఎప్పటికప్పుడు బ్యాంకు రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తారు కనుక నిరర్థక ఆస్తులు మాఫీ అవుతూ వస్తుంటాయి. ప్రైవేటు బ్యాంకులు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు రుణాలు ఎక్కువగా ఇస్తాయి. లాభం వస్తుందో, లేదో తెలియని మౌలిక సౌకర్యాల రంగానికి ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఎక్కువగా ఇస్తుంటాయి. ఈ లెక్కన అందుబాటులో ఉన్న అంకెల ప్రకారం ప్రైవేటు బ్యాంకుల్లోనే స్కాములు ఎక్కువగా ఉన్నట్లు లెక్క.
Comments
Please login to add a commentAdd a comment